• facebook
  • whatsapp
  • telegram

మహాలయం ముప్పున హిమాలయం



హిమాలయ ప్రాంతం ఉత్తరాఖండ్‌లో అటవీ విధ్వంసానికి వ్యతిరేకంగా అయిదు దశాబ్దాల క్రితం మొదలైన చిప్కో ఉద్యమం చరిత్రలో కీలక స్థానం సంపాదించింది. పర్యావరణ కార్యకర్త సుందర్‌లాల్‌ బహుగుణ మార్గదర్శకత్వంలో స్థానిక మహిళలు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. యాభై ఏళ్ల తరవాత పరికిస్తే హిమాలయ ప్రాంతం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.


ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అటవీ కాంట్రాక్టర్లు, అధికార గణం భారీ వృక్షాలను నాశనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ యాభై ఏళ్ల క్రితం స్థానిక మహిళలు ఉద్యమించారు. చెట్లను ఆలింగనం చేసుకొని నిరసన తెలిపారు. ఇదే చిప్కో ఉద్యమంగా ప్రసిద్ధి పొందింది. హిందీలో చిప్కో అంటే కౌగిలించుకోవడం అని అర్థం. అనంతర కాలంలో ఈ ఉద్యమ స్ఫూర్తి మొత్తం హిమాలయ ప్రాంతానికి పాకింది. ప్రకృతి పరిరక్షణ కోసం అప్పట్లో నారీమణులు గళమెత్తిన అదే హిమాలయ భూమి ప్రస్తుతం తీవ్ర అస్థిరతలో కొట్టుమిట్టాడుతోంది. వరద బీభత్సం, మట్టిపెళ్లలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం ఇక్కడ పరిపాటి అయ్యాయి. ఉత్తరాఖండ్‌లో గత నవంబరులో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. రెండు వారాలపాటు శ్రమించి వారిని వెలుపలికి తీసుకొచ్చారు. చమోలీ జిల్లాలోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లు పగుళ్లుబారుతుండటం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నింపుతోంది. స్థానికంగా జలవిద్యుత్తు ప్రాజెక్టులను విచ్చలవిడిగా నిర్మిస్తున్నందువల్ల ఈ ప్రాంతం ఉనికి ప్రమాదంలో పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


పర్యటక దుష్ప్రభావం

ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌ పుణ్య క్షేత్రాలను కలిపే చార్‌ధామ్‌ ప్రాజెక్టు ప్రకృతి సమతూకాన్ని దెబ్బతీస్తున్నదని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నాలుగు క్షేత్రాలను అన్ని రుతువుల్లో సందర్శించడానికి వీలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పెద్దయెత్తున రోడ్లను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అయిదు వందల హెక్టార్లలో అడవులు కనుమరుగవుతాయని, నలభై వేలకు పైగా చెట్లను తొలగించాల్సి ఉంటుందని అంచనా. పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకుని వాతావరణాన్ని సంరక్షిస్తానని భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో చేసిన వాగ్దానాలకు చార్‌ధామ్‌ ప్రాజెక్టు భంగం కలిగిస్తోందని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు.


భౌగోళిక చరిత్రను పరికిస్తే- హిమాలయాలు కొత్తగా పుట్టుకొచ్చిన పర్వతాలు. ఇవి ఇప్పటికీ ఎదుగుతూనే ఉన్న యౌవన పర్వతాలు. ఇక్కడ నిత్యం భూకంప ప్రమాదం పొంచి ఉంటుంది. భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, భూటాన్‌, చైనాలలో హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. భారత్‌లోని హిమాలయ ప్రాంతంలో ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు కరిగిపోతున్నాయి. విస్తరిస్తున్న పట్టణీకరణ, టూరిజం, రోడ్లు, సొరంగాల నిర్మాణం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. రహదారులు నిర్మించేటప్పుడు కొండలను తవ్వి శిథిలాలను నదుల్లో పడవేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరదలు సంభవిస్తున్నాయి. ఇలా ఇప్పటికే దెబ్బతింటున్న హిమాలయాల్లో 900 కిలోమీటర్ల మేర చార్‌ధామ్‌ ప్రాజెక్టును చేపట్టడం విపత్తును కొనితెచ్చుకోవడమేనని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేదని వారు విమర్శిస్తున్నారు. 


భారతీయ హిమాలయ ప్రాంతంలో మొత్తం 10 రాష్ట్రాలున్నాయి. వాటిలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో పర్యటక కార్యకలాపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హిమాలయాల్లో పట్టణాల నుంచి ఏటా 10 లక్షల టన్నుల చెత్త, మురుగు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ఒక్క పర్యటకం వల్ల 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. 2025 నాటికి హిమాలయ పర్వత రాష్ట్రాల్లో పర్యటకుల తాకిడి ఏటా 24 కోట్లకు చేరుతుందని అంచనా. 2015లో 10 కోట్లమంది మాత్రమే ఈ రాష్ట్రాలను సందర్శించారు. హిమాలయ రాష్ట్రాల్లో 55శాతం వ్యర్థాలు గృహాలు, హోటళ్ల నుంచి వస్తున్నట్లు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్‌) అధ్యయనం వెల్లడించింది. 21శాతం వ్యర్థాలు రోడ్లు, భవనాల నిర్మాణం వల్ల ఉత్పన్నమవుతున్నాయి. అన్నిరకాల వ్యర్థాలను జాగ్రత్తగా నిర్మూలించడం, పునర్వినియోగంలోకి తేవడం తప్పనిసరి. లేదంటే హిమాలయ ప్రాంతం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉత్తర భారతానికి ప్రాణసమానమైన జీవనదులన్నీ హిమాలయాల్లోనే పుడుతున్నాయి. హిమాలయాల్లో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే దాని దుష్ఫలితాలను కోట్లాది ప్రజలు అనుభవించాల్సి ఉంటుంది. మరోవైపు కర్బన ఉద్గారాల వల్ల హిమాలయాలపై మంచు కరిగిపోతోంది. దీనివల్ల మున్ముందు గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల ప్రవాహాల్లో ఎన్నో మార్పులొస్తాయి.


ప్రకృతికి విఘాతం

హిమాలయాల్లో వినాశకర కార్యకలాపాలకు నిర్దిష్ట కాలపరిమితిలో స్వస్తి చెప్పడానికి సమగ్ర ప్రణాళిక రచించి, అమలు చేయాలని 2023 మార్చిలో కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ అధ్యక్షతలోని పార్లమెంటరీ స్థాయీసంఘం కేంద్రానికి సూచించింది. హిమాలయ రాష్ట్రాల్లో పర్యటక కార్యకలాపాలు విపరీతంగా పెరగడం, ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, గెస్ట్‌ హౌస్‌ల నిర్మాణం యథేచ్ఛగా సాగిపోతూ ప్రకృతిని దెబ్బతీస్తున్నదని ఆవేదన వ్యక్తీకరించింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని సిఫార్సు చేసింది. మౌలిక వసతులు, పౌర నిర్మాణాలకు అనుమతి ఇచ్చేముందు అవి పర్యావరణానికి హాని చేస్తాయా అని మదింపు జరగాలని కోరింది. హిమాలయ ప్రాంతంలో పర్యావరణానికి భంగం కలగని రీతిలో అభివృద్ధి సాధించడంపై భారత్‌ దృష్టి సారించాలి. ఇందుకోసం ఇతర దేశాలు అనుసరిస్తున్న మేలిమి విధానాలను అధ్యయనం చేసి, ఆచరణలోకి తేవాలి.


ప్రత్యేక ప్రణాళిక

పర్యావరణ పరంగా దేశాల స్థితిగతులను అంచనా వేయడానికి ప్రపంచ ఆర్థిక వేదిక 2002లో పర్యావరణ పనితీరు సూచీ(ఈపీఐ)ని రూపొందించింది. 2022లో ఈపీఐ సూచీలో బ్రిటన్‌, ఫిన్లాండ్‌, మాల్టా, స్వీడన్‌లు అగ్రగాములుగా నిలిచాయి. భారత్‌ 180 దేశాల సూచీలో అట్టడుగు స్థానాన్ని మూటగట్టుకుంది. హిమాలయ ప్రాంతంలోని ప్రకృతి వనరులు, జన సంస్కృతి, సంప్రదాయ విజ్ఞానాలను సమర్థంగా వినియోగించుకొని అభివృద్ధి సాధించడానికి పర్యావరణవేత్త సునీతా నారాయణ్‌ 2013లోనే ఒక వ్యూహాత్మక ప్రణాళికను ప్రతిపాదించారు. హిమాలయాల్లోని అడవులు, నదులు, వ్యవసాయ భూముల వినియోగంలో అక్కడ నివసించే జనసముదాయాల వాణికి ప్రాధాన్యమివ్వాలని ఆ ప్రణాళిక పిలుపిచ్చింది. వారి సమస్యలను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రజ్ఞులు, పర్యావరణ ఉద్యమకారుల సలహాలు సూచనలను ప్రభుత్వం శ్రద్ధగా ఆలకించి సమస్యలకు సమర్థ పరిష్కారాన్ని కనుగొనాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వేచ్ఛా వాణిజ్యంలో మరో ముందడుగు

‣ స్వల్ప వ్యయం సత్వర న్యాయం

‣ సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

Posted Date: 27-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం