• facebook
  • whatsapp
  • telegram

ఏవీ నాటి పార్లమెంటరీ ప్రమాణాలు?

అంతర్జాతీయ పార్లమెంటరీ విధాన దినోత్సవం. ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. చాలా దేశాల్లో నియంతృత్వ పాలన పెరిగిపోతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది ఎంతమాత్రం మంచిది కాదు.

అంతర పార్లమెంటరీ సంఘాన్ని (ఐపీయూని) 1889లో స్థాపించారు. దానికి గుర్తుగా ఏటా జూన్‌ 30న అంతర్జాతీయ పార్లమెంటరీ విధాన దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఐపీయూని స్థాపించిన సమయంలో పార్లమెంటరీ వ్యవస్థ, చట్టబద్ధ పాలన ఉన్న దేశాలు చాలా తక్కువగా ఉండేవి. అప్పట్లో ప్రపంచ జనాభాలో కేవలం పదిశాతమే ప్రజాస్వామ్యంలో జీవించేవారు. ప్రస్తుతం వారి సంఖ్య అరవై శాతానికి చేరింది. ఐపీయూ ఏర్పాటయ్యే నాటికి చాలా దేశాల్లో మహిళలకు ఓటుహక్కు సైతం లేదు. ఇరవయ్యో శతాబ్దంలోనే చాలా చోట్ల స్త్రీలకు ఓటుహక్కు అందుబాటులోకి వచ్చింది. పార్లమెంటరీ విధానం కొన్ని శతాబ్దాల కాలంలో క్రమంగా అభివృద్ధి చెందిందని చరిత్ర చెబుతోంది. పార్లమెంటు, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు.

నియంతల ఏలుబడి

పార్లమెంటు వ్యవస్థ చాలా దేశాల్లో ఇరవయ్యో శతాబ్దంలోనే అభివృద్ధి చెందింది. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, అమెరికా వంటి దేశాల్లో రెండు వందల ఏళ్లు లేదా అంతకన్నా ముందే ప్రజాస్వామ్య విధానం పురుడుపోసుకుంది. రాజులు, కులీనులు గతంలో నిరంకుశంగా ప్రజలను పాలించేవారు. రాజు అధికారాలను తగ్గించే తొలి ప్రయత్నం ఇంగ్లాండ్‌లో 1215 జూన్‌లో మాగ్నాకార్టా ఛార్టర్‌ ద్వారా జరిగింది. రాజు, అతడి ప్రభుత్వం చట్టబద్ధ పాలన కంటే అత్యున్నతం కాదని అది ప్రకటించింది. ఇంగ్లాండ్‌లో 1236లో తొలిసారిగా ఆంగ్ల ప్రభువు, అతడి అనుయాయుల కూటమిని పార్లమెంటుగా ప్రకటించారు. దీన్ని 1336లో ‘హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’ (ప్రతినిధుల సభ)గా పిలవడం మొదలుపెట్టారు. 1789లో ఫ్రెంచ్‌ విప్లవం పార్లమెంటరీ వ్యవస్థ పరిణామంలో కీలకంగా నిలిచింది. ఐరోపాలో 1848 విప్లవం విఫలమైనా, నిరంకుశాధికారాలకు మరింతగా కత్తెర వేసే ప్రయత్నం చేసింది.

వలస పాలనకు వ్యతిరేకంగా ఎన్నో తృతీయ ప్రపంచ దేశాల్లో పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత కొత్తగా ఏర్పడిన చాలా దేశాలు స్పష్టమైన అధికారాల విభజనతో చట్టబద్ధ పాలన ప్రాతిపదికగా ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాయి. భారత్‌ సైతం ఇదే పంథాను ఎంచుకొంది. నిజానికి, ఇతర దేశాల మాదిరిగా కాకుండా ఇండియాలో స్వాతంత్య్ర పోరాటం శాంతియుతంగా సాగింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇదే పునాదిగా నిలిచింది. ఇండియాకు భిన్నంగా వలసవాద పాలనపై సాయుధ పోరాటం సాగించిన చాలా దేశాలు ఆ తరవాత నియంతల పాలనలోకి వెళ్ళిపోయాయి. లేదంటే చాలా కాలం అవి నియంతృత్వ నేతల ఏలుబడిలో మగ్గాయి.

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యానికి ప్రస్తుతం తీవ్ర విఘాతం కలుగుతోంది. నిజానికి పార్లమెంటు, శాసనసభల పనితీరు వాటి సభ్యులపైనే ఆధారపడి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుల్లో ఎంతోమంది ఉన్నత విద్యావంతులు, ఆయా రంగాల్లో నిష్ణాతులు, మేధావులు ఉండేవారు. తొలి లోక్‌సభలో 32శాతం సభ్యులు లాయర్లు, దాదాపు 15శాతం పాత్రికేయులు. 40శాతం సభ్యులు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు. 17వ లోక్‌సభను చూస్తే- కేవలం నాలుగు శాతమే లాయర్లు. జర్నలిస్టులు ఒకశాతం కన్నా తక్కువే. గత డెబ్భై ఏళ్లలో పార్లమెంటు సభ్యుల్లో వ్యాపారవేత్తల సంఖ్య దాదాపు రెండింతలయ్యింది.

గత 10-15 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నిరంకుశత్వం పెరిగిపోతోంది. అది క్రమంగా పార్లమెంటరీ ప్రమాణాలను, చట్టబద్ధ పాలనను కబళిస్తోంది. ఐరోపాలో రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలం నాటి పరిస్థితులు ప్రస్తుతం చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి. అప్పట్లో మాదిరిగా చాలామంది నియంత పాలకులు ప్రజాకర్షక పథకాలు, ఉద్యోగాలు, సంస్కృతి పరిరక్షణ తదితరాల పేరుతో ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రజలకు ఆర్థిక, సామాజిక భద్రతను అందించడంలో విఫలమయ్యిందని ఈ నియంత నాయకులు ప్రచారం చేస్తున్నారు. మతం, సంస్కృతి, జీవన విధానం ప్రమాదంలో పడ్డాయని, పార్లమెంటరీ వ్యవస్థ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోతోందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అనుకూల విధానాలు

ప్రస్తుతం ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పార్టీని నడపడానికి, ఓటుకు నోటు ఇవ్వడానికి డబ్బు అత్యవసర ఇంధనంగా మారింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 1,400 కోట్ల డాలర్లు ఖర్చయినట్లు అంచనా. ఇందులో అధికభాగాన్ని ప్రకటనలకే వెచ్చించారు. దేశీయంగా గత లోక్‌సభ ఎన్నికల్లో రూ.55 వేల కోట్లకు పైగా వ్యయం జరిగినట్లు పరిశీలనలు చెబుతున్నాయి. ఎన్నికల వ్యయం పెరగడంతో ధనవంతులకే పోటీ చేసే అవకాశం దక్కుతోంది. ఎలెక్షన్ల కోసం భారీగా ఖర్చు చేసే నాయకులు అధికారంలోకి వచ్చాక అంతకు పదింతలు సంపాదించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్య, చట్టబద్ధ పాలన విధానాలను వారు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మరోవైపు మితిమీరిన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు మంచివి కాదన్న ధోరణి నాయకుల్లో పెరుగుతుండటమూ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలం దాకా హక్కుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చినందువల్లే నేటికీ భారత్‌ ఆచరణాత్మక ప్రజాస్వామ్య దేశంగా మిగిలిందని చరిత్ర చెబుతోంది. పాలకుల విధానాలవల్ల కొన్నేళ్లుగా ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

అధికార కేంద్రీకరణ

చట్టసభల్లో ఒక బిల్లుకు ఆమోద ముద్ర వేసే ముందు సరైన చర్చ కొరవడుతుండటం ఇటీవలి కాలంలో ఆందోళనకర పరిణామంగా మారింది. కేవలం భారత్‌లోనే కాకుండా చాలా దేశాల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఇతర పక్షాల సభ్యులను రెచ్చగొట్టి లేదా సభలో గందరగోళం సృష్టించి అసలైన ప్రజాసమస్యలు చర్చకు రాకుండా చూసేందుకే పాలక పక్షాలు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌ వంటి కీలక అంశాలపైనా చర్చలకు వెచ్చించే సమయం కుంచించుకుపోయింది. ఆర్థిక బిల్లుల పేరుతో పలు బిల్లులను ప్రభుత్వాలు గట్టెక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పాలక పక్షం తన సభ్యులపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించి, అధికారాన్ని కేంద్రీకృతం చేయడమూ పార్లమెంటు ప్రాధాన్యం సన్నగిల్లుతుండటానికి మరో ప్రధాన కారణం. తమ నియోజకవర్గ సమస్యలపై సభలో ప్రస్తావించే బాధ్యత చట్టసభల సభ్యులకు ఉంది. అయితే, వారు పార్టీ సంబంధ అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రజా సమస్యలు విస్మరణకు గురవుతున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆరావళిని దోచేస్తున్నారు!

‣ అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

‣ కీలక అంశాలపై ప్రతిష్టంభన

‣ ఉపాధికి ఊతం.. ఎఫ్‌డీఐలు!

‣ విద్యుత్‌ వాహనాలదే నవ శకం

‣ స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షాకవచం

Posted Date: 03-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం