• facebook
  • whatsapp
  • telegram

అణు ఇంధనంతో అంతరిక్ష యాత్రలు

చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు ఒక ల్యాండర్‌, రోవర్‌ను పంపేందుకు భారత్‌ తాజాగా చంద్రయాన్‌-3 వ్యోమనౌకను ప్రయోగించింది. రాబోయే రోజుల్లో చంద్రుడు, కుజుడు, గ్రహశకలాలు, తోకచుక్కలపై విస్తృత పరిశోధనల కోసం ఆర్టెమిస్‌ ఒప్పందాల్లో భాగస్వామి అయింది. దానికి అవసరమైన ఇంధనం కోసం విస్తృత ప్రయోగాలు సాగుతున్నాయి.

ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,   భారత్‌ సహా మొత్తం 27 దేశాలు ఆర్టెమిస్‌ ఒప్పందాల్లో భాగస్వాములయ్యాయి. ప్రధాని మోదీ ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. అంతరిక్షంలో మానవుడు దీర్ఘకాలం సంచరించడానికి, చంద్రుడిపై కుజుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మౌలిక వసతులు కల్పించాలని ఆర్టెమిస్‌ లక్షిస్తోంది. ఈ బృహత్‌ ప్రయత్నంలో ప్రభుత్వాలతోపాటు స్పేస్‌ఎక్స్‌, అమెజాన్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌, రోల్స్‌ రాయిస్‌ లాంటి ప్రైవేటు సంస్థలూ పాలుపంచుకొంటున్నాయి. అయితే, సుదీర్ఘ అంతరిక్ష యానాలకు, గ్రహాంతర జీవనానికి ఇంధనం ఎక్కడి నుంచి వస్తుందనేది చిక్కు ప్రశ్న. ప్రస్తుతానికి ఘన, ద్రవరూప ఇంధనాలపై నడిచే భారీ రాకెట్ల ద్వారా భూ కక్ష్యలోకి ఉప్రగహాలను, స్పేస్‌ షటిళ్లను పంపుతున్నాం. ఈ ఇంధనాలే రాకెట్ల బరువులో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్రహాంతర మానవ ఆవాసాల నిర్మాణానికి కావాల్సిన వస్తువులను భూమి నుంచే పంపాలి. రాకెట్‌ బరువు ఎక్కువైన కొద్దీ అంతరిక్షంలోకి, ఇతర గ్రహాలపైకి మనం పంపగల పే లోడ్‌ (సరకులు, ప్రయాణికుల బరువు)ను తగ్గించుకోవాల్సి వస్తుంది.

దీర్ఘకాల నివాసానికి మార్గం

ప్రస్తుతం రాకెట్‌ సాయంతో భూ కక్ష్యను చేరిన అంతరిక్ష నౌకలు అక్కడి నుంచి భూమికి సమీపంలోని కుజ గ్రహానికి వెళ్ళడానికి సౌర ఫలకాలను వాడుతున్నాయి. భూమి వద్ద లభ్యమయ్యే సౌరశక్తి సూర్యుడి నుంచి దూరానికి పోయే కొద్దీ తరిగిపోతుంది. ఉదాహరణకు, భూమిపై చదరపు మీటరు సౌర ఫలకానికి 1370 వాట్ల సౌర విద్యుత్‌ లభిస్తుంది. కుజుడి దగ్గర అందులో 43 శాతమే లభ్యమవుతుంది. అందువల్ల అంతరిక్ష నౌకకు భూమి వద్దకన్నా రెట్టింపు నిడివి సౌర ఫలకాలు అవసరమవుతాయి. ఫలితంగా బరువు పెరిగిపోతుంది. మున్ముందు సాంకేతికత ఎంత పురోగమించినా సౌర శక్తితో నడిచే అంతరిక్ష నౌకలు మహా అయితే సౌర కుటుంబంలోని గ్రహాల అన్వేషణకు మాత్రమే ఉపకరిస్తాయి. సౌర శక్తి ప్రసారం సౌర కుటుంబ పరిధికి పరిమితం కావడమే దీనికి కారణం. అందువల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ బరువును సుదూరాలకు పంపడానికి తోడ్పడే ఇంధనాలు కావాలి. రాబోయే రెండు దశాబ్దాల్లో భూమి, చంద్రుడు, కుజ గ్రహాల మధ్య రాకపోకలు సాగించగల అంతరిక్ష నౌకలకు ఆ కొత్త ఇంధనాన్ని అందించాలి. బ్రిటిష్‌ సంస్థ రోల్స్‌ రాయిస్‌ ఈ కృషిలోనే నిమగ్నమైంది. మొదట చంద్రుడిపై మానవ నివాసానికి విద్యుచ్ఛక్తిని అందించే పనిని ఆ సంస్థ చేపట్టింది. అందుకోసం యురేనియం వంటి రేడియో ధార్మిక ఇంధ నంతో నడిచే మైక్రో అంతరిక్ష అణు రియాక్టర్‌ను రూపొందిస్తోంది. ఆర్టెమిస్‌ ప్రాజెక్టు కింద 50 ఏళ్ల తరవాత తిరిగి చంద్రుడిపైకి మానవులను పంపాలని లక్షిస్తున్న అమెరికా- రోల్స్‌ రాయిస్‌ పరిశోధనలకు నిధులు అందిస్తోంది. తాను రూపొందిస్తున్న మినీ అణు రియాక్టర్‌ను 2029కల్లా చంద్రుడికి చేరవేస్తానని రోల్స్‌ రాయిస్‌ ప్రకటించింది. అది అక్కడ దీర్ఘకాల మానవ నివాసానికి పునాది వేస్తుంది. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల కోసం ట్రై-స్ట్రక్చరల్‌ ఐసోట్రోపిక్‌ (ట్రైసో) ఇంధనాన్ని రూపొందించే ప్రాజెక్టునూ రోల్స్‌ రాయిస్‌ చేపట్టింది. సాధారణ అణు రియాక్టర్‌లో అయిదు శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం 235 ఇంధన కణికలను వాడతారు. ప్రమాదవశాత్తు అత్యుష్ణ పరిస్థితులు ఏర్పడితే రియాక్టర్‌లో యురేనియం కణికలు కరిగిపోయి అడ్డూ ఆపూ లేకుండా అణు విచ్ఛిత్తి జరిగి ఘోర విపత్తు వచ్చిపడుతుంది. చెర్నోబిల్‌, ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రాల్లో జరిగింది అదే.

ప్రయోగం విజయవంతమైతే..

రోల్స్‌ రాయిస్‌ ట్రైసో ప్రాజెక్టులో అత్యంత బలిష్ఠమైన సెరామిక్‌ పొరల మధ్య యురేనియం కణికెలను బంధిస్తారు. ఆ పొరలు తీవ్రమైన ఉష్ణోగ్రతలనూ తట్టుకోగలవు. ఒకవేళ రియాక్టర్‌ పేలిపోయినా వినాశకర రేడియో ధార్మిక శక్తి బయటకు రాకుండా సెరామిక్‌ పొరలు అడ్డుకుంటాయి. ట్రైసో ఇంధనం ద్వారా చాలా ఎక్కువ శక్తి లభిస్తుంది. అందువల్ల సౌర కుటుంబం లోపల, వెలుపల దీర్ఘకాల అంతరిక్ష యానానికి ఆ ఇంధన రియాక్టర్లు చక్కగా ఉపయోగపడతాయి. రోల్స్‌ రాయిస్‌తోపాటు ట్రైసో ఎక్స్‌ అనే అమెరికన్‌ కంపెనీ సైతం ఈ రంగంలో చురుగ్గా ఉంది. 2027లో ట్రైసో ఇంధనంతో ప్రయోగాత్మక అంతరిక్ష యాత్రను చేపట్టాలని అమెరికా అధునాతన రక్షణ పరిశోధన ప్రాజెక్టుల సంస్థ (డార్పా) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే మున్ముందు భద్రమైన సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు తొలి అడుగు పడుతుంది.

- ప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతులు రెట్టింపు ధరలు పొందే వ్యూహం

‣ జీఎస్టీ మండలి సంస్కరణల పథం

‣ అంతరిక్ష అన్వేషణకు చంద్రయానం

‣ ప్రజలే సార్వభౌములు!

Posted Date: 17-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం