• facebook
  • whatsapp
  • telegram

పోషణ కొరవడుతున్న భారతం

ప్రపంచం శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తోంది. అదే సమయంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పౌష్టికాహారానికి నోచుకోలేకపోతున్నారు. ఫలితంగా వారిని అనారోగ్యం పట్టి పీడిస్తోంది. భారత్‌లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది.

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ, ఆ తరవాత ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, వాటికి తోడు ప్రకృతి విపత్తులు దక్షిణాసియాలో ఆహార అభద్రతకు దారితీస్తున్నాయి. ఇండియాతో పాటు ఈ ప్రాంతంలో పోషకాహార లోపం పెచ్చరిల్లుతోంది. ఇది ప్రపంచ ఆహార విధాన నివేదిక  (జీఎఫ్‌పీఆర్‌) ఇటీవల వెల్లడించిన సమాచారం. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) దీన్ని విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2021లో పౌష్టికాహార లోపంతో బాధపడేవారి సంఖ్య దాదాపు 77 కోట్లకు చేరింది. 2014తో పోలిస్తే ఇది 34శాతం అధికం. భారత్‌లో పోషకాహారం, ముఖ్యంగా సూక్ష్మ పోషకాల సమస్య అధికంగా ఉంది. దీన్ని ‘పైకి కనిపించని ఆకలి’గా జీఎఫ్‌పీఆర్‌ వ్యాఖ్యానించింది. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది.

తీవ్ర సమస్య

జీఎఫ్‌పీఆర్‌ ప్రకారం 2019-2021 మధ్య కాలంలో అఫ్గానిస్థాన్‌లో 30శాతం, భారత్‌లో 16శాతం, పాక్‌లో 17శాతం ప్రజలు పోషకాహార సమస్యను ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌ (12శాతం), నేపాల్‌ (ఆరు శాతం), శ్రీలంక (నాలుగు శాతం) మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో మూడో వంతుకు భారత్‌ నెలవని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పౌష్టికాహార లోపాన్ని పారదోలడమూ ఒకటి. నిజానికి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కనీసం పన్నెండింటికి పోషకాహారంతో సంబంధం ఉంది. దేశీయంగా ఆరేళ్ల లోపు పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్రం 1975లోనే సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) తెచ్చింది. ప్రధాన మంత్రి మాతృవందన యోజన, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయినా, దేశీయంగా పోషకాహార లోపం ఎందరినో పట్టిపీడిస్తోంది. నిరుడు ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 121 దేశాల సరసన 107వ స్థానంలో నిలిచింది. అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం- దేశీయంగా అయిదేళ్ల లోపు పిల్లల్లో 35శాతానికి పైగా వయసుకు తగిన ఎత్తు లేరు. 19శాతం ఎత్తుకు తగిన బరువు లేరు. 32శాతం పిల్లలు ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్నారు. అస్సాం, గుజరాత్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర తదితరాల్లో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. మరోవైపు 15-49 ఏళ్ల వయసు బాలికలు, మహిళల్లో ఏకంగా 57శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. భారత్‌లో ఏకంగా ఎనభై శాతానికి పైగా సూక్ష్మ పోషకాల కొరత ఎదుర్కొంటున్నట్లు గతంలో అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు 2024 నాటికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలు కలిపిన బియ్యాన్ని అందిస్తామని ప్రధాని మోదీ గతంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా త్వరితగతిన వాటిని అందుబాటులోకి తేవాలి. 2030 నాటికి పిల్లల్లో తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని అరికట్టడానికి రూ.3,354 కోట్లతో ప్రత్యేక పథకాన్ని తేవాలని ఒడిశా ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలూ ఇలాంటి కార్యక్రమాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 33కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. అంతకు ముందు సంవత్సరం ఇది 31.56 కోట్ల టన్నులే. ఇండియాలో ఆహారోత్పత్తి పెరుగుతున్నా అందరికీ తిండిగింజలు చేరడంలేదని ప్రపంచ ఆహార విధాన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారమే రేషన్‌ కార్డులు జారీ చేస్తున్నారు. దానివల్ల పది కోట్ల మంది అర్హులు చౌకధరల్లో ఆహార ధాన్యాలు అందుకోలేకపోతున్నారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం త్వరితగతిన జనగణన జరిపి అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందించాలి.

తగ్గిన దిగుబడి

వాతావరణ మార్పులు సైతం పంటల ఉత్పాదకతను దెబ్బతీసి ఆకలి కేకలను పెంచే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల వల్ల భారత్‌లో నిరుడు 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. దానివల్ల ఉత్పత్తి తగ్గి, ఆహార ధాన్యాల ధరలు అధికమై సామాన్యులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. తీవ్ర వడగాడ్పుల వల్ల గతేడాది ఇండియాలో గోధుమ దిగుబడి ముప్ఫై శాతం మేర తెగ్గోసుకుపోయింది. దేశీయంగా 12 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఆహార అభద్రత తలెత్తకుండా వాతావరణ మార్పులను తట్టుకొనేలా మెరుగైన వంగడాలపై దృష్టి కేంద్రీకరించాలి. వరి, గోధుమలతో పాటు పప్పు, సిరిధాన్యాల సాగు విస్తీర్ణాన్ని, దిగుబడులను పెంచాలి. తద్వారా అందుబాటు ధరల్లో అవి అందరికీ దక్కేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడే పౌష్టికాహార లోపాన్ని నిలువరించడం సాధ్యమవుతుంది.  

- ఎం.వేణు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

‣ ఏవీ నాటి పార్లమెంటరీ ప్రమాణాలు?

‣ ఆరావళిని దోచేస్తున్నారు!

‣ అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

Posted Date: 04-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం