• facebook
  • whatsapp
  • telegram

జనశక్తే ఆర్థిక వృద్ధికి బలిమిగా..

ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా జనాభా క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగం, పేదరికం, ఆకలి కేకలు, అసమానతలు తదితరాలు జడలు విప్పుతున్నాయి. వాటిని నిరోధించేందుకు ఆయా దేశాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం నిరుడు నవంబరు నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరింది. 2010లో ఇది ఏడు వందల కోట్లు. అంటే, పన్నెండేళ్ల కాలంలో ఏకంగా వంద కోట్ల జనాభా పెరిగింది. 2058 నాటికి ఇది వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 464 కోట్ల జనాభా ఒక్క ఆసియా ఖండంలోనే నివసిస్తోంది. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తోంది. ఇండియా జనాభా ప్రస్తుతం 142 కోట్లకు పైమాటే. ఐరోపా ఖండం మొత్తం జనాభా (దాదాపు 75 కోట్లు) కన్నా ఇది అధికం. 2048 నాటికి ఇండియా జనాభా 160 కోట్లకు చేరి, అనంతరం 2100 నాటికి 109 కోట్లకు దిగివస్తుందని గతంలో వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ  అధ్యయనం విశ్లేషించింది. అయినా, అప్పటికి జనాభా పరంగా భారత్‌ తొలి స్థానంలోనే నిలుస్తుంది.

పెను సమస్యలు

మితిమీరిన జనాభా వల్ల నీరు, వ్యవసాయ భూమి తదితర సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. జన విస్ఫోటం వల్ల గత యాభై ఏళ్లలో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వాహనాల పెరుగుదల, భారీ పరిశ్రమల ఏర్పాటు, మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల గత అయిదు దశాబ్దాల్లో కాలుష్యం అధికమైంది. భూతాపం కట్టుతప్పింది. కొవిడ్‌ వంటి ఊహించని మహమ్మారులూ విరుచుకుపడుతున్నాయి. నిరుద్యోగం, పౌష్టికాహార లోపం, ఆకలి కేకలు, తీవ్ర అసమానతలు తదితరాలకు అధిక జనాభా కారణభూతమవుతోంది. దీనివల్ల  తలెత్తుతున్న సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే ఆయా దేశాలు నాణ్యమైన విద్యను అందించి, మేలిమి మానవ వనరులను రూపొందించుకోవాలి. కుటుంబ నియంత్రణ ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజెప్పాలి. అమ్మాయిలు చదువుకొని శ్రామిక శక్తిలో భాగస్వాములు అయినప్పుడే ఒక దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. బాలికల చదువు విషయంలో ఎన్నో చోట్ల తీవ్ర దుర్విచక్షణ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది అమ్మాయిలు బడి ముఖమే చూడలేదని పలు పరిశీలనలు చెబుతున్నాయి. సహారా ఎడారికి దక్షిణ భాగంలో ఉన్న దేశాలు, దక్షిణ, పశ్చిమాసియాల్లో ఇలాంటి వారి సంఖ్య అధికంగా ఉంది. తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చాక అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులను ఎలా కాలరాస్తున్నారో చూస్తున్నాం. చదువుకు దూరమవుతున్న అమ్మాయిలు చిన్న వయసులోనే వివాహ బంధంలోకి   అడుగు పెడుతున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. పేదరికమే అమ్మాయిల చదువులకు ఆటంకంగా నిలుస్తోంది. దీన్ని నివారించేందుకు ఆయా దేశాలు ప్రత్యేక పథకాలను అమలు చేయాలి. ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమ్మాయిల పురోగతి అంశంపై ఐరాస అధిక దృష్టి సారించింది. ఈ క్రమంలో ‘లింగపరమైన సమానత్వ శక్తిని చాటడం: ప్రపంచంలో అనంతమైన అవకాశాలను మహిళలు అందిపుచ్చుకొనేలా చూడటం’ అనే అంశాన్ని ఈ సారి నినాదంగా ఎంచుకుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలు పనిపాటల్లో పాలుపంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాజం రుజాగ్రస్తమైతే ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసుకోవడానికి అన్ని దేశాలూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారోత్పత్తినీ ఇతోధికం చేసుకోవాలి. దీనికోసం వాతావరణ మార్పులను తట్టుకొనే అధునాతన వంగడాలను ఉత్పత్తి చేసుకోవడం తప్పనిసరి. ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టేలా పటిష్ఠ సాంకేతిక వ్యవస్థలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరమూ ఉంది.

అపార అవకాశాలు

ప్రపంచంలో పలు దేశాలు పెను జన విస్ఫోటంతో సతమతమవుతుంటే- దక్షిణ కొరియా, జపాన్‌, ఇటలీ తదితరాల్లో జన సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలని యువత భావిస్తుండటం, జీవన వ్యయాల పెరుగుదల తదితరాలు దీనికి కారణం. దశాబ్దాల పాటు అమలు చేసిన ఏక సంతానం నిబంధనను చైనా తొలగించినా, జీవన వ్యయాలకు జడిసి చాలా జంటలు ఒకరికి మించి కనే ధైర్యం చేయలేకపోతున్నాయి. ఆయా దేశాల్లో శ్రామిక శక్తి తగ్గుతున్నందువల్ల విదేశీ నిపుణులు వాటిలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. చాలా దేశాలతో పోలిస్తే ఇండియాలో ప్రస్తుతం ఏకంగా అరవై అయిదు శాతం జనాభా వయసు ముప్ఫై అయిదేళ్ల లోపే ఉంది. వీరందరినీ మేలిమి మానవ వనరులుగా తీర్చిదిద్దుకోవడంపై భారత్‌ దృష్టి సారించాలి. యువతలో నైపుణ్యాలను ఇతోధికం చేయాలి. ఆధునిక సాంకేతికత ఆసరాగా ఉపాధి అవకాశాలను జోరెత్తించాలి. అప్పుడే భారీ జనసంఖ్య దేశానికి నిజమైన కలిమిగా నిలుస్తుంది.

- ఎం.వేణు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జనశక్తే ఆర్థిక వృద్ధికి బలిమిగా..

‣ సమతా భారత్‌కు ఉమ్మడి పౌరస్మృతి

‣ వ్యర్థాలతో అర్థం.. దేశానికి సౌభాగ్యం

‣ రూపాయి బలపడితేనే..

‣ పోషణ కొరవడుతున్న భారతం

‣ అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

Posted Date: 12-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం