• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష అన్వేషణకు చంద్రయానం

భారతదేశం చంద్ర లోకానికి మూడోసారి ప్రయాణం కట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2008లో తొలిసారి నిర్వహించిన చంద్రయాన్‌-1 మూన్‌ ఇంప్యాక్ట్‌ ప్రోబ్‌ను ఢీకొట్టించి చందమామపై నీటి ఉనికిని కనిపెట్టింది. చంద్రయాన్‌-2 ల్యాండర్‌ చంద్రుడిపై దిగేటప్పుడు జరిగిన సాంకేతిక లోపాలవల్ల కూలిపోయింది. చంద్రయాన్‌-3ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నేడు ప్రయోగిస్తున్నారు. దీనిద్వారా విశ్వం ఆవిర్భావం గురించి కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశముంది.

చంద్రయాన్‌-3 వ్యోమనౌక భూమి నుంచి నెల రోజులకు పైగా ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్ర కక్ష్యకు చేరుతుంది. 2019లో చంద్రయాన్‌-2 పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగడంలో విఫలమైనచోటే చంద్రయాన్‌-3 ల్యాండర్‌-రోవర్‌ను దింపుతుంది. చంద్రయాన్‌-3 వ్యోమనౌక నుంచి విడివడే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రుడి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తయిన కక్ష్యలోకి విక్రమ్‌ను పోలిన ల్యాండర్‌-రోవర్‌ను తీసుకెళుతుంది. ల్యాండర్‌ను జాబిలి ఉపరితలంపైకి పంపిన తరవాత ఈ మాడ్యూల్‌ చంద్ర కక్ష్యలోనే పరిభ్రమిస్తూ చంద్రునికీ భూమికీ మధ్య కమ్యూనికేషన్లను నిర్వహిస్తుంది. ఈసారి ల్యాండర్‌ అనుకున్న ప్రకారం దిగడానికి వీలుగా దాని సాఫ్ట్‌వేర్‌ను పటిష్ఠం చేశారు.

ఖనిజ నిక్షేపాల కోసం..

చంద్రయాన్‌-2 విక్రమ్‌ ల్యాండర్‌ విఫలం కావడానికి కారణం- అది చంద్రుడి ఉపరితలంపై 400 మీటర్ల ఎత్తులో ఉండగానే దానికి భూమితో కమ్యూనికేషన్‌ బంధం తెగిపోవడమే. అనుకున్న ప్రకారం అది 55 డిగ్రీలు వాలుగా దిగాలి. కానీ, అంతకంటే ఎక్కువ వాలుగా మొగ్గడంతో అది సమతౌల్యం తప్పి కిందకు ఒరిగిపోయింది. విక్రమ్‌ ల్యాండర్‌ స్వయంచాలిత సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తున్నందువల్ల భూమి నుంచి మన పరిశోధకులు దాన్ని నియంత్రించలేకపోయారు. ఇలాంటి వైఫల్యాన్ని నివారించగల సాఫ్ట్‌వేర్‌ను ఈసారి చంద్రయాన్‌-3 ల్యాండర్‌లో అమర్చారు. మిట్టపల్లాలను సరిగ్గా పసిగట్టి తిరగడానికి తోడ్పడే సెన్సర్లను బిగించారు. మెరుగైన విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో పటిష్ఠం చేశారు. చంద్రుడి ఉత్తర ధ్రువం కన్నా దక్షిణ ధ్రువంలో మంచు ఎక్కువ విస్తీర్ణంలో దట్టంగా పేరుకొని ఉంటుంది. చంద్రుడు ఎప్పుడూ ఒకవైపే సూర్యుడిని చూస్తూ ఉంటాడు. రెండోవైపు సూర్య కిరణాలు సోకక నిరంతరం చీకటిగానే ఉంటుంది. అందువల్ల అక్కడ మంచు చాలా ఎక్కువగా చిరకాలం నిలిచి ఉంటుంది. చంద్ర గర్భంలో అమూల్య ఖనిజ నిక్షేపాలూ ఉండవచ్చు. సూర్య కిరణాలు సోకని చంద్ర బిలాలు, గుట్టల వెనక చీకటి ఉంటుంది. 380 కోట్ల నుంచి 410 కోట్ల సంవత్సరాల క్రితం ఉల్కలు, తోకచుక్కలు ఢీకొనడంవల్ల ఏర్పడిన బిలాలు ఇవి. చంద్రుడి ఉపరితలం నుంచి మూడు నాలుగు మీటర్ల లోతు వరకు మట్టి ఉంటుంది. సరైన చోటును ఎంచుకుని తవ్వితే ఖనిజ వనరుల ఉనికిని కనిపెట్టవచ్చు. సూర్యకాంతి సోకని దక్షిణ ధ్రువం వద్ద, చంద్ర బిలాల్లోనూ భారీ పరిమాణంలో నీరు ఉండవచ్చు. చంద్రుడిపై మానవ నివాసానికి ఈ నీరు ఉపకరిస్తుంది. నీటిని ఆమ్లజని, ఉదజనిగా విడగొట్టి ఇంధనంగా మార్చి చంద్రుడి నుంచి భూమికి, ఇతర గ్రహాలకు ప్రయాణించే వ్యోమనౌకలకు అందించవచ్చు. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్ల పరిస్థితులను దక్షిణ ధ్రువ సమీపంలోని బిలాల్లో లభ్యమయ్యే శిలాజాల ద్వారా తెలుసుకునే వీలుంది. చంద్రయాన్‌-3 దింపే రోవర్‌లో చంద్రగర్భ పరిశీలనకు సిస్మోమీటర్‌ ఉంటుంది. స్పెక్ట్రోమీటర్‌, ఉష్ణ ప్రసరణ పరిశీలక సాధనాలతోపాటు చంద్రుడి మీద నుంచి భూమిపై పరిశీలన జరపడానికి షేప్‌ (స్పెక్ట్రా పోలారిమెట్రీ ఆఫ్‌ హ్యాబిటబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌) పరికరాలు కూడా ఉంటాయి. ల్యాండర్‌-రోవర్‌ చంద్రుడిపై ఒక పగలంతా పరిశీలనలు జరుపుతుంది. చంద్రుడిపై ఒక పగలు భూమిపై 14 రోజులకు సమానం. భూమికి, చంద్రుడికి గతం ఒకటే. భూమి క్రమంగా జీవ నివాసయోగ్యంగా మారగా, చంద్రుడిపై ఇంకా పురాతన యుగ పరిస్థితులే కొనసాగుతున్నాయి. చందమామను పరిశీలిస్తే భూమి తొలినాళ్లలో ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు.

భూమిపై ఉండే కాలుష్యం, వాతావరణ పొరలు చంద్రుడి మీద ఉండవు కాబట్టి, అక్కడ టెలిస్కోపుల నుంచి విశ్వాంతరాళంలోకి స్పష్టంగా తొంగిచూడవచ్చు. సుదూర తారలు, గ్రహాల ఉనికిని కనిపెట్టవచ్చు. చంద్రుడిపై మానవుడు నివసించగలడని నిరూపణ అయితే కుజుడు తదితర గ్రహాల మీదా ఆవాసాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతరిక్ష కేంద్రాల్లో దీర్ఘకాలం నివసిస్తూ పరిశోధనలు జరపవచ్చు. చంద్రుడిపై నీటి వనరులు మనిషి జీవించడానికి ప్రాణాధారమవుతాయి. అక్కడ వివిధ శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు జరుపుతూ గ్రహాంతర ప్రయాణాలకు పునాది నిర్మించవచ్చు. సరికొత్త లోహ మిశ్రమాలను, విపరీతమైన వేడిని తట్టుకునే సాధన సామగ్రిని పరీక్షించి, వినియోగిస్తే అంతరిక్ష అన్వేషణ సుసాధ్యమవుతుంది. ముఖ్యంగా రోబోలతో పనిచేయించడం, సుదూర గమ్యాలను అన్వేషించడం, ప్రమాదకర ప్రాంతాల్లోనూ సమాచారం సేకరించడం వీలవుతుంది.

సరికొత్త ఉత్సాహం

చంద్రయాన్‌-2 వైఫల్యంతో నిరుత్సాహపడిన భారతదేశానికి చంద్రయాన్‌-3 విజయం కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. త్వరలో సూర్యుడు, శుక్ర గ్రహాల వద్దకూ ఉపగ్రహాలను పంపించగలుగుతాం. అంతేకాదు, సైనిక వ్యూహ పరంగా చంద్రుడు చాలా కీలకం కానున్నాడు. అందుకే, అక్కడ పాగా వేయడానికి అమెరికా, రష్యా, చైనా, ఐరోపా సమాఖ్య, జపాన్‌, దక్షిణ కొరియాలు పోటీపడుతున్నాయి. యూఏఈ సైతం అంతరిక్ష అన్వేషణలోకి ప్రవేశించింది. రేపు చంద్రుడిపై తమకే హక్కులు ఉన్నాయని అమెరికా, రష్యా, చైనాలు పరస్పరం సవాళ్లు విసురుకోవచ్చు. ఈ పరిస్థితిలో భారత్‌ వ్యూహపరమైన కోణాన్ని విస్మరించజాలదు. అమెరికా తొలిసారి చంద్రుడిపైకి అపోలో నౌక ద్వారా వ్యోమగాములను పంపినప్పుడు ప్రపంచమంతా అబ్బురపడింది. బాలలు, యువకుల్లో సాహసిక అంతరిక్ష యాత్రలు చేయాలనే ఆసక్తిని, పట్టుదలను అపోలో యాత్రలు పెంచాయి. చంద్రయాన్‌ విజయాలు భారతీయ యువతరాన్ని విశ్వశోధకులుగా తీర్చిదిద్దుతాయి. 2026కల్లా అంతరిక్ష కార్యకలాపాలు 55,800కోట్ల డాలర్ల పరిశ్రమగా మారతాయి. ఆ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకొనేలా మన యువతరాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరముంది.

భారత్‌కు ఘనత

చంద్రయాన్‌-3 రోవర్‌ను భద్రంగా దింపిన తరవాత అది చుట్టుపక్కల సంచరిస్తూ శాస్త్రీయ ప్రయోగాలు జరుపుతుంది. ఈ సామర్థ్యాన్ని ఇంతవరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ప్రదర్శించాయి. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైతే భారత్‌ వాటి సరసన సగర్వంగా చేరుతుంది. అయితే, ఆ మూడు దేశాలు ఇంతవరకు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు తమ వ్యోమనౌకలను దింపలేదు. చంద్రయాన్‌-3 విజయం భారత్‌కు ఆ ఘనతను కట్టబెడుతుంది. భవిష్యత్తులో మానవులను, వ్యోమనౌకలను దింపడానికి, ఖనిజాల కోసం తవ్వకాలు జరపడానికి అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇది తోడ్పడుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రూపాయి బలపడితేనే..

‣ పోషణ కొరవడుతున్న భారతం

‣ అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

Posted Date: 17-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం