• facebook
  • whatsapp
  • telegram

ఎగుమతులకు చెల్లింపుల ఇక్కట్లు


 

అంతర్జాతీయ వ్యాపారంపై అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం మనదేశ ఎగుమతులకు అడ్డంకిగా పరిణమించింది. భారత్‌ నుంచి ఇరాన్‌ అధిక మొత్తంలో బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. చెల్లింపులకు అవరోధాలు ఏర్పడటంతో మన దేశం నుంచి ఇరాన్‌కు ఎగుమతులు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

అంతర్జాతీయంగా 1.20లక్షలకుపైగా వరి రకాలను సాగు చేస్తున్నారు. భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు. ప్రపంచంలో 90శాతం కంటే ఎక్కువ బియ్యం ఆసియాలో ఉత్పత్తి అవుతోంది. వినియోగం కూడా ఇక్కడే అధికం. బాస్మతి అనేది భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ దేశాల్లో సంప్రదాయంగా పండించే సుగంధ వరి రకం. ఈ బియ్యానికి ఉన్న సువాసన, రుచి కారణంగా ప్రపంచంలోనే ఉత్తమ రకంగా పరిగణిస్తున్నారు. భారత్‌లో బాస్మతి రకాన్ని జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తరాఖండ్‌, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లలో అధికంగా పండిస్తారు. మొత్తం ఉత్పత్తిలో హరియాణాది 60శాతం వాటా. మనదేశంలో 27 రకాల బాస్మతి రకాలను సాగు చేస్తున్నారు. 1966 విత్తన చట్టం ప్రకారం ఇప్పటిదాకా 34 రకాలను నోటిఫై చేశారు. భారత్‌ 2012 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ బియ్యం వ్యాపారంలో 45శాతం వాటాను సాధించింది. దీనికితోడు, బాస్మతి బియ్యం వాణిజ్యంలో దాదాపు 80శాతం వాటా మన దేశానిదే. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ గణాంకాల ప్రకారం, భారత్‌ నుంచి 2022-23లో 149దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతి అయ్యాయి. 2024లో భారత్‌ ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ధర కలిగిన బియ్యం ఎగుమతిదారుగా కొనసాగుతుందని అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్‌డీఏ) అంచనా వేసింది. మనదేశం నుంచి బియ్యం ఎగుమతులు వచ్చే క్యాలెండర్‌ సంవత్సరంలో 240 లక్షల టన్నులు దాటుతాయని పేర్కొంది.

అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌ తాను దిగుమతి చేసుకునే వస్తువులకు చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం మనదేశం నుంచి అక్కడికి భారీగా ఎగుమతయ్యే బాస్మతి బియ్యంపైనా పడుతోంది. దీనివల్ల ఇరాన్‌కు ఎగుమతులు ఇటీవల మందగించాయి. ఇరాన్‌ నుంచి భారత్‌ చమురు దిగుమతులను నిలిపివేసిన తరవాత ఆ దేశంలో రూపాయి నిల్వలు క్షీణించాయి. దీంతో బాస్మతి బియ్యానికి సంబంధించి చెల్లింపుల ప్రక్రియ క్లిష్టంగా మారింది. ప్రస్తుతం యూఏఈ కరెన్సీ దిర్హమ్‌ను ఉపయోగించి ఇరాన్‌ చెల్లింపులు చేస్తోంది. ఇరాన్‌కు ఎగుమతులు నిలిచిపోవడంతో ఏర్పడిన లోటును భర్తీ చేసుకోవడం అంత సులభంకాదని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా, ఐరోపా సమాఖ్యల ఆంక్షలను తప్పించుకోవడానికి 2012 ఏప్రిల్‌ నుంచి రూపాయితో చెల్లింపులు జరపడానికి అప్పట్లో ఇరాన్‌తో అంగీకారం కుదిరింది. దీంతో భారత్‌ నుంచి ఆ దేశానికి బియ్యం సరఫరా ఊపందుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌ నుంచి ముడిచమురు కొనుగోలును 2019లో భారత్‌ నిలిపివేసేంత వరకు రూపాయి చెల్లింపుల వ్యవస్థ కొనసాగింది. భారత్‌ నుంచి అరటి ఎగుమతులు, ఇరాన్‌ నుంచి ఆపిల్‌ దిగుమతి కోసం వస్తుమార్పిడి విధానం ఉన్నప్పటికీ బాస్మతి బియ్యం విషయంలో మూడో కరెన్సీ చెల్లింపు వ్యవస్థ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. చెల్లింపుల సమస్య ఇరాన్‌కు ఎగుమతి చేసే తేయాకు, ఔషధాలు వంటి వాటిపైనా ప్రభావం చూపుతోంది. ఈ సమస్యల్ని అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఇరుదేశాలపైనా ఉంది. మరోవైపు మనదేశంలో వరిసాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఏటికేడు పెరుగుతున్న సాగు ఖర్చులకు తగ్గట్లు మద్దతు ధర ఉండటం లేదు. పంటపై చీడపీడల ఉద్ధృతి అధికమవుతోంది. చాలా దేశాలకంటే మన దగ్గర ఉత్పాదకత తక్కువ. దీన్ని పెంచుకోవడంతో పాటు వరి సాగును లాభసాటిగా మార్చుకోవాలి. వరి దిగుబడులు దేశీయంగా ప్రజల ఆహార అవసరాలు తీర్చి, ఎగుమతి బాట పడితే- అన్నదాతకు లాభాల పంట పండుతుంది.

- డి.ఎస్‌.బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వైమానిక రవాణా.. అవకాశాల ఖజానా!

‣ భారత్‌ వ్యూహం.. ఉభయతారకం

‣ మలేసియాతో రక్షణ మైత్రి

‣ మానవతా దీప్తిశిఖ

‣ అణు ఇంధనంతో అంతరిక్ష యాత్రలు

Posted Date: 22-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం