• facebook
  • whatsapp
  • telegram

సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధితదుపరి యుద్ధాన్ని స్వదేశీ ఆయుధాలతోనే గెలవబోతున్నామని 2019లో నాటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. రూ.2.5 లక్షల కోట్లతో 2025కల్లా స్వదేశీ ఆయుధోత్పత్తికి 340 భారతీయ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రస్తుత ప్రధాన సైనికాధికారి జనరల్‌ మనోజ్‌ పాండే ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు పడుతున్నాయి.


భారత్‌లో తయారీ కింద 2047కల్లా రక్షణపరమైన ఆత్మనిర్భరత సాధనకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని భారత నౌకాదళం గతేడాది ప్రకటించింది. స్వదేశీ పరిశ్రమలతో కలిసి ఆత్మనిర్భరత సాధిస్తామని ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హర్ష్‌ కుమార్‌ గత నెలలో స్పష్టంచేశారు. భారతీయ పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలు, సృజనశీలురు, పరిశోధన-అభివృద్ధి విభాగాలతో కలిసి అధునాతన సాంకేతికతలు, విమానాల ఉత్పత్తికి కృషి చేస్తున్నామని నిరుడు అక్టోబరులో వైమానిక దళాధిపతి వీఆర్‌ చౌధరి ప్రకటించారు. దేశ రక్షణ కోసం విదేశీ ఆయుధాలు, అవుట్‌ సోర్సింగ్‌ మీద ఆధారపడటం ప్రమాదకరమని త్రివిధ సాయుధ బలగాలు గుర్తించాయి. స్వదేశంలో ఆయుధోత్పత్తి సామర్థ్యాన్ని, సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో కృషి ప్రారంభించాయి.


స్వావలంబనే కీలకం

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ ప్రధానంగా అమెరికా, నాటో దేశాల ఆయుధాలపై ఆధారపడుతోంది. ఆయుధ సరఫరాలో ఆటంకాల వల్ల యుద్ధ రంగంలో ఎదురుదెబ్బలు తింటోంది. అమెరికా-నాటోలు ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఇతర చోట్ల, ఇతరత్రా పరిస్థితుల్లో ఉపయోగించడానికి అనువుగా రూపొందినవి. అందువల్ల రష్యాతో యుద్ధంలో అమెరికన్‌ ట్యాంకులు విజయవంతం కాలేకపోతున్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం కోసం ఉద్దేశించిన బిల్లు అమెరికా పార్లమెంటు ఆమోదం పొందలేకపోవడం పెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఐరోపా దేశాలు కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు, మందుగుండు అందించలేకపోవడం రష్యాకు అనుకూలిస్తోంది. రష్యా స్వదేశంలోనే పెద్దయెత్తున ఆయుధోత్పత్తి సాగించడమే కాదు- ఇరాన్‌, ఉత్తర కొరియా, చైనాల నుంచి అదనపు ఆయుధాలు సేకరించగలుగుతోంది. దీన్నిబట్టి రక్షణ రంగంలో స్వావలంబన ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో 2014లో ప్రారంభమైన రక్షణ పరమైన ఆత్మనిర్భరత క్రమంగా ఊపందుకొంది. ప్రైవేటు పరిశ్రమలు పెద్దయెత్తున ఆయుధోత్పత్తి చేపట్టాయి. 2017లో స్వదేశంలో ఆయుధోత్పత్తి విలువ రూ.740 కోట్లు. 2023లో అది లక్ష కోట్ల రూపాయలకు చేరింది. 2013-14లో భారత్‌ విదేశాలకు రూ.686 కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయగా, 2022-23లో రూ.16,000 కోట్ల ఎగుమతులు సాధించింది. వచ్చే అయిదేళ్లలో మరి 35,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయాలని ప్రధాని మోదీ గత నవంబరులో లక్ష్యం నిర్దేశించారు. ప్రపంచంలో ప్రధాన ఆయుధ ఎగుమతిదారులలో ఒకటిగా భారత్‌ను నిలపాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. 2018-19లో 46శాతం ఆయుధాలను విదేశాల నుంచి సేకరించగా, 2022 డిసెంబరులో అది 36.7శాతానికి తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రక్షణ అవసరాల్లో 75 శాతాన్ని స్వదేశంలోనే సేకరించామని వివరించింది. గడచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో రక్షణ సామగ్రి సేకరణకు 122 ఒప్పందాలు కుదుర్చుకోగా, వాటిలో 100 కాంట్రాక్టులు స్వదేశీ పరిశ్రమలతోనే కుదిరాయి. రక్షణ సాంకేతికతల అభివృద్ధి, నవీకరణ సాధన యత్నాలు ఫలిస్తున్నాయి. స్వదేశంలో ఉత్పత్తి చేయదలచిన ఆయుధాలు, విడిభాగాలకు సంబంధించి ప్రభుత్వం నాలుగు జాబితాలు విడుదల చేసింది. వీటిలో 30,000కు పైగా వస్తువులు ఉన్నాయి.


గణనీయ పురోగతి

విదేశీ ఆయుధ ఉత్పత్తిదారులను భారత్‌లో కర్మాగారాలు నెలకొల్పవలసిందిగా ప్రభుత్వం కోరుతోంది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) వాటాను 49 నుంచి 74శాతానికి పెంచింది. ఇలాంటి ప్రతిపాదనలకు శీఘ్రంగా అనుమతులు ఇస్తోంది. ఇంతవరకు రక్షణ రంగంలోకి రూ.5,077 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. స్వీడన్‌కు చెందిన ‘సాబ్‌-ఎస్‌ఏఏబీ’ సంస్థ భారత్‌లో ట్యాంకు విధ్వంసక రాకెట్ల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతోంది. భారత్‌, రష్యాలు కలిసి రూపొందించిన బ్రహ్మోస్‌ క్షిపణులను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇంకా ఆకాశ్‌ క్షిపణులు, రాడార్లు, సాయుధ కవచ శకటాలు, శతఘ్నులను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ల చట్రాలను, ఎఫ్‌-16 ఫైటర్‌ విమానాల రెక్కలను, సీ-295 రవాణా విమానాలను భారత్‌లో తయారు చేస్తున్నారు. అమెరికన్‌ సంస్థ లాఖీడ్‌ మార్టిన్‌ భారత్‌లో సీ130జె రవాణా విమానాల కూర్పు, మార్కెటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల ఇలాంటి కర్మాగారాన్ని నెలకొల్పడం ఇదే ప్రథమం. ఈ రవాణా విమానాన్ని ఏడు దేశాలు ఉపయోగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అదానీ-ఎల్బిట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంస్థ ఇజ్రాయెల్‌కు 20 హెర్మిస్‌ యూఏవీలను ఎగుమతి చేసింది. భారత రక్షణోత్పత్తిదారుల సంఘం ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నది. ఏకకాలంలో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్‌ రక్షణ రంగంలో స్వావలంబనకు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చేపట్టే ప్రాజెక్టులను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షించనున్నది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు రక్షణపరమైన పరిశోధన-అభివృద్ధికి మరిన్ని నిధులను వెచ్చించాల్సి ఉంది. శాస్త్ర విజ్ఞాన సంస్థలు ఈ కృషిలో భాగస్వాములు కావాలి. గడచిన పదేళ్లలో ఆయుధోత్పత్తిలో భారత్‌ గణనీయ పురోగతి సాధించినా, మున్ముందు మరెంతో చేయాలి.  


దిగుమతులపై ఆధారపడితే..

విదేశీ ఆయుధోత్పత్తిదారులు ఎప్పుడంటే అప్పుడు ఆంక్షలు విధించగలరు. విడిభాగాల సరఫరాను నిలిపి వేయగలరు. ఇది దిగుమతులపై ఆధారపడిన దేశాన్ని దెబ్బతీస్తుంది. ఉదాహరణకు పాకిస్థాన్‌కు సరఫరా చేసిన ఎఫ్‌-16 యుద్ధవిమానాలపై 24 గంటలూ అమెరికా పర్యవేక్షణ ఉంటుంది. ఆ యుద్ధ విమానాలకు కావలసిన క్షిపణులు, ఇతర అస్త్రాలు అమెరికా నుంచే రావలసి ఉంటుంది. ఇది పాక్‌ పోరాట సామర్థ్యాన్ని కుంటుపరుస్తుంది. గతంలో కార్గిల్‌ యుద్ధంలో భారత్‌కు అమెరికా జీపీఎస్‌ సేవలను నిలిపేసింది. దీంతో భారత్‌ ‘నావిక్‌’ పేరిట సొంత జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పరచుకుంది. విదేశీ ఆయుధాల దిగుమతికి వెచ్చించే ధనంతో స్వదేశంలోనే ఆయుధోత్పత్తి సాగిస్తే రక్షణ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. భారతీయులకు అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దేశార్థికానికి కొత్త ఊపు వస్తుంది. దీనికితోడు విదేశీ ఆయుధ కొనుగోళ్లలో అవినీతిని నివారించవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

‣ దేశంలో పేదరికం లెక్కలేనంత!

‣ పాక్‌ సైన్యం రాజకీయ చదరంగం

‣ చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

Posted Date: 22-03-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని