• facebook
  • whatsapp
  • telegram

వ్యర్థాలతో అర్థం.. దేశానికి సౌభాగ్యం

అదుపు తప్పిన పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. కర్బన ఉద్గారాల విపరీత పెరుగుదల వాతావరణ మార్పులకు దారి తీస్తోంది. ఫలితంగా మానవాళి ఉనికికే ముప్పు తలెత్తుతోంది. దీన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి.

గృహాల నుంచి ఘన, ద్రవ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్‌, ఎలెక్ట్రానిక్‌, బ్యాటరీ వ్యర్థాలు, కాలం చెల్లిన ఉపకరణాలు వెలువడుతున్నాయి. ఇవి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో గుట్టలుగా పేరుకుపోతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. వినియోగాన్ని తగ్గించడం (రెడ్యూస్‌), వాడిన వస్తువులను పునశ్శుద్ధి చేయడం (రీసైకిల్‌), పునర్వినియోగంలోకి తేవడం(రీయూజ్‌) అనే మూడు సూత్రాలను వ్యర్థాల సమస్యకు పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు సూత్రాలతో నిర్మితమైనదాన్నే వలయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ)గా పిలుస్తున్నారు. ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో మనం భూమి నుంచి వివిధ పదార్థాలను సంగ్రహించి, వాటి నుంచి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాం. వాటి వినియోగం ముగిసిన తరవాత బయటకు విసిరేస్తూ చెత్తకొండల్ని సృష్టిస్తున్నాం. ఈ పద్ధతిని సరళ రేఖ (లీనియర్‌) ఆర్థిక వ్యవస్థ అంటున్నారు. వలయ ఆర్థిక వ్యవస్థ దీనికి పూర్తిగా భిన్నం.

భారీగా మిగులు

కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వలయ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకొంది. ఈ విధానంలోకి మళ్ళడం వల్ల వ్యయాలు తగ్గి 2040 నాటికి 1.27 లక్షల కోట్ల డాలర్లను పొదుపు చేయడానికి ప్రభుత్వాలకు అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగై ఆర్థిక వ్యవస్థలో మరో 3.25 లక్షల కోట్ల డాలర్ల మిగులు సాధ్యమవుతుంది. ఇది ఉత్పత్తి రంగం విస్తృతికి ఊతమిస్తుంది. ఈ మేరకు ఐరాస పర్యావరణ సంస్థ నివేదిక గతంలో అంచనా వేసింది. సర్క్యులర్‌ ఎకానమీ వల్ల 2040 నాటికి ఏడు లక్షల నూతన ఉద్యోగాల సృష్టీ జరుగుతుందని అది వెల్లడించింది. ఇటీవల ఐరాస పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో పారిస్‌లో సమావేశమైన 170 దేశాలు- ప్లాస్టిక్‌ కాలుష్య నివారణకు ముసాయిదాను రూపొందించి అమలు చేయాలని అంగీకరించాయి. వలయ ఆర్థిక వ్యవస్థ పరిధి క్రమేణా అన్ని ఉత్పత్తి రంగాలకు విస్తరిస్తోంది.

వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు వలయ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు వివిధ నమూనాలను రూపొందిస్తున్నాయి. భారత్‌ సైతం స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌, మేరీ లైఫ్‌... మేరా స్వచ్ఛ్‌ శహర్‌ (నా జీవితం, నా స్వచ్ఛమైన పట్టణం) వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చింది. గత నెలలో దేశీయంగా భారీ సంఖ్యలో పునశ్శుద్ధి, పునర్వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేసి పౌరులు ఉపయోగించిన ప్లాస్టిక్‌, ఇతర వస్తువులు, దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు మొదలైన వస్తువులను సేకరించారు. వాటిని పునశ్శుద్ధి చేసి, పునర్వినియోగానికి అనుకూలంగా తీర్చిదిద్ది అవసరమైన వారికి అందజేశారు.

ప్లాస్టిక్‌, ఎలెక్ట్రానిక్‌, బ్యాటరీ వ్యర్థాల పునశ్శుద్ధి 2030 నాటికి దేశంలో 2,000 కోట్ల డాలర్ల మేర సంపద సృష్టికి అవకాశాలు కల్పిస్తుందని అవెండస్‌ క్యాపిటల్‌ అనే సంస్థ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిశ్రమ 2030 నాటికి 1,020 కోట్ల డాలర్లకు ఎదగనుందని అది మదింపు వేసింది. అయితే ఇది పునశ్శుద్ధి చేసిన ప్లాస్టిక్‌ వినియోగంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ‘పట్టణ ఘన ద్రవ వ్యర్థాలతో చక్రీయ ఆర్థిక వ్యవస్థ’ అనే నివేదికలో వాటి పునశ్శుద్ధి, పునర్వినియోగానికి పలు సూచనలు చేసింది. కాలుష్యానికి కారకులయ్యేవారిపై అదనపు పన్నులు విధించాలని, పునరుత్పాదక వస్తువులపై పన్నులు తగ్గించాలని సిఫార్సు చేసింది. వలయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గత నెలలో 142 పురపాలికల్లో 1962 తగ్గింపు, పునశ్శుద్ధి, పునర్వినియోగ (ఆర్‌ఆర్‌ఆర్‌) కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసే కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.

కాలుష్యం కట్టడి

వలయ ఆర్థిక వ్యవస్థ అమలు ద్వారా నగరాల్లో రోజూ వెలువడుతున్న లక్షల లీటర్ల మురుగును మంచి నీటిగా మార్చి పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలకు అందించవచ్చు. చెత్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పి డంపింగ్‌ యార్డుల అవసరం లేకుండా చేయవచ్చు. భవనాల నిర్మాణంలో పునశ్శుద్ధి చేసిన సామగ్రిని వినియోగించడం ద్వారా 2050 నాటికి నగరాల్లో కర్బన ఉద్గారాలను 38శాతం మేర తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాలుష్యానికి, భూతాపానికి మూలమైన కర్బన ఉద్గారాలను వలయ ఆర్థిక వ్యవస్థ తగ్గిస్తుంది. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కోవడానికి అది తోడ్పడుతుంది. సహజ వనరుల వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించి, ప్రకృతి వనరుల సమతుల్యతకు దోహదం చేస్తుంది. అన్ని రంగాల్లో వలయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనువైన వ్యూహాలు, విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలి. ఆ మేరకు తగిన మౌలిక వసతుల కల్పనా అత్యావశ్యకం.  

మౌలిక వసతుల్లో వెనకంజ

దేశీయంగా నిత్యం కోటీ యాభై లక్షల టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వ్యర్థాల నియంత్రణకు కేంద్రం కచరే సే కంచన్‌ (వ్యర్థాల నుంచి అర్థం) తదితర కార్యక్రమాలను ప్రారంభించింది. వీటి అమలుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మాత్రం అంతగా పురోగతి కనిపించడం లేదు. మురుగునీటి శుద్ధికి కావాల్సిన ప్లాంట్లు, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌ కేంద్రాల నిర్మాణంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) పలుమార్లు తీవ్రంగా ఆక్షేపించింది. కొన్ని రాష్ట్రాలకు జరిమానాలు సైతం విధించింది. దేశీయంగా దాదాపు సగం మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు పనిచేయడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల నిర్మాణంలో జాప్యం వల్ల చెత్త కొండలు పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో 2024 నాటికి చెత్త రహిత నగరాల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రూపాయి బలపడితేనే..

‣ పోషణ కొరవడుతున్న భారతం

‣ అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

Posted Date: 07-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం