• facebook
  • whatsapp
  • telegram

ఆరావళిని దోచేస్తున్నారు!

ప్రపంచంలోనే పురాతనమైన పర్వత శ్రేణుల్లో ఆరావళి ఒకటి. వాటిలో మితిమీరిన మానవ కార్యకలాపాలు, వనరుల దోపిడి కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దానివల్ల పలు రాష్ట్రాలతోపాటు రాజధాని దిల్లీ ప్రాంతం సైతం భవిష్యత్తులో తీవ్ర వాతావరణ దుష్పరిణామాలతో తల్లడిల్లే ప్రమాదం పొంచి ఉంది.

పశ్చిమ భారతంలోని గుజరాత్‌లోని ఖేడ్‌బ్రహ్మ నుంచి మొదలై రాజస్థాన్‌, హరియాణా, దిల్లీ రాష్ట్రాల్లో ఆరావళి పర్వతాలు విస్తరించాయి. వాటిలో 80శాతం పర్వతాలు రాజస్థాన్‌లో ఉన్నాయి. అందులో అతి ఎత్తయిన గురుశిఖర్‌ మౌంట్‌ అబూలో ఉంది. అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు, ప్రసిద్ధ కోటలు, దేవాలయాలతో ఆయా రాష్ట్రాల చరిత్ర, సంస్కృతికి ఆధార కేంద్రాలుగా ఆరావళి పర్వతాలు భాసిల్లుతున్నాయి. అవి ప్రస్తుతం ఖనిజాల తవ్వకం, అటవీ నిర్మూలన, మితిమీరిన స్థిరాస్తి నిర్మాణాలతో కునారిల్లుతున్నాయి. 1975 నుంచి 2019 వరకు దాదాపు ఎనిమిది శాతం ఆరావళి కొండలు కనుమరుగయ్యాయని రాజస్థాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రొఫెసర్‌ శర్మ, అలోక్‌రాజ్‌లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, భూవినియోగ పటాల అధ్యయనాలతో రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది.

ఇసుక తుపానులు

ఆరావళి పర్వతాల్లో జరుగుతున్న వనరుల విధ్వంసంపై రూపొందించిన ఆ నివేదిక అంతర్జాతీయ జనరల్‌ ఎర్త్‌ సైన్స్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో ప్రచురితమైంది. పట్టణీకరణ, గనుల తవ్వకాలు ఇదే రీతిలో కొనసాగితే 2059 నాటికి దాదాపు 22శాతం ఆరావళి పర్వతాలు మాయమవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎగువ ఆరావళి శ్రేణిలో హరియాణా, ఉత్తర రాజస్థాన్‌లలో కనీసం 31 కొండలు పూర్తిగా మాయమయ్యాయి. గత రెండు దశాబ్దాల్లో దిగువ, మధ్య ఆరావళి శ్రేణిలో మాయమైన కొండలకు లెక్కే లేదు. జింక్‌, రాగి, క్వార్ట్జ్‌, సీసం, రాక్‌ఫాస్పేట్‌, పాలరాయి వంటి అనేక వనరులకు ఈ పర్వతాలు ప్రసిద్ధి. దాంతో గనుల మాఫియా ఆ పర్వతాలను కొల్లగొడుతోందని, ప్రభుత్వ యంత్రాంగాలు సరైన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థార్‌ ఎడారి నుంచి ఇసుక తుపానులు గంగా యమున మైదాన ప్రాంతాలకు రాకుండా ఆరావళి పర్వత శ్రేణులు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. ఇప్పుడీ సహజ కవచాలకు ముప్పు ఏర్పడుతుండటంతో అనేక ప్రాంతాలపై ప్రభావం పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఎడారి, మైదాన ప్రాంతాల మధ్య సహజ సిద్ధమైన ఆకుపచ్చని గోడల్లా పనిచేసిన ఆరావళి పర్వతాల విధ్వంసంతో ఇసుక తుపానులు మైదానాలకు వ్యాపిస్తున్నాయి. 2018 నుంచి రాజస్థాన్‌లో ఏటా పెరుగుతున్న ఇసుక తుపానుల తీవ్రత ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా వేసవిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది. ఈ ఏడాది రాజస్థాన్‌లో ఇసుక తుపానుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలు విపరీతంగా పెరిగాయి. భరత్‌పుర్‌, ధోల్‌పుర్‌, జైపుర్‌, చిత్తోర్‌గఢ్‌ వంటి ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ ఇసుక తుపాన్లను ఎదుర్కొన్నాయి. ఆరావళి శ్రేణులను క్రమంగా నాశనం చెయ్యడం వల్ల థార్‌ ఎడారి నుంచి వచ్చే ఇసుక తుపానులు రాబోయే రోజుల్లో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) వరకు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరావళి శ్రేణుల్లో ఇప్పటికే 12 చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయని, ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో థార్‌ ఎడారి నుంచి వచ్చే ఇసుక తుపానులు హరియాణాలోని గురుగ్రామ్‌ సహా ఎన్‌సీఆర్‌ను చుట్టుముట్టే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

తగ్గిన అటవీ ప్రాంతం

ఖనిజాలు, నిర్మాణ సామగ్రి కోసం రాజస్థాన్‌లో దాదాపు 15 జిల్లాల్లో అక్రమ గనుల తవ్వకం అధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెద్దయెత్తున అక్రమ తవ్వకాలతో పచ్చని భూములు సైతం శుష్క ప్రాంతాలుగా మారుతున్నాయి. మైనింగ్‌ లీజులను సమీక్షించి పర్వతాలకు హాని కలుగుతున్న ప్రాంతాల్లో తవ్వకాలను వెంటనే నిలిపి వెయ్యకపోతే భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత నాలుగున్నర దశాబ్దాల్లో ఆరావళి శ్రేణులపై విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం సైతం తగ్గింది. దానివల్ల అరుదైన వృక్ష సంపద, జీవవైవిధ్యం దెబ్బతిన్నాయి. వన్యప్రాణులు ఆహారాన్ని వెతుక్కుంటూ మానవ ఆవాసాల్లోకి చొరబడటం తదితర సమస్యలు పెరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోవడం లేదని పర్యావరణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్‌పై నిషేధం ఉన్నా, తవ్వకాలు మాత్రం ఆగలేదు. ఆరావళి దెబ్బతింటే రాజధాని దిల్లీ ప్రాంతంలో నీటి భద్రతకు ముప్పు తలెత్తుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. రాబోయే ముప్పును గ్రహించి ప్రభుత్వాలు ఇప్పటికైనా పటిష్ఠ చర్యలు తీసుకోకపోతే భావితరాలకు ఇక్కట్లు తప్పవు.

- గొడవర్తి శ్రీనివాసు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

‣ కీలక అంశాలపై ప్రతిష్టంభన

‣ ఉపాధికి ఊతం.. ఎఫ్‌డీఐలు!

‣ విద్యుత్‌ వాహనాలదే నవ శకం

‣ స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షాకవచం

Posted Date: 03-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం