• facebook
  • whatsapp
  • telegram

వైమానిక రవాణా.. అవకాశాల ఖజానా!

కొవిడ్‌ అనంతరం విమానయాన పరిశ్రమ వృద్ధి మార్గంలో సాగుతోంది. ప్రయాణికుల రద్దీ పెరగడం, ఆర్థిక వ్యవస్థలు పుంజుకొంటుండటం ఈ పరిశ్రమ గణనీయ లాభాల్ని సాధించేందుకు దోహద పడుతున్నట్లు అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) ఇటీవల వెల్లడించింది. భారత విమానయాన రంగంలో అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ పరిధిలో 137 విమానాశ్రయాలు ఉన్నాయి. దేశంలో అన్ని విమానయాన సంస్థలు కలిపి సుమారు 700 విమానాలను నడుపుతున్నాయి.  వచ్చే పదేళ్లలో సాధించే వృద్ధిని దృష్టిలో పెట్టుకుని 1,200పైగా విమానాల కొనుగోలుకు అవి సంకల్పించడం భారత విమానయాన పరిశ్రమ పురోగతికి నిదర్శనమంటూ ‘ఆసియా పసిఫిక్‌ విమానయాన సంస్థ’ ఇటీవల పేర్కొనడం గమనార్హం. ప్రపంచవ్యాప్త ప్రయాణికుల వృద్ధికన్నా భారత్‌లో ఈ పురోగతి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ 21 శతాబ్దపు విశ్వ విమానయాన విపణిగా అవతరించనుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే సిబ్బంది కొరతతో సతమతమవుతున్న సంస్థలకు రాబోయే కొన్నేళ్లలో కొనుగోలు చేయనున్న విమానాలకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారనుంది. 2014-19 సంవత్సరాల మధ్య సిబ్బంది కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌ ఉన్నా కూడా విమానాలను కొంతమేర నడపలేని పరిస్థితి నెలకొంది. అలాంటి సమస్య పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పైలట్లు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు తదితర మానవ వనరుల కొరతను అధిగమిస్తేనే ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది.

అధిక ధరలతో ముప్పే

ఆర్థిక సమస్యల కారణంగా ఇటీవల గో ఫస్ట్‌ విమానయాన సంస్థ సేవలు నిలిచిపోవడం, స్పైస్‌జెట్‌ ఆర్థిక ఇబ్బందులతో సగం విమానాలనూ నడపలేని పరిస్థితుల్లో చిక్కుకున్న ఉదంతాలతో ఛార్జీలు ఆకాశాన్ని తాకాయి. ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లులు పడ్డాయి. ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల తదితర పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటూ దేశీయ విమానయాన సంస్థలన్నీ ప్రయాణ ఛార్జీలను భారీగా పెంచేశాయి. అంతర్జాతీయంగానూ ధరలు పెరిగాయి. భారత్‌, జపాన్‌, ఇండొనేసియా, దక్షిణ కొరియాలో పెరుగుదల అధికంగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ క్రమంలో విమాన టికెట్‌ ధరలు హేతుబద్ధమైన రీతిలో ఉండేలా ఓ విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. టికెట్ల ధరలపై స్వీయ నియంత్రణ విధానాలను రూపొందించుకోవాలని, దాన్ని డీజీసీఏ పర్యవేక్షించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టంచేయడం గమనార్హం. సాధారణంగా సీజన్‌లో 20 నుంచి 30 శాతం వరకు ఛార్జీల పెరుగుదల సహజమే. కానీ ఈ పెరుగుదల శ్రుతి మించితే దీర్ఘకాలంలో చేటు తప్పదని అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి(ఏసీఐ) ఆసియా పసిఫిక్‌ డీజీ స్టెఫానో బారోన్సీ హెచ్చరించారు. దీనివల్ల విమానయాన పరిశ్రమ దీర్ఘకాలిక పునరుద్ధరణకు అవరోధం ఏర్పడుతుందని, అనుబంధ పరిశ్రమలపైనా దుష్ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఛార్జీల పెరుగుదలను దీర్ఘకాలంలో పునరుత్తేజానికి దోహదపడేలా హేతుబద్ధీకరించాలని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అవకాశవాద విధానాలను ఆశ్రయిస్తే విమానయాన రంగానికే ముప్పుగా పరిణమిస్తుందన్న హెచ్చరికను పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

భారీగా ఉద్యోగ కల్పన

విమానయాన పరిశ్రమ వృద్ధితో ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. టాటా గ్రూప్‌ అధీనంలోని సంస్థల్లో సుమారు 20వేల మంది సిబ్బంది ఉండగా, 2035 నాటికి మరికొన్ని వేల మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఇండిగో సంస్థ 2035 నాటికి భారీగా విమానాలు కొనుగోలుచేసే ప్రణాళికల్లో ఉండటంతో పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు సమకూరనున్నాయి. నిజానికి విమానయాన రంగంలో ఒక ప్రత్యక్ష ఉద్యోగానికి మరికొన్ని పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పౌర విమానయాన రంగం రాబోయే రెండు దశాబ్దాల్లో సుమారు మరో నలభై లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని ఆ శాఖ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యయాల ఒత్తిళ్లు, విమానాల సరఫరా తదితర సవాళ్లను అధిగమించి, హేతుబద్ధమైన ధరల విధానాన్ని అనుసరిస్తే- విమానయాన రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయం.

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ వ్యూహం.. ఉభయతారకం

‣ మలేసియాతో రక్షణ మైత్రి

‣ మానవతా దీప్తిశిఖ

‣ అణు ఇంధనంతో అంతరిక్ష యాత్రలు

Posted Date: 22-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం