• facebook
  • whatsapp
  • telegram

రగులుతున్న పశ్చిమాసియా

ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద శరణార్థి శిబిరమైన జెనిన్‌లో మిలిటెంట్ల ఏరివేత పేరిట ఇజ్రాయెల్‌ రెండు వేల మంది సైనికులు, డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్‌డోజర్లతో విరుచుకుపడింది. వెస్ట్‌బ్యాంక్‌లో సెటిలర్ల సంఖ్యను పెంచేందుకే ఇజ్రాయెల్‌ ఇలా భయభ్రాంతులకు గురిచేస్తోందని పాలస్తీనా ఆరోపిస్తోంది.

వెస్ట్‌బ్యాంక్‌లోని శరణార్థి శిబిరం జెనిన్‌పై ఇటీవల ఇజ్రాయెల్‌ సైనిక దళాలు (ఐడీఎఫ్‌) విరుచుకుపడ్డాయి. ఫలితంగా తాగునీటి, విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో సుమారు మూడువేల మంది శరణార్థులు శిబిరం నుంచి వెళ్ళిపోయారు. ఒకప్పుడు గాజాతో పోలిస్తే వెస్ట్‌బ్యాంక్‌ కొంత ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. 2022 నాటి ఘర్షణల్లో 151 మంది పాలస్తీనా వాసులు మరణించారు. తొమ్మిది వేలమంది గాయపడ్డారు. 2022లో ‘నక్బా’ కార్యక్రమాల కవరేజీకి వెళ్ళిన అల్‌-జజీరా మహిళా పాత్రికేయురాలు షిరిన్‌ను ఇజ్రాయెల్‌ దళాలు జెనిన్‌లోనే కాల్చివేశాయి.

ఇజ్రాయెల్‌ 1948లో ఏర్పాటైన తరవాత పాలస్తీనా శరణార్థుల కోసం 1953లో జెనిన్‌ నగరంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 0.16 చదరపు మైలు విస్తీర్ణంలోని ఈ శిబిరం 17,000 మందితో కిక్కిరిసిపోయింది. ఇది ఇజ్రాయెల్‌ ఆధీనంలోని వెస్ట్‌బ్యాంక్‌లో ఉన్నప్పటికీ, పాలస్తీనా నేషనల్‌ అథారిటీ పరిపాలిస్తోంది. పేదరికం, నిరుద్యోగం తాండవిస్తున్న ఈ ప్రాంతాన్ని పాలస్తీనా మిలిటెంట్లు అడ్డాగా చేసుకొని తరచూ ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ పార్టీ ‘ఫతా’కు చెందిన అల్‌-అక్సా మార్టర్స్‌ బ్రిగేడ్స్‌, 2021లో ఆరంభమైన జెనిన్‌ బ్రిగేడ్స్‌, 2022లో మొదలైన లయన్స్‌ డెన్‌ సంస్థలు ఈ దాడుల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్‌ మద్దతున్న ‘హమాస్‌’ సైతం ఇక్కడ పట్టు పెంచుకొంది. అవన్నీ భారీ కమాండ్‌ సెంటర్లు, పేలుడు పదార్థాల గోదాములు నిర్వహిస్తున్నాయి. దాదాపు 300 మంది మిలిటెంట్లు జెనిన్‌లో చురుగ్గా పనిచేస్తున్నారన్నది ఇజ్రాయెల్‌ దళాల అంచనా. ఇటీవల ఇక్కడి నుంచి ఇజ్రాయెల్‌పై తొలిసారి చిన్నస్థాయి రాకెట్లను ప్రయోగించారు. గాజా లేదా లెబనాన్‌ నుంచి ఈ సాంకేతికత జెనిన్‌కు సరఫరా అయినట్లు చెబుతున్నారు. దాంతో గాజాలో పరిస్థితులే ఇక్కడా నెలకొంటాయని ఐడీఎఫ్‌ భావించి, మిలిటెంట్ల ఏరివేత చేపట్టింది. ఆపరేషన్‌ మొదలుకాగానే భారీ సంఖ్యలో మిలిటెంట్లు శిబిరాన్ని వీడారు. ఆయుధ డిపోలను మాత్రం ఇజ్రాయెల్‌ సేనలు ధ్వంసం చేశాయి. మిలిటెంట్ల ఏరివేతకు ఐడీఎఫ్‌ మరోసారి ఆపరేషన్‌ చేపట్టాల్సి ఉందంటూ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గల్లాంట్‌ ప్రకటించడం- రక్తపాతం ఇప్పట్లో ఆగదన్న సంకేతాలను ఇచ్చింది.

ఇజ్రాయెల్‌ చరిత్రలోనే కరడుగట్టిన అతివాద కూటమి సర్కారు నిరుడు బెంజిమన్‌ నెతన్యాహు నేతృత్వంలో ఏర్పడింది. ఆ ప్రభుత్వం చేపట్టిన న్యాయ సంస్కరణలపై అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రదేశమైన అమెరికా సైతం వాటిపై గుర్రుగా ఉండటంతో పాలకులకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు, వెస్ట్‌బ్యాంక్‌లో భారీ సైనిక చర్య చేపట్టాలని ప్రభుత్వంలోని ఆ ప్రాంత నేతలు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే మిలిటెంట్లు జూన్‌ 20న వెస్ట్‌బ్యాంక్‌ ఉత్తర భాగంలోని ఎలిలో నలుగురు ఇజ్రాయెల్‌ సెటిలర్లను కాల్చిచంపారు. దాంతో ఒత్తిడి పెరగడంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం జెనిన్‌ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. పాలస్తీనా వాసులు కలలుగంటున్న కొత్త దేశంలో వెస్ట్‌బ్యాంక్‌ కీలకమైనది. ఇక్కడి సెటిల్మెంట్‌ ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ ప్రజలు భారీ సంఖ్యలో స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకోవడం పాలస్తీనా వాసుల్లో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరూసలెంలో కలిపి ఆరు లక్షల మంది ఇజ్రాయెలీ పౌరులు ఉన్నారు. అక్కడ 5,623 స్థిర నివాసాల ఏర్పాటుకు నెతన్యాహు సర్కారు గత నెలలో పచ్చజెండా ఊపింది. నలుగురు ఇజ్రాయెల్‌ సెటిలర్ల కాల్చివేతకు ప్రతీకారంగా ఎలిలోనే 1,027 నివాసాలు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి బెజలెల్‌ స్మోత్‌రిచ్‌ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ తరచూ చేపడుతున్న దాడులతో- అంతర్జాతీయ ఒప్పందాన్ని అనుసరించి ఏర్పాటైన ‘పాలస్తీనా అథారిటీ’కి విలువలేకుండా పోతోంది. ఈ పరిస్థితులను తమ శత్రుదేశమైన ఇరాన్‌ అనుకూలంగా వాడుకొంటుందన్న స్పృహ ఇజ్రాయెల్‌ నేతల్లో కొరవడినట్లుంది. పాలస్తీనా అథారిటీని బలోపేతం చేయడంతో పాటు బాహ్యశక్తుల సాయుధ జోక్యానికి, ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్యలకు అంతర్జాతీయ సమాజం కళ్ళెం వేస్తేనే- వెస్ట్‌బ్యాంక్‌లో పరిస్థితి మెరుగుపడుతుంది. లేనిపక్షంలో పశ్చిమాసియా నిత్యం రగులుతూనే ఉంటుంది.

- పి.ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమతా భారత్‌కు ఉమ్మడి పౌరస్మృతి

‣ వ్యర్థాలతో అర్థం.. దేశానికి సౌభాగ్యం

‣ రూపాయి బలపడితేనే..

‣ పోషణ కొరవడుతున్న భారతం

‣ అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

Posted Date: 12-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం