• facebook
  • whatsapp
  • telegram

భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

భవిష్యత్తులో యుద్ధరంగాల్లో డ్రోన్లదే ముఖ్య పాత్ర. ప్రధాని మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా సాయుధ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారీ ఒప్పందానికి అడుగులు పడటం కీలక పరిణామం. హిందూ మహాసముద్రంతోపాటు చైనా సరిహద్దుల్లో భారత భద్రత, నిఘా సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ డ్రోన్లు ఉపకరించనున్నాయి.

డ్రోన్లు నిఘా కార్యకలాపాలకు, ఉగ్రవాదులు తదితరులపై దాడులకు అమోఘంగా ఉపకరిస్తూ ఆధునిక యుద్ధం తీరుతెన్నులను విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి. ఆర్మీనియా-అజర్‌ బైజాన్‌ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో డ్రోన్లు నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. అత్యాధునిక డ్రోన్లకు ఎక్కువ సమయంపాటు గగనతలంలో ఎగిరే సామర్థ్యం ఉంటుంది. పగలూ రాత్రీ, వాతావరణ పరిస్థితులతో నిమిత్తం లేకుండా నిఘా, దాడులు వంటి విధులు నిర్వర్తించగలవు.  హిమాలయాలు, రాజస్థాన్‌ ఎడారి, సముద్ర జలాలపైనా సమర్థంగా పని చేయగలవు. పాక్‌, చైనా సేనలు, ఉగ్రవాదుల కదలికలపై నిరంతరం దృష్టి సారిస్తాయి. లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించడానికి, సరకులు ఆయుధాల బట్వాడా వంటి కార్యకలాపాల్లో సైతం డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా, పాకిస్థాన్‌ సరిహద్దులు, బంగాళాఖాతం, అండమాన్‌-నికోబార్‌ దీవులు, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలలో గూఢచర్యం, గగనతల నిఘా, శత్రు లక్ష్యాల నిర్దేశం, ప్రత్యర్థుల సంచారాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టడంలో భారత్‌కు డ్రోన్లు కీలకంగా మారతాయి.  అందుకే భారత సాయుధ దళాలు డ్రోన్ల సేకరణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి.

సొంత తయారీకి సిద్ధం

భారత సైన్యం, వైమానిక, నౌకా దళాలు 2020 నుంచే డ్రోన్ల దళాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణలు రేగినప్పుడు భారత సైన్యం ఇజ్రాయెల్‌ నుంచి నాలుగు అత్యాధునిక హెరన్‌-2 డ్రోన్లను లీజుకు తీసుకుంది. చైనా సరిహద్దులో నిఘా, సైనిక స్థావరాలకు ఆహారం, ఆయుధాల చేరవేతకు భారత సైన్యం 2,000 డ్రోన్ల కోసం ఆర్డరు పెట్టింది. ఆర్మీనియా-అజర్‌ బైజాన్‌ పోరులో కామికాజీ (ఆత్మాహుతి) డ్రోన్లు నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. భారత్‌-ఇజ్రాయెల్‌ దేశాలు కలిసి రూపొందించే 100 కామికాజీ డ్రోన్ల కోసం సైన్యం ఆర్డరు పెట్టింది. కొన్ని డ్రోన్లతో కాకుండా పెద్ద సమూహాన్ని దాడికి నియోగించే విషయమై ప్రపంచమంతటా జరుగుతున్న ప్రయోగాలు ఇంకా కార్యరూపం ధరించలేదు. భారత్‌ ఇప్పటికే ఇలాంటి 100 డ్రోన్ల దండును బెంగళూరు ఏరో ఇండియా కార్యక్రమంలో ప్రదర్శించింది. ఇవి 50 కిలోమీటర్ల దూరంలోని శత్రువులపైనా విరుచుకుపడగలవు. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే ఇజ్రాయెలీ హెరన్‌ డ్రోన్ల దళం ఉంది. వీటికి అధునాతన కమ్యూనికేషన్‌ సౌకర్యాలు, దూరశ్రేణి క్షిపణులను అమర్చడానికి వైమానికదళం ప్రాజెక్ట్‌ చీతాను చేపట్టింది. స్వదేశంలో నిర్మించిన ఏఎల్‌ఎస్‌-50 కామికాజీ డ్రోన్లనూ అమ్ములపొదిలో చేర్చుకుంది. నింగిలో ఎక్కువసేపు తిరుగుతూ అవసరమైనప్పుడు బాంబులు కురిపించగల లాయిటర్‌ డ్రోన్ల అభివృద్ధికి నౌకాదళం భారత డ్రోన్‌ సమాఖ్యతో చేతులు కలిపింది. భారత నౌకా దళం 2020లో అమెరికా నుంచి రెండు సీగార్డియన్‌ నిఘా డ్రోన్లను లీజుకు తీసుకుంది. ఆఫ్రికా తూర్పు తీరం నుంచి ఇండొనేసియా వరకు సువిశాల సముద్ర జలాల్లో నౌకల సంచారంపై నిఘా వేసే సామర్థ్యం సీగార్డియన్ల సొంతం. వీటిని తూర్పు లద్దాఖ్‌లో చైనాపై నిఘాకూ ఉపయోగించారు. త్వరలో అమెరికా నుంచి సేకరించే డ్రోన్లను పాక్‌, చైనా సరిహద్దులు, అండమాన్‌-నికోబార్‌, లక్ష దీవులు, సముద్ర జలాల్లో నిఘాకు వినియోగిస్తారు.

చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు సమసిపోనందువల్ల డ్రోన్లు భారత్‌కు ఎంతో అవసరం. ఈ క్రమంలో వీటిని సొంతంగానే తయారు చేసుకోవడానికి భారత్‌ నడుంకట్టింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తయారు చేసిన తపస్‌-బీహెచ్‌ డ్రోన్‌ పగలూ రాత్రి నింగిలో ఎగరగలదు. విస్పష్టమైన ఛాయాచిత్రాలు, వీడియోలను తీయగలదు. ఈ ఏడాది ఆర్చర్‌ ఎన్‌.జి. అనే మరొక సాయుధ డ్రోన్‌ను డీఆర్‌డీఓ పరీక్షించనున్నది. 300 కిలోల బాంబులు, క్షిపణులను మోసుకెళ్ళి శత్రు వైమానిక స్థావరాలు, ట్యాంకులను ధ్వంసం చేయగల సామర్థ్యం దీని సొంతం.  స్వల్ప దూరాలకు పయనించే సాయుధ ఆర్చర్‌ డ్రోన్‌నూ తయారుచేసి ప్రయోగాలు జరుపుతున్నారు. అధిక ఎత్తులో, దీర్ఘ సమయంపాటు విహరిస్తూ నిఘా, దాడి విధులను నిర్వహించగల హేల్‌ తరగతి వైమానిక వ్యవస్థలనూ డీఆర్‌డీఓ రూపొందిస్తోంది.

రక్షణ శాఖ చేయూత

స్వదేశీ డ్రోన్ల అభివృద్ధిలో భాగంగా భారత రక్షణ శాఖ వివిధ కార్యక్రమాలకు చేయూతనిస్తోంది. సైనిక డ్రోన్ల నవకల్పనలకు నిధులిచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం వైమానిక దళం, భారత సైన్యం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తూ ఆధునిక డ్రోన్ల రూపకల్పనలో ఔత్సాహికులను భాగస్వాముల్ని చేస్తున్నాయి. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద డ్రోన్‌ సాంకేతికత రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలను, ఐఐటీలను ప్రోత్సహిస్తోంది. ఈ రంగంలో ప్రైవేటు డ్రోన్‌ కంపెనీలతో 2022 సెప్టెంబరులో త్రివిధ సాయుధ బలగాలు రూ.500 కోట్ల కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం భారతీయ డ్రోన్‌ కంపెనీలకు కీలక విడిభాగాలను తయారుచేసే సామర్థ్యం కొరవడటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇకపై వీటి తయారీని దేశీయంగానే చేపట్టేందుకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) డ్రోన్ల విడిభాగాల ఉత్పత్తికీ వర్తింపజేస్తామని కేంద్రం ప్రకటించింది. ఉగ్రవాదులపై పోరులో సైనికులు, పైలట్లు, నావికుల బదులు డ్రోన్లను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ప్రపంచంలో డ్రోన్‌ శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, పరిశోధన సంస్థలు గట్టి కృషితో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. శత్రు డ్రోన్లను నింగిలోనే నాశనం చేయగల నిరోధక వ్యవస్థ రూపకల్పనకూ ప్రాధాన్యం కల్పించాలి.

నిరోధక వ్యవస్థ కీలకం

ప్రస్తుతం ఉగ్రవాదులు, స్మగ్లర్లు పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్‌కు మాదకద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను దొంగరవాణా చేయడం అధికమైంది. ఇందుకోసం చౌకగా దొరికే డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చిన్నాచితకా డ్రోన్లతోపాటు శత్రుదేశాలు ప్రయోగించే భారీ డ్రోన్లను సైతం నింగిలోనే తుత్తునియలు చేయగల సామర్థ్యాన్ని భారత్‌ సముపార్జించాల్సి ఉంది. డ్రోన్‌ నిరోధక సాంకేతికత దిశగా డీఆర్‌డీఓ తొలి అడుగు వేసింది. శత్రు డ్రోన్లను కనిపెట్టి, నిరోధించి, నాశనం చేసే ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కీలక అంశాలపై ప్రతిష్టంభన

‣ ఉపాధికి ఊతం.. ఎఫ్‌డీఐలు!

‣ విద్యుత్‌ వాహనాలదే నవ శకం

‣ స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షాకవచం

Posted Date: 28-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం