• facebook
  • whatsapp
  • telegram

అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేసేందుకు ఈ పర్యటన తోడ్పడినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రెండు దశాబ్దాలుగా భారత్‌-అమెరికా సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. ఇటీవల భారత ప్రధాని మోదీ అగ్రరాజ్య పర్యటన అందులో కీలక అధ్యాయంగా నిలిచింది.  అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ భేటీ కావడంతో పాటు, అమెరికా కాంగ్రెస్‌లోనూ ప్రసంగించారు. మోదీ పర్యటనకు ముందు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ ఇండియాను సందర్శించారు. ఈ ఏడాది ప్రారంభంలో అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌- జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం, క్వాడ్‌ మంత్రుల భేటీలకు దిల్లీకి వచ్చారు. ప్రజాస్వామ్య దేశాల మధ్య వాస్తవిక చర్చలకు, సహకారానికి ఆస్కారం ఉంటుందన్న నమ్మకంతో వాషింగ్టన్‌తో చెలిమికి దిల్లీ మొగ్గు చూపుతోంది.

యుద్ధ విమాన ఇంజిన్ల తయారీ

నిరుడు దిల్లీ-వాషింగ్టన్‌ల ద్వైపాక్షిక వాణిజ్య విలువ 19,100 కోట్ల డాలర్లకు చేరింది. 2000-2023 మార్చ్‌ మధ్య కాలంలో భారత్‌లో అత్యధిక పెట్టుబడులు పెట్టిన మూడో దేశంగా అగ్రరాజ్యం నిలిచింది. ఈ కాలంలో దాదాపు 6,019 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమెరికా నుంచి భారత్‌కు వచ్చాయి. కొంత కాలంగా భారత్‌లో తయారీ, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం తదితరాల ద్వారా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి పెట్టుబడులను ఇండియా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. భారతీయ సంస్థలు సైతం అమెరికాలో 4,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అవి పెద్దమొత్తంలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో ఆధునిక సాంకేతిక వినియోగం పరంగా భారత్‌ ఇటీవలి కాలంలో గణనీయ ప్రగతిని సాధించింది. యూపీఐ చెల్లింపులు కొంత కాలంగా విస్తృతమయ్యాయి. ఆర్థిక సాంకేతికతల్లో భారత్‌ సాధించిన ఈ పురోగతిని అమెరికాకు వివరించేందుకు మోదీ పర్యటన అవకాశం కల్పించింది.

సెమీకండక్టర్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో భారత్‌లో త్వరలో 82.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన మైక్రాన్‌ టెక్నాలజీ సంస్థ ప్రకటించింది. క్వాంటమ్‌ సాంకేతికతలు, కృత్రిమ మేధ పరంగా పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి దిల్లీ-వాషింగ్టన్‌లు అంగీకారం తెలిపాయి. అత్యాధునిక సాంకేతికతల పరంగానూ అమెరికా-ఇండియాల మధ్య మైత్రి ఇటీవల బలపడుతోంది. రక్షణ రంగంలో సంక్లిష్ట, ఆధునిక సాంకేతికతలపై సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలని ఈ ఏడాది మొదట్లో ఇరు దేశాలు నిర్ణయించాయి. ఉమ్మడి ప్రయోజనాల కోసం భద్రమైన సాంకేతిక వ్యవస్థల అభివృద్ధికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలోనూ కలిసి నడవాలని నిర్ణయించాయి.  

రక్షణ రంగంలో ఇటీవల భారత్‌-అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా దిల్లీ, వాషింగ్టన్‌ నావికాదళాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వాటికి మలబార్‌ విన్యాసాలుగా పేరు. ఆ తరవాత జపాన్‌, ఆస్ట్రేలియాలు   జతకలిశాయి. అమెరికా రక్షణ పరికరాల సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఈ విన్యాసాలు భారత్‌కు తోడ్పడతాయి. అగ్రరాజ్యం నుంచి భారత్‌ రక్షణ పరికరాల దిగుమతుల విలువ త్వరలోనే 2,500 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు భారత రక్షణ పరికరాల సముపార్జన మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది. జనరల్‌ అటామిక్స్‌ సంస్థ నుంచి ఇండియా ప్రత్యేకంగా ఎంయూ-9బి డ్రోన్లను కొనుగోలు చేయనుంది. భూ, సముద్ర తలాల్లో నిఘా సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఈ డ్రోన్లు ఉపకరిస్తాయి. భారత్‌లోనే జీఈ-ఎఫ్‌414 యుద్ధ విమాన ఇంజిన్ల తయారీకి సంబంధించి జనరల్‌ ఎలెక్ట్రిక్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. యుద్ధ విమాన ఇంజిన్ల సాంకేతికత భారత్‌కు బదిలీ కావడానికి ఆస్కారం కల్పించే ఈ ఒప్పందం చాలా కీలకమైంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా తక్కువ దేశాలే ఫైటర్‌ జెట్‌ ఇంజిన్లను తయారు చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో భారత్‌ సైతం ఆ జాబితాలోకి చేరనుంది.

ఆర్థికాభివృద్ధికి మార్గం

స్వాతంత్య్రం వచ్చిన తరవాతి నుంచి భారత్‌ ప్రధానంగా రష్యా వంటి దేశాల నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. రక్షణ పరికరాల దిగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇండియా ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ పరికరాల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు దేశీయంగా కసరత్తు జరుగుతోంది. ఉద్యోగ అవకాశాల సృష్టికీ ఇది అవకాశం కల్పిస్తుంది. చైనా విస్తరణవాదంపైనా మోదీ-బైడెన్‌లు చర్చించారు. కొన్నేళ్లుగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై పట్టు సాధించాలని చైనా ఆరాటపడుతోంది. రుణాల పేరుతో పలు దేశాలను తన కబంధ హస్తాల్లోకి లాక్కొంటోంది. వాస్తవాధీన రేఖ వెంట తరచూ అది కయ్యానికి దిగుతోంది. అందువల్ల డ్రాగన్‌కు ముకుతాడు వేయడం అమెరికా, భారత్‌లు రెండింటికీ అవసరం. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య బంధం కొంతకాలంగా బలపడుతోంది. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్‌ ఏకాకిగా ఉంటే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యంకాదు. వాణిజ్య పెట్టుబడులు, ఆధునిక సాంకేతికతల కోసం ఇండియా సంపన్న దేశాలతో మైత్రిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన మెరుగైన ఫలితాలను రాబట్టినట్లు చెప్పుకోవచ్చు.

కీలక చర్చలు

క్వాడ్‌, ఇతర కూటముల్లో సభ్య దేశాలుగా ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతకు, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి అమెరికా-ఇండియా కృషి చేస్తున్నాయి. ఇండో-పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఐపీఈఎఫ్‌) సరఫరా వ్యవస్థ ఒప్పందాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు భావసారూప్యత కలిగిన దేశాలతో దిల్లీ, వాషింగ్టన్‌లు చర్చలు జరుపుతున్నాయి. డిజిటల్‌ సాంకేతికతలు, కృత్రిమ మేధ(ఏఐ) వేదికల సాయంతో ఆరోగ్య పరిరక్షణ రంగంలో సహకారాన్ని ద్విగుణీకృతం చేసుకోవాల్సిన అవసరంపై మోదీ పర్యటనలో ఇరు దేశాల నేతలు చర్చించారు. ఔషధాల సరఫరాల వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన ఆవశ్యకతనూ వారు గుర్తించారు. వాతావరణ మార్పులను కట్టడి చేయాల్సిన అవసరంపైనా ఆలోచనలు పంచుకున్నారు. సులభతర వీసా అంశంపైనా ఇరు దేశాల నేతలు చర్చించారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

‣ ఏవీ నాటి పార్లమెంటరీ ప్రమాణాలు?

‣ ఆరావళిని దోచేస్తున్నారు!

‣ అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

Posted Date: 04-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం