• facebook
  • whatsapp
  • telegram

స్వేచ్ఛా వాణిజ్యంలో మరో ముందడుగుసమీప భవిష్యత్తులోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్‌ లక్షించింది. ఇందులో భాగంగా పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో ఐరోపా స్వేచ్ఛాయుత వాణిజ్య సంఘం (ఎఫ్టా)తో ఇటీవల కుదిరిన ఒడంబడిక బహుళ ప్రయోజనదాయకం కానుంది.


నాలుగు దేశాలతో కూడిన ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఎఫ్టా)తో ఇండియాకు ఇటీవల చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఎఫ్టా ఒక స్వేచ్ఛా వాణిజ్య సంఘం. ఐరోపా సమాఖ్య (ఈయూ)కు భిన్నమైన ఎఫ్టాలో స్విట్జర్లాండ్‌, ఐస్‌ల్యాండ్‌, నార్వే, లిక్టన్‌స్టైన్‌లు సభ్యదేశాలు. ఈ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల వర్తక వృద్ధి, దానితోపాటే ఇండియాలో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. గడచిన పదేళ్లలో భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో పదో స్థానం నుంచి అయిదో స్థానానికి ఎగబాకింది. ఇండియా వ్యాపార సౌలభ్యానికి అగ్రాసనం వేయడంతోపాటు పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టి పారిశ్రామికోత్పత్తి, వ్యాపారం, ఎగుమతుల వృద్ధికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఎఫ్టాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్‌ 2008 నుంచి ప్రయత్నిస్తోంది. ఎఫ్టా ఇప్పటికే చైనా, కెనడా, దక్షిణ కొరియా వంటి 40 దేశాలతో 29 ఒప్పందాలు కుదుర్చుకుంది.


తక్కువ ధరలకే..

ఎఫ్టా దేశాలకు 2022-23లో భారత్‌ ఎగుమతుల విలువ 192 కోట్ల డాలర్లు. దిగుమతుల విలువ 1,674 కోట్ల డాలర్లు. ఎఫ్టా దేశాలతో భారత్‌కు మొదటి నుంచీ వాణిజ్య లోటే ఉంది. 2021-22లో భారత్‌-ఎఫ్టా దేశాల మధ్య 2,723 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. 2022-23లో ఇది 1,865 కోట్ల డాలర్లకు తగ్గింది. ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఎఫ్టా) దేశాలకు భారత్‌ ఎక్కువగా రసాయనాలు, పాక్షికంగా సానబట్టిన రత్నాలు, వజ్రాలు, ఔషధాలు, బోట్లు, నౌకలు, కొన్ని రకాల దుస్తులు, ఎలెక్ట్రానిక్‌ పరికరాలను ఎగుమతి చేస్తోంది. 2000 ఏప్రిల్‌-2023 డిసెంబరు మధ్య ఇండియాకు స్విట్జర్లాండ్‌ నుంచి వెయ్యి కోట్ల డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వచ్చాయి. అదే కాలానికి నార్వే నుంచి 72 కోట్ల డాలర్లకు పైగా ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. ఐస్‌ల్యాండ్‌ నుంచి 2.92 కోట్లు, లిక్టన్‌స్టైన్‌ నుంచి 10.52 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు తరలివచ్చాయి. భారత్‌లో 12వ అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు స్విట్జర్లాండే. ఇండియా మొత్తం ఎగుమతుల్లో 0.4శాతం ఎఫ్టాకు వెళుతుంటే, దిగుమతుల్లో 2.4శాతం ఆ నాలుగు దేశాల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే భారీ వాణిజ్య లోటు ఉన్నందువల్ల ఎఫ్టాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్‌ ఆచితూచి అడుగులు వేసింది.


తాజా ఒప్పందంవల్ల భారత్‌ నుంచి చేపలు, మాంసం, వంట నూనెలు, శుద్ధి చేసిన ఆహార ఎగుమతులకు ఎఫ్టా దేశాల్లో సుంకాలు విధించరు. హైటెక్‌ రంగాల్లో ఎఫ్టా నుంచి పెట్టుబడులు లభిస్తాయి. రాబోయే పదిహేనేళ్లలో ఎఫ్టా దేశాలు భారత్‌లో పది వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనివల్ల 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎఫ్టా దేశాల్లో ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలున్నాయి. రాజకీయ, ఆర్థిక రంగాల్లో అవినీతికి తావివ్వని దేశాలవి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌, ఎఫ్టా దేశాల మధ్య చాలా వస్తువులపై సుంకం లేకుండా వ్యాపారం జరుగుతుంది. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. స్విస్‌ వస్తు దిగుమతులపై ఏడు నుంచి పదేళ్ల వరకు సుంకాలు తొలగించనున్నందువల్ల భారతీయ మార్కెట్లో అవి చవకగా లభిస్తాయి. ట్యూనా, సాల్మన్‌ వంటి చేపలు, ఆలివ్‌, అవొకాడో వంటి పండ్లు, ఆలివ్‌ ఆయిల్‌, చాక్లెట్లు, బిస్కట్లు భారతీయ వినియోగదారులకు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్‌ ఫోన్లు, వైద్య సాధనాలు, మందులు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు సైతం చవకగా లభ్యమవుతాయి. ప్రస్తుతం సానబట్టిన వజ్రాలపై స్విట్జర్లాండ్‌ అయిదు శాతం సుంకం విధిస్తోంది. ఎఫ్టా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన అయిదేళ్లలో ఈ సుంకం 2.5శాతానికి తగ్గిపోతుంది. బంగారం మీద సుంకం రాయితీ దాదాపు ఉండదనే చెప్పాలి.


స్వావలంబనకు తోడ్పాటు

ఎఫ్టా మాదిరిగానే బ్రిటన్‌తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చలు కొద్దికాలంపాటు వాయిదాపడ్డాయి. గడచిన అయిదేళ్లలో పలు మిత్ర దేశాలతో ఇండియా 13 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవలే మారిషస్‌, యూఏఈ, ఆస్ట్రేలియాలతో మూడు ఒప్పందాలు కుదిరాయి. ఎఫ్టాతో కుదిరిన ఒప్పందం వ్యవసాయ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడుల ప్రవాహానికి దోహదం చేస్తుంది. ఎఫ్టా దేశాలు వస్తు సరఫరా కోసం చైనాపై ఆధారపడటం తగ్గించి భారత్‌ వైపు మొగ్గు చూపుతాయి. ఎఫ్టా దేశాలు తమ పింఛన్‌, బీమా నిధులను భారత్‌లో పెట్టుబడి పెట్టగలుగుతాయి. నార్వేకి 1.6 లక్షల కోట్ల డాలర్ల సార్వభౌమ నిధి, 1500 కోట్ల డాలర్ల హరిత సాంకేతికతల నిధి ఉన్నాయి. వాటి నుంచీ భారత్‌కు పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఇండియా పలు రంగాల్లో స్వావలంబన సాధించడానికి ఎఫ్టా భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుంది.


బలమైన వాణిజ్య బంధం

ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఎఫ్టా) దేశాల్లో స్విట్జర్లాండ్‌, నార్వేలతో ఇప్పటికే భారత్‌కు బలీయ వాణిజ్య బంధం ఉంది. స్విట్జర్లాండ్‌ అంతర్జాతీయ నవీకరణ సూచీలో ఆది నుంచీ అగ్రస్థానంలో నిలుస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి స్విట్జర్లాండ్‌కు 134 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. దిగుమతుల విలువ 1,579 కోట్ల డాలర్లు. స్విట్జర్లాండ్‌ నుంచి ఇండియా ప్రధానంగా బంగారం, యంత్రాలు, ఔషధాలు, బొగ్గు, గడియారాలు, సోయాబీన్‌ నూనె, చాక్లెట్లు తదితరాలు దిగుమతి చేసుకొంటోంది. భారతదేశ బంగారం దిగుమతుల్లో 41శాతం, విలువైన లోహాలలో అయిదు శాతం స్విట్జర్లాండ్‌ నుంచే వస్తున్నాయి. భారత్‌లోని నొవార్టిస్‌, రోష్‌ ఔషధ కంపెనీలు స్విట్జర్లాండ్‌కు చెందినవే.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వల్ప వ్యయం సత్వర న్యాయం

‣ సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

‣ దేశంలో పేదరికం లెక్కలేనంత!

‣ పాక్‌ సైన్యం రాజకీయ చదరంగం

‣ చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

‣ చిత్తడి నేలలపై పెరుగుతున్న ఒత్తిడి

Posted Date: 27-03-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని