• facebook
  • whatsapp
  • telegram

జీఎస్టీ మండలి సంస్కరణల పథం

కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టి ఆరు వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేశ రాజధానిలో జీఎస్టీ మండలి 50వ సమావేశం జరిగింది. జీఎస్టీ విధానంలో మరిన్ని సంస్కరణలను తీసుకురావడంతో పాటు పన్ను ఎగవేతను నిరోధించాలని, చెల్లింపుదారులకు అనేక సౌలభ్యాలు కల్పించాలని నిర్ణయించారు.

దేశంలో పరోక్ష పన్నులను సంస్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2017 జులై ఒకటి నుంచి దేశమంతటా వస్తుసేవల పన్ను(జీఎస్టీ) విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలినాళ్లలో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌, రిటర్నుల సమర్పణ, వస్తుసేవలపై పన్ను రేటును నిర్ణయించడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. జీఎస్టీ మండలి వాటిని త్వరితగతిన గుర్తించి, చట్ట సవరణల ద్వారా పరిష్కారాలు చూపింది. ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేస్తూ జీఎస్టీ విధానం సులభతరంగా, వివాదరహితంగా కొనసాగడంలో ఈ మండలి కీలక పాత్ర పోషిస్తోంది.

వసూళ్ల పరుగు..

జీఎస్టీ మండలి చొరవకు దేశార్థికం పురోగమించడం, చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయడం, పన్ను చెల్లింపుదారుల్లో నిబద్ధత వంటివి తోడవడంతో పన్ను వసూళ్లు జోరందుకొన్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన మొదటి నెలలో రూ.95,633 కోట్లుగా ఉన్న ఆదాయం- ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.1,61,497 కోట్లకు చేరింది. జీఎస్టీ ఫలాలను పూర్తిగా పొందాలంటే- వస్తుసేవల పన్ను విధానం, రేటు నిర్ణయంతో పాటు సంబంధిత చట్టాల్లోనూ మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముంది. 50వ సమావేశానికి ముందు, గత సమావేశాల నిర్ణయాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పన్ను వసూళ్లకు గండి కొడుతున్న నకిలీ రిజిస్ట్రేషన్లను గుర్తించేందుకు మే నెలలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించింది. దాంతో దాదాపు 12,500 నకిలీ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, నగదు అక్రమ చలామణీని నిరోధించేందుకు వీలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)తో జీఎస్టీ డిజిటల్‌ సమాచార నిధి జీఎస్‌టీఎన్‌ను అనుసంధానించింది. దాంతో జీఎస్టీని ఎగవేయడం ద్వారా ఆర్జించిన సొమ్మును జప్తు చేసేందుకు ఈడీకి అవకాశం లభించింది. పన్ను చెల్లింపుదారుల వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా జీఎస్టీ ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు మార్గం సుగమంచేస్తూ సంబంధిత చట్టాలకు కేంద్రం సవరణలు చేపట్టింది. సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు సూచించేందుకు వీలుగా జీఎస్టీ మండలి ఆదినుంచీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌(జీఓఎం)ను ఏర్పాటు చేస్తోంది. గతంలో ఏర్పాటైన మూడు జీఓఎంల సిఫార్సులపై 50వ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనది- కాసినోలు, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ క్రీడలపై 28శాతం పన్ను విధించడం. రమ్మీ, ఫాంటసీ గేమ్స్‌ వంటి నైపుణ్య క్రీడలను జూద క్రీడలుగా పరిగణించరాదని కోర్టులు గతంలో తీర్పులు వెలువరించాయి. దాంతో వాటిపై పన్ను విధించేందుకు వీలుగా చట్ట సవరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. బంగారం, విలువైన రాళ్లను రవాణా చేయడానికి ఉద్దేశించిన ఈ-వేబిల్‌ విషయంలో ఏర్పాటైన జీఓఎం సిఫార్సులకు 50వ జీఎస్టీ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాష్ట్రం లోపల వాటి రవాణాకు ఈ-వేబిల్‌ నిబంధనను రాష్ట్రాలు విధించుకోవచ్చని నిర్ణయించారు. పొగాకు, పాన్‌ మసాలా వంటి ఉత్పత్తులపై నిఘా పెంచాలని తీర్మానించారు. జీఎస్టీ మండలి వద్ద ఇప్పటికీ కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటిలో ప్రధాన అంశం- జీఎస్టీ రేట్లు. వస్తుసేవల పన్ను విధానంలో నాలుగు రకాల పన్నురేట్లు (5, 12, 18, 28 శాతాలుగా) ఉంటున్నాయి. వీటిని రెండు లేదా మూడు శ్లాబులకు కుదించాలని, తద్వారా వివాదాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా ప్రజలపై భారం అంతగా పడదని నిపుణులు అంటున్నారు. ఆ దిశగా 2021లో జీఓఎంను ఏర్పాటుచేసినా, తుది నివేదిక రాలేదు. పన్ను రేట్లపై మండలి ఏర్పాటుచేసిన అంతర్గత ఫిట్‌మెంట్‌ కమిటీ ప్రతి సమావేశంలోనూ కొన్ని వస్తుసేవలపై పన్ను తగ్గిస్తూ వస్తోంది. 50వ సమావేశంలో సినిమా హాళ్లలో విక్రయించే తినుబండారాలు వంటి కొన్ని వస్తువులపై పన్ను ధరలను తగ్గించింది. ఇస్రో, ఆంత్రిక్స్‌ కార్పొరేషన్‌లు అందించే ఉపగ్రహ సేవలను పన్ను నుంచి మినహాయించింది. అయితే ఇవన్నీ అసంపూర్ణ చర్యలే! అన్ని మోటారు వాహనాలపై, సిమెంటుపై 28శాతం జీఎస్టీ అసంబద్ధంగా ఉంది. ఇటువంటి రేట్లను సమగ్రంగా పరిశీలించి హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌కు ఇంతవరకు మన్నన దక్కలేదు. వస్తుసేవల పన్నుకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం జీఎస్టీ చట్టం ‘అడ్వాన్స్‌ రూలింగ్‌’ విధానాన్ని పొందుపరిచింది. దాని ప్రకారం, ప్రతి రాష్ట్రంలో ఒక అడ్వాన్స్‌ రూలింగ్‌ అథారిటీ, ఒక అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటయ్యాయి. కానీ, ఒకే అంశంపై ఇవి వేర్వేరుగా ఆదేశాలు ఇస్తుండటం పన్ను చెల్లింపుదారులను అయోమయానికి గురిచేస్తోంది. ఇలాంటి వైరుధ్యాలను నివారించేందుకు జాతీయస్థాయిలో పునర్విచారణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని భావించినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

దేశార్థికం పరిపుష్టం

ఆరేళ్ల కాలంలో జీఎస్టీ తనను తాను సంస్కరించుకుంటూ అందరికీ ఆమోదయోగ్య పన్నుగా స్థిరపడింది. దీనివల్ల పారిశ్రామిక రంగానికి, వ్యాపారులకు నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గాయి. జీఎస్టీ విధానం ద్వారా ఎగుమతులపై పన్ను రద్దు, కట్టిన పన్ను వాపసు ఇవ్వడం వంటి సదుపాయాలు వ్యాపారులకు అందివచ్చాయి. దాంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. జీఎస్టీ పన్ను వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధి కనిపిస్తోంది. దేశార్థికాన్ని పరిపుష్టం చేసేందుకు వస్తుసేవల పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే- జీఎస్టీ మరింతగా అందరికీ చేరువవుతుంది.

సభ్యుల కూర్పుపై వివాదాలు

జీఎస్టీ చట్టంలో ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించి నిబంధనలు ఉన్నప్పటికీ, సభ్యుల కూర్పు విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు- ట్రైబ్యునళ్లలో జ్యుడీషియరీకి మెజారిటీ ఉండాలంటూ తీర్పు వెలువరించింది. తదనుగుణంగా ఆర్థిక చట్టం-2023 ద్వారా జీఎస్టీ ట్రైబ్యునళ్ల సభ్యుల కూర్పులో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. ఆ ప్రకారం, జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఏర్పాటయ్యే ప్రతి ట్రైబ్యునల్‌లో న్యాయశాఖ నుంచి ఇద్దరు... కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖల నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. జ్యుడీషియల్‌ సభ్యుల్లో ఒకరు దీనికి పరిపాలనా అధ్యక్షుడిగా ఉంటారు. చట్టంలో తీసుకొచ్చిన ఈ మార్పులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

- డి.వెంకటేశ్వరరావు

(విశ్రాంత సంయుక్త కమిషనర్‌, వాణిజ్య పన్నుల శాఖ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏవీ నాటి పార్లమెంటరీ ప్రమాణాలు?

‣ ఆరావళిని దోచేస్తున్నారు!

‣ అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

Posted Date: 17-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం