• facebook
  • whatsapp
  • telegram

మలేసియాతో రక్షణ మైత్రి  



దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ దూకుడు తమ సార్వభౌమత్వానికి ముప్పు తెస్తుందని మలేసియా ఆందోళన చెందుతోంది. దాన్ని నిలువరించే వ్యూహాల్లో భాగంగా ప్రాంతీయంగా ఇండియాతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. దిల్లీ సైతం, కౌలాలంపూర్‌తో మైత్రిని పెంచుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.


మలేసియాలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలి పర్యటన- ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రక్షణ రంగంలో పరస్పరం సహకారానికి ఇరుదేశాలు 1993లో ఓ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉభయ ప్రయోజనాలున్న అంశాల్లో మరింత కలిసికట్టుగా ముందుకు సాగేందుకు వీలుగా దాన్ని సవరించాలని తాజాగా నిర్ణయించుకున్నాయి. రక్షణ శాఖల మధ్య పరస్పర సహకారం పెంపుదల కోసం వ్యూహాత్మక వ్యవహారాల కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నాయి. ద్వైపాక్షిక రక్షణ సహకార కమిటీ సమావేశాన్ని ఈ ఏడాదే ఇండియాలో నిర్వహించాలన్న నిర్ణయమూ కీలకమైనదే. మలేసియా వైమానికదళం- రాయల్‌ మలేసియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అమ్ములపొదిలోని అస్త్రాల్లో సుఖోయ్‌-30ఎంకేఎం యుద్ధవిమానాలు అత్యంత ప్రధానమైనవి. యుద్ధ విమానాలపై ఆ దేశ బలగాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు నిర్వహణ, సాంకేతిక మద్దతు అందించేందుకు వీలుగా సుఖోయ్‌-30 ఫోరమ్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియా అంగీకరించింది. కౌలాలంపూర్‌లో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ప్రాంతీయ కార్యాలయాన్ని రాజ్‌నాథ్‌ ప్రారంభించారు. మలేసియాతోపాటు ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలతో హెచ్‌ఏఎల్‌ వాణిజ్య కార్యకలాపాలకు అది కేంద్రంగా మారే అవకాశం ఉంది. సాయుధ బలగాల ఆధునికీకరణకు కౌలాలంపూర్‌ కొంతకాలంగా ప్రణాళికలు రచిస్తోంది. వాటిలో కీలకంగా మారగల అవకాశం, సామర్థ్యం భారత రక్షణ పరిశ్రమకు ఉన్నాయి. ప్రధానంగా రక్షణ ఉత్పత్తుల నిర్వహణ, మరమ్మతు, ప్రక్షాళన ప్రక్రియల్లో సహకారం పెంచుతామని దిల్లీ తాజాగా హామీ ఇచ్చింది. సాంకేతిక సామర్థ్యాల పెంపు, స్వావలంబన సాధనలోనూ దోహదపడతామని భరోసా ఇచ్చింది. ఇండియా దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు మలేసియా ఇటీవలి కాలంలో ఆసక్తి చూపింది. చివరికి వాటికి బదులు దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్‌ఏ-50 జెట్‌ల కొనుగోలుకు మొగ్గు చూపింది. దిల్లీ-కౌలాలంపూర్‌ రక్షణ సంబంధాలపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజ్‌నాథ్‌ పర్యటనలో కుదిరిన ఒప్పందాలతో అవన్నీ పటాపంచలయ్యాయి.


ఇండియా, మలేసియా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని 2015లో మరింత పైస్థాయికి చేర్చాయి. ఆపై ద్వైపాక్షిక వాణిజ్యం బాగా పెరిగింది. ఆగ్నేయాసియాలో భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి- మలేసియా. దక్షిణాసియాలో కౌలాలంపూర్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా దిల్లీ నిలుస్తోంది. మలేసియా నుంచి పామాయిల్‌, దాని ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, ఎలెక్ట్రికల్‌-ఎలెక్ట్రానిక్‌ సాధనాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా- ఆ దేశానికి పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలను ప్రధానంగా ఎగుమతి చేస్తోంది. ఇతర కరెన్సీలతోపాటు భారత రూపాయల్లోనూ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేలా ఇటీవల ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికన్‌ డాలరుపై ఆధారపడటాన్ని పరిమితం చేయడంతోపాటు ఇరు దేశాల కంపెనీలకు వ్యాపార లావాదేవీల ఖర్చులను తగ్గించేందుకు అది దోహదపడనుంది. రూపాయిని ప్రపంచ కరెన్సీగా మార్చే దిశగా ఇండియా చేస్తున్న ప్రయత్నాలకూ ఊతమివ్వనుంది.


దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరి మలేసియాకు తలనొప్పిగా మారింది. బీజింగ్‌ను నిలువరించేందుకు అనుసరిస్తున్న వ్యూహాల్లో భాగంగా ఇండియా, జపాన్‌లతో మైత్రిని బలోపేతం చేసుకోవడానికి మలేసియా ఆరాటపడుతోంది. దిల్లీతో కలిసి కౌలాలంపూర్‌ తరచూ నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇండియా ఇప్పటికే అంతర్జాతీయ అగ్రశక్తుల్లో ఒకటిగా ఎదిగింది. ఆర్థికంగానూ బాగా బలోపేతమైంది. దానితో సంబంధాలు దీర్ఘకాలంలో తమకు ఎంతటి ప్రయోజనకరంగా మారతాయో మలేసియాకు తెలుసు. తమ దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న భారతీయ కార్మికులకు అన్ని రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పించాలని కౌలాలంపూర్‌ ఇటీవల నిర్ణయం తీసుకోవడానికి అదీ ఓ కారణమే. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరతల స్థాపన ఆవశ్యకత దృష్ట్యా యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ కింద ఇండియా సైతం ఆ దేశానికి సముచిత ప్రాధాన్యం ఇస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా పన్నాగాలను తిప్పికొట్టే లక్ష్యంతో రక్షణ రంగంలో కౌలాలంపూర్‌తో మైత్రిని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.


- ఎం.నవీన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవతా దీప్తిశిఖ

‣ అణు ఇంధనంతో అంతరిక్ష యాత్రలు

‣ రైతులు రెట్టింపు ధరలు పొందే వ్యూహం

‣ జీఎస్టీ మండలి సంస్కరణల పథం

‣ అంతరిక్ష అన్వేషణకు చంద్రయానం

‣ ప్రజలే సార్వభౌములు!

Posted Date: 19-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం