• facebook
  • whatsapp
  • telegram

కీలక అంశాలపై ప్రతిష్టంభన

భారత్‌ - నేపాల్‌ దౌత్య సంబంధాల్లో ఒడుదొడుకులను చైనా అవకాశంగా తీసుకొని కాఠ్‌మాండూపై పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. ఈ విషయం నేపాల్‌ పాలకులకు అర్థమవుతోంది. న్యూదిల్లీ విరోధిగా, బీజింగ్‌ మిత్రుడిగా పేరున్న నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) ఇటీవలి భారత్‌ పర్యటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే, ఆయన పర్యటనలో కీలక సమస్యలు ప్రస్తావనకు రాలేదు.

నేపాల్‌ ప్రధానిగా ఎవరైనా బాధ్యతలు స్వీకరించిన తరవాత తొలుత భారత్‌లో పర్యటించడం ఆనవాయితీ. 2008లో ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ప్రచండ చైనాలో పర్యటించారు. ఈసారి మాత్రం ఆయన న్యూదిల్లీ బాట పట్టడం కాఠ్‌మాండూ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తోంది. ఈ పర్యటనలో ఆర్థిక సంబంధాలపైనే అధికంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇరుదేశాలు మొత్తం ఏడు ఒప్పందాలు కుదుర్చుకొన్నాయి. ఆరు ప్రాజెక్టులను భారత ప్రధాని మోదీతో కలిసి ప్రచండ ప్రారంభించారు. మోతిహారి-అమ్లెఖ్‌గంజ్‌ ఇంధన పైపులైన్‌ను మరో 69 కిలోమీటర్లు విస్తరించడం, సమీకృత చెక్‌పోస్టుల అభివృద్ధి, రవాణా, జలవిద్యుత్తు, దీర్ఘకాలం విద్యుత్తు కొనుగోళ్లు, భారత్‌లో జలమార్గాల వినియోగం తదితర ఒప్పందాలు కుదిరాయి. భారత్‌లోని రూపయీడీహా, నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌లో సమీకృత చెక్‌పోస్టులను లాంఛనంగా ప్రారంభించారు. బిహార్‌లోని బథ్‌నాహా నుంచి నేపాల్‌ కస్టమ్‌ యార్డ్‌ వరకు గూడ్స్‌ రైలుకు పచ్చజెండా ఊపారు. 40 మెగావాట్ల నేపాల్‌ జలవిద్యుత్‌ను భారత్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు తరలించేందుకు ఉద్దేశించిన ఒప్పందానికీ ఆమోదం లభించింది. భారత్‌ నేపాల్‌ సంబంధాలు ఇప్పటికే హిట్‌ అయ్యాయని.. వాటిని సూపర్‌హిట్‌ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

భూ మార్పిడి ఉద్దేశం

వాస్తవానికి 1950 నాటి ఇరు దేశాల ఒప్పందం పునస్సమీక్ష, సరిహద్దు వివాదాలపై కఠిన వైఖరి తీసుకోవాలంటూ ఈ పర్యటనకు ముందు నేపాల్‌ మాజీ ప్రధానులు కేపీ ఓలీ, షేర్‌ బహదూర్‌ దేవ్‌బా వర్గాలు ప్రచండపై ఒత్తిడి తెచ్చాయి. వాటిని తట్టుకొని ప్రచండ తన పర్యటనలో పరిపక్వత ప్రదర్శించారనే చెప్పాలి. అయితే, ఆయన పర్యటనను గమనిస్తే ఇరు దేశాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయాలు, వివాదాలపై సరైన దృష్టి సారించలేదని అర్థమవుతుంది. భారత్‌-నేపాల్‌ మధ్య 98శాతం సరిహద్దులు పక్కాగా ఉన్నాయి. కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధురా వద్ద మాత్రం భూ వివాదాలు తేలలేదు. తాజా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భూవివాద పరిష్కారంపైనా మోదీతో చర్చించినట్లు ప్రచండ వెల్లడించారు. భారత్‌-బంగ్లాదేశ్‌ మోడల్‌ సైతం తమ చర్చల్లో ఉన్నట్లు చెప్పారు. గతంలో భారత్‌, బంగ్లాదేశ్‌లు పరస్పరం పలు భూభాగాలను మార్పిడి చేసుకున్నాయి. ఇండియాతో ఇలాంటి ఒప్పందాన్నే కుదుర్చుకోవాలనే ఉద్దేశం ప్రచండ వ్యాఖ్యల వెనక దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌లోని సిలీగుడీ కారిడార్‌ నుంచి బంగ్లాదేశ్‌కు మార్గం పొందాలని నేపాల్‌ భావిస్తున్నట్లు కాఠ్‌మాండూ పోస్టు పత్రిక ప్రధాని ప్రచండను ఉటంకిస్తూ అనంతరం కథనాన్ని సైతం ప్రచురించింది. వ్యూహాత్మకంగా కీలకమైన సిలీగుడీ నడవాను వదులుకొనేందుకు భారత్‌ సిద్ధంగా లేదు. మరోవైపు భూమార్పిడి అవకాశం నేపాల్‌ రాజ్యాంగంలోనే లేదు. దాంతో నాలిక కరచుకున్న ప్రచండ- తాను భూ మార్పిడిపై మాట్లాడలేదంటూ ఆ దేశ పార్లమెంటుకు వివరణ ఇచ్చుకొన్నారు.

గూర్ఖా సైనికుల సమస్య

భారత సైన్యంలో ఏడు రెజిమెంట్లలో 40 వేల మంది గూర్ఖా సైనికులు పనిచేస్తున్నారు. మన సైన్యం నుంచి రిటైరైన దాదాపు 1.35 లక్షల గూర్ఖాలు నేపాల్‌లో నివాసం ఉంటున్నారు. వారికి పింఛన్‌ రూపంలో ఏటా 62 కోట్ల డాలర్లు అందుతుంది. ఈ మొత్తం కాఠ్‌మాండూ సైనిక బడ్జెట్‌కన్నా అధికం. ఒక రకంగా చూస్తే అక్కడ నివసించే మాజీ సైనికులు భారత్‌కు ప్రతినిధుల వంటి వారు. ఇరు దేశాల సంబంధాల పెంపులో వారి పాత్ర కీలకం. అగ్నిపథ్‌ అమలుతో నాలుగేళ్ల సర్వీసు తరవాత బయటకు వచ్చే గూర్ఖాల పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. దాంతో వారు భారత సైన్యంలో చేరేందుకు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. వారిలోని భయాలను పోగొట్టేందుకు ప్రచండ పర్యటనలో ఎలాంటి ప్రయత్నం జరగలేదు. మరోవైపు చైనా సైన్యంలో గూర్ఖాల నియామకానికి యత్నాలు జరుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే భారత్‌కు భవిష్యత్తులో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. నాలుగేళ్ల అనంతరం సైన్యం నుంచి బయటకు వచ్చే గూర్ఖాలకు ఉపాధి కల్పించే అంశాన్ని ఇండియా పరిశీలించాలి. చైనా గుప్పిట్లో నేపాల్‌ చిక్కకుండా జాగ్రత్త వహించాలి. మొత్తంగా ఇరు దేశాల మధ్య నలుగుతున్న ప్రధాన సమస్యలు నేపాల్‌లో రాజకీయ పార్టీలకు, చైనాకు అనుకూల సాధనాలుగా మారకముందే వాటి పరిష్కారానికి ఇండియా వేగంగా అడుగులు వేయాలి.

- ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉపాధికి ఊతం.. ఎఫ్‌డీఐలు!

‣ విద్యుత్‌ వాహనాలదే నవ శకం

‣ స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షాకవచం

‣ సరిహద్దుల్లో కీలక గ్రామాలు

‣ ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం

‣ ప్రపంచానికి కొత్త ముప్పు

‣ ఆన్‌లైన్‌ వాణిజ్యంలో సర్కారీ సేవలు

Posted Date: 21-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం