• facebook
  • whatsapp
  • telegram

రూపాయి బలపడితేనే..

రూపాయితో అమెరికా డాలరు మారకం విలువ రోజురోజుకీ పెరిగిపోతుండటం భారతీయ దిగుమతిదారుల నడ్డి విరుస్తోంది. ముఖ్యంగా డాలర్లలో ముడి సరకులు, విడిభాగాల దిగుమతి ధరలు మిన్నంటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) రంగాన్ని దెబ్బతీస్తోంది. ఇరాన్‌, రష్యాల నుంచి రూపాయల్లో చమురు దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉన్నా అది మూణ్నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది.

అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులు పలు రకాలుగా జరుగుతాయి. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురుకు భారత్‌ దిర్హమ్‌లలో కొంతమేర చెల్లింపులు జరుపుతోంది. భారతీయ వ్యాపారులు చైనా కరెన్సీ యువాన్లలో ఇతర దేశాలతో లావాదేవీలు జరుపుతున్నారు. ఇండియా ప్రతి నెలా 1.2 కోట్ల పీపాల చమురును ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకొంటోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్‌ 2010 డిసెంబరులో ఆసియన్‌ క్లియరింగ్‌ యూనియన్‌ యంత్రాంగం నుంచి ఇరాన్‌ను తొలగించాల్సి వచ్చింది. ఇప్పటికీ భారతదేశ చమురు అవసరాల్లో 14శాతానికి పైగా ఇరానే తీరుస్తోంది. మనం ఆ దేశానికి భారీ మొత్తంలో బకాయిపడినా ఇరాన్‌ చమురు రుణ ప్రాతిపదికపై వస్తూనే ఉంది.

పెరగని ఎగుమతులు

ముడి ఇనుప ఖనిజం, ఉక్కు, రసాయనాలు, ఆహార ధాన్యాలు, యంత్రాలు, మందులు దిగుమతి చేసుకోవడానికి కొన్ని దేశాలకు భారత్‌ అరువు ఇచ్చింది. ఆ మొత్తాలు 110కోట్లకు చేరాయి. డాలర్లు లేక ఇరాన్‌ భారతీయ బియ్యం ఎగుమతిదారులకు 15కోట్ల డాలర్ల మేరకు బకాయి పడింది. అందులో 45శాతాన్ని రూపాయల్లో చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఎగుమతుల రూపంలో భర్తీ చేస్తానని ఇరాన్‌ తెలిపింది. భారత్‌కు ఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్‌ చమురు ఎగుమతులు అయిదురెట్లు పెరిగాయి. రూపాయల్లో విదేశాలకు చెల్లింపులు జరిపేందుకు వీలుగా వోస్ట్రో ఖాతాలు తెరవడానికి భారతీయ బ్యాంకులకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఒక దేశ పౌరులు తమ దేశీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ ఖాతాలు తెరిస్తే విదేశీయులు ఇతర దేశాల బ్యాంకుల్లో వోస్ట్రో ఖాతాలు తెరుస్తారు. ఆంక్షలకు గురైన రష్యా, ఇరాన్‌లకు చెల్లింపులు జరపడానికి వోస్ట్రో ఖాతాలు ఉపకరిస్తాయి. ఈ రెండు దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నా, వాటికి రూపాయల్లో మాత్రమే చెల్లింపులు జరపడం సాధ్యపడదు. బియ్యం, గోధుమలు, మందుల వంటివి ఎగుమతి చేసి కొంతవరకు బకాయిలు తీర్చాల్సి ఉంటుంది. కానీ రష్యా, ఇరాన్‌లకు భారతీయ ఎగుమతులు ఒక స్థాయికి మించి పెరగడం లేదు. దాంతో ఆ దేశాల వద్ద రూపాయి నిల్వలు పేరుకుపోతున్నాయి. భారత్‌ నుంచి కొనడానికి పెద్దగా ఏమీలేక ఆ రూపాయలను ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి రష్యా, ఇరాన్‌లకు ఎదురవుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం తరవాత రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు జోరెత్తాయి. దాంతో రష్యా వద్ద రూపాయి నిల్వలు కొండలా పేరుకుపోయాయి. వాటిని ఏం చేసుకోవాలో తెలియక తన చమురుకు యువాన్లలోగానీ, దిర్హమ్‌లలోగానీ చెల్లింపులు స్వీకరిస్తానంటోంది. రూపాయి కొండను కరిగించడానికి భారత్‌, రష్యాల మధ్య జరిగిన సుదీర్ఘ సంప్రతింపులు అపరిష్కృతంగా మిగిలాయి. ఫలితంగా రష్యా నుంచి రూపాయల్లో చమురు, బొగ్గు దిగుమతి చేసుకోవడం భారత్‌కు కష్టసాధ్యమవుతోంది. ఇండియా నుంచి రూపాయలను తీసుకుంటూ పోతే రష్యా వద్ద ఏడాదికి 4000కోట్ల డాలర్లకు సమానమైన రూపాయలు పేరుకుపోతాయి. భారత్‌ నుంచి రష్యా దిగుమతి చేసుకోగల సరకులు పెద్దగా ఉండవు కాబట్టి ఈ రూపాయలు నిరుపయోగమవుతాయి. ప్రపంచ సరకుల ఎగుమతుల్లో భారత్‌ వాటా కేవలం రెండు శాతమే. పైగా రూపాయిని తేలిగ్గా ఇతర కరెన్సీల్లోకి మార్చడం కుదరదు.

శరవేగంగా పురోగమిస్తేనే..

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యా చమురు ఎగుమతుల ధరపై అమెరికా, ఐరోపా సమాఖ్యలు పరిమితి విధించాయి. దాంతో రష్యా చమురు భారత్‌లోకి ప్రవహించసాగింది. గతంలోకన్నా 12రెట్లు అధికంగా రష్యన్‌ చమురును భారత్‌ సమకూర్చుకుంది. అదే సమయంలో రష్యాకు భారత్‌ ఎగుమతులు స్వల్పంగా తగ్గాయి. నిరుడు 361 కోట్ల డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు 343 కోట్ల డాలర్లకు పడిపోయాయి. డాలర్లలో చెల్లింపులు జరపలేకపోవడంవల్లే ఈ తంటా వస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పురోగమిస్తేనే రూపాయి బలపడుతుంది. అప్పుడే అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి లావాదేవీలు పెరుగుతాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోషణ కొరవడుతున్న భారతం

‣ అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

‣ ఏవీ నాటి పార్లమెంటరీ ప్రమాణాలు?

‣ ఆరావళిని దోచేస్తున్నారు!

‣ అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

Posted Date: 05-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం