• facebook
  • whatsapp
  • telegram

ఆరేళ్ల నిబంధన అవసరమా?

జాతీయ విద్యావిధానంలోని నిబంధనపై పునరాలోచించాలిఇంతవరకు అయిదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఇక నుంచి ఆరేళ్లు నిండిన తరవాతే చేర్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తమానం పంపింది. ఇది ఎంతవరకు అభిలషణీయమనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మారుతున్న కాలమిది. ప్రజల ఆశలూ ఆకాంక్షలను బట్టి చదువులూ మారాలి. అందుకు అనుగుణంగానే 2020లో జాతీయ విద్యావిధానాన్ని వెలువరించారు. ప్రస్తుత విజ్ఞానాధారిత ప్రపంచంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించి భారతదేశాన్ని విజ్ఞానపరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని ఈ విధానం ఉద్దేశిస్తోంది. 1986లో వెలువడిన జాతీయ విద్యావిధానం, 1992లో దానికి చేసిన సవరణ కూడా ఆశించిన ప్రయోజనాలను సాధించలేకపోయాయి. ఆ లోటును భర్తీ చేయడానికి 2020 విద్యావిధానం పూనుకొంది. 10+2 విధానానికి బదులు 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం విద్యార్థులకు చదువులో పునాది వేయడానికి అయిదేళ్లపాటు ‘ఫౌండేషనల్‌’ దశ ఉంటుంది. మూడేళ్లు సన్నాహక దశలో, మూడేళ్లు మాధ్యమిక దశలో, చివరి నాలుగేళ్లు సెకండరీ దశలో విద్యాభ్యాసం సాగుతుంది.


భవిష్యత్తుకు పునాది

విద్యాభ్యాసం పిల్లల నడవడికను మారుస్తుంది. సరైన విద్య బాలల మానసిక, శారీరక, భావోద్వేగ, నైతిక, సామాజిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. తార్కికంగా ఆలోచించడం, వివేచన జ్ఞానం నేర్పుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించడంతోపాటు సృజనాత్మకతనూ అది పాదుగొల్పుతుంది. బాలలు మొదట్లో తమ అవసరాల కోసమే మారాం చేస్తారు. వారిని ఇంటి నుంచి బడికి తీసుకువచ్చిన తరవాత నలుగురితో కలసిమెలసి ఉండటం నేర్చుకుంటారు. ఉత్తరోత్రా సమాజంలో బాధ్యతాయుత సభ్యుడిగా మెలగడానికి అక్కడే పునాది పడుతుంది. బాలబాలికలు ఎదిగేకొద్దీ ప్రతి దశలో వారి నడవడికలో మార్పులు వస్తాయి. ఇవి సరిగ్గా ఉండేలా చూడటానికి విద్య తోడ్పడుతుంది. పిల్లల ప్రవర్తనలో అభిలషణీయమైన మార్పులు రావడానికి కీలక సాధనమవుతుంది.


ఇక్కడ ప్రాథమిక దశ విద్యకు సంబంధించి డాక్టర్‌ కె.కస్తూరి రంగన్‌ కమిటీ రూపొందించిన జాతీయ పాఠ్యప్రణాళికా పథకాన్ని పరిశీలించాలి. దీని ప్రకారం, ఒకటో తరగతిలో చేరే బాలుడు లేదా బాలిక పరిశుభ్రతను నేర్చుకుని ఉండాలి. ఆహారాన్ని వృథా చేయకూడదు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. రంగులు, ఆకృతులను గుర్తించడం, వివిధ గుర్తులను జ్ఞాపకం పెట్టుకోవడం వంటి లక్షణాలు వారిలో ఏర్పడాలి. శారీరక చలనాలపై అదుపు, సమతూకం ఉండాలి. సొంత భావోద్వేగాలను గుర్తించగలగాలి. ఇతరుల భావాలను గౌరవించాలి. తాను కుటుంబంలో, సమాజంలో సభ్యుడిననే గ్రహింపుతో తోటి పిల్లలు, పెద్దవారితో చక్కగా మెలగాలి. చుట్టూ ఉన్న వస్తువులను, వాటి మధ్య సంబంధాలనూ గమనించగలగాలి. గణితాన్ని అర్థం చేసుకోవాలి. అంకెలను సరిగ్గా లెక్కపెట్టాలి. వివిధ వస్తువులను పోలికలను బట్టి సరైన గ్రూపులుగా, ఉప బృందాలుగా విభజించగలగాలి. వర్ణమాలలో అన్ని అక్షరాలను నేర్చుకోవాలి. రాయడం, చదవడంలో పట్టు సాధించాలి. అంతేకాదు, భాషాపరమైన నైపుణ్యాలను సంపాదించి అందరితో చక్కగా సంభాషించగలగాలి. చెప్పిన పనిని అర్థం చేసుకుని పూర్తిచేయగలగాలి. చిన్నచిన్న పాటలు, కవితలను పఠించడం, ఆలపించడం చేయాలి. తమ భావాలను చిత్ర రచన ద్వారా వ్యక్తం చేస్తుండాలి. ప్రభుత్వ ప్రమేయం లేని పాఠశాల పూర్వ దశలోనే బాలబాలికలు ఈ అంశాలన్నింటినీ నేర్చుకుంటున్నారు. దీనికి మూడేళ్లు అక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను అయిదేళ్లు రాకముందే ప్రీస్కూల్‌ విద్యలో చేరుస్తున్నారు. దీన్ని రెండు లేదా రెండున్నరేళ్లలోనే పూర్తిచేయిస్తున్నారు. చదువుకు వయసుతో నిమిత్తం లేదని అందరూ ఒప్పుకొంటారు. గతంలోకంటే ఇప్పుడు నేర్చుకోవడం చాలా సులభమైంది.


విద్యాహక్కు చట్టం-2009, సరికొత్త 5+3+3+4 విద్యావిధానం ప్రకారం ఒకటో తరగతిలో చేరే బాలబాలికలకు ఆరేళ్ల వయోపరిమితిని విధిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వివరిస్తోంది. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు చిన్నారులందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చిన విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తోంది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయులు అయిదేళ్లు నిండిన పిల్లలనే ఒకటో తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు.


ప్రభుత్వాలు పునరాలోచించాలి..

బాలలకు ఆరేళ్లు నిండిన తరవాతే ఒకటో తరగతిలో చేర్పించాలనే ప్రభుత్వ ఆదేశం శాస్త్రీయంగానూ లేదు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగానూ లేదు. అయిదేళ్ల వయసులో చదువుసంధ్యలు నేర్చుకోవడానికి అడ్డుపడేదేమీ లేదు. ఆ వయసులో కూడా పిల్లలు తమ చుట్టూ ఉన్నదాన్ని నిశితంగా గమనించి విషయ పరిజ్ఞానం సంపాదించగలరు. కొన్ని సమయాల్లో వారి ఊహాచాతుర్యం పెద్దలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రెండు నుంచి అయిదేళ్ల వయసులో పిల్లలు నర్సరీ స్కూళ్లలో చేరుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా కొత్తవారి మధ్య మసలుతూ లోకజ్ఞానం సంపాదిస్తున్నారు. అక్షరాలు, బొమ్మలు, తోటివారి సాంగత్యం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వారికి ఎంతగానో తోడ్పడుతోంది. ఉమ్మడి కుటుంబాలు అదృశ్యమైన ఈ రోజుల్లో భార్యాభర్తలు పట్టణాలు, నగరాల్లో వృత్తిఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందువల్ల ఇదివరకటిలా పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి తల్లిదండ్రులు, తాతయ్య నాయనమ్మలు అందుబాటులో ఉండటం లేదు. లేటు వయసు వివాహాలవల్ల తాము పదవీ విరమణ పొందే లోపే పిల్లలను ఒక దారిలో పెట్టాలని తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. వీరికి ప్రతి సంవత్సరమూ విలువైనదే. అందుకే ఒకటో తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయోపరిమితి విధించడం వారికి మింగుడుపడటం లేదు. వాస్తవానికి ఈ నిబంధన తల్లిదండ్రులకు వరంగా కాక శాపంగా పరిణమిస్తుంది. కాబట్టి ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు పునరాలోచన చేయాలి.


విద్య కోసం ఉన్నదంతా ఊడ్చి..

వృత్తి లేదా ఉద్యోగంలో స్థిరపడిన తరవాతే వివాహం చేసుకోవాలన్న భావన నేటి యువతలో ఉంది. దాంతో చాలామంది 30 ఏళ్ల తరవాతే పిల్లల్ని కంటున్నారు. వారి చదువులు పూర్తికాకముందే చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఆ తరవాత కూడా పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం చేతిలో ఉన్నదంతా ఖర్చుచేసే వారెందరో! ఏతావతా ఈనాటి తల్లిదండ్రులకు పిల్లల చదువు విషయంలో ఒక్క సంవత్సరం ఆలస్యమైనా భరించలేని స్థితి నెలకొన్నది. అందువల్ల పిల్లల్ని బడిలో చేర్చడానికి ఆరేళ్ల వరకు ఆగడం వారికి కష్టమే. కాబట్టి, పాఠశాలలో చేర్పించే అంశంపై ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించడం అవసరం. దిల్లీలో పాఠశాల పూర్వవిద్య, ప్రాథమిక విద్యపై నియమించిన అశోక్‌ గంగూలీ కమిటీ- ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు అయిదేళ్లు నిండాలని సిఫార్సు చేసింది.


- డాక్టర్‌ జి.జగన్మోహనరావు

(ఉమ్మడి ఏపీలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి విశ్రాంత ఆచార్యులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆహారభద్రతకు విఘాతం

‣ ఇజ్రాయెల్‌ అమానుష హత్యాకాండ

‣ కృత్రిమ మేధ ప్రభావమెంత?

‣ పర్యావరణానికి యుద్ధ గాయాలు

‣ రష్యా - చైనా చెట్టపట్టాల్‌.. భారత్‌పై ప్రభావమెంత?

‣ ప్రాచీన జ్ఞానమా.. నవీన విజ్ఞానమా?

Posted Date: 03-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని