• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ వ్యూహం.. ఉభయతారకం


భారత్‌ - ఫ్రాన్స్‌ 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త శకంలోకి అడుగుపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి ఫ్రాన్స్‌ పర్యటన కీలక రక్షణ ఒప్పందాలకు తుది రూపునిచ్చింది. ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని- ఫ్రాన్స్‌, యూఏఈల్లో పర్యటించారు.


భారత్‌కు హిందూ మహాసముద్రంలో భౌగోళిక ఆధిపత్యం ఉంది. దీంతో ఇక్కడ చైనా దూకుడును కట్టడి చేసేందుకు అగ్రదేశాలు ఇండియా సహకారాన్ని ఆశిస్తున్నాయి. ఇప్పటికే డ్రాగన్‌ వద్ద 78 జలాంతర్గాములు ఉన్నట్లు గ్లోబల్‌ ఫైర్‌పవర్‌ ఇండెక్స్‌ వెల్లడిస్తోంది. మరోవైపు దిల్లీ వద్ద ఉన్న 18లో చాలావరకు కాలం చెల్లినవే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆరు కల్వరీ శ్రేణి జలాంతర్గాముల తయారీ కోసం 2005లో చేపట్టిన ‘ప్రాజెక్టు-75’ ముగింపు దశకు చేరింది. ఈ ప్రాజెక్టు కోసం మన దేశంలోని మాజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌(ఎండీఎల్‌), ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ కలిసి పనిచేశాయి. మరోవైపు దీంతోపాటు చేపట్టిన ప్రాజెక్టు-75(ఐ) మళ్ళీ ఊపిరి పోసుకొంది. ఇది పట్టాలెక్కేందుకు కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న జలాంతర్గామి నిర్మాణ వసతులు, నిపుణులను ఖాళీగా ఉంచకుండా సద్వినియోగం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. అదనంగా మూడు కల్వరీ శ్రేణి జలాంతర్గాముల నిర్మాణానికి ప్రధాని పర్యటనలో ఎండీఎల్‌, నేవల్‌ గ్రూప్‌ మధ్య చర్చలు జరిగాయి. వాస్తవానికి 2005లోనే ఫ్రాన్స్‌తో జరిగిన ఒప్పందంలో అవసరమైతే అదనంగా మూడు జలాంతర్గాములు కొనుగోలు చేసేలా నిబంధన ఉంది. కొన్నేళ్ల క్రితం నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ నౌకాదళ పరిస్థితిని అంచనా వేసి, ఆ నిబంధనను ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. తాజాగా ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో తొలుత అదనపు ‘కల్వరీ’ల నిర్మాణ అంశాన్ని చేర్చినా, వివిధ కారణాలతో తొలగించారు. కొత్త కల్వరీల్లో ఏఐపీ, స్కాల్ప్‌ ఎన్‌సీఎం క్షిపణులను అమర్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు అణుశక్తి జలాంతర్గాముల నిర్మాణంపై దృష్టి సారించే అవకాశం ఉందనేందుకు దీన్ని సంకేతంగా భావిస్తున్నారు. ఫ్రాన్స్‌ కూడా భారత చెల్లింపు వ్యవస్థ యూపీఐ వినియోగానికి పచ్చజెండా ఊపడం ఈ పర్యటనలో కొసమెరుపు.


ఫ్రాన్స్‌వైపే మొగ్గు

భారత్‌ నౌకాదళం కోసం అభివృద్ధి చేస్తున్న టెడ్‌బీఎఫ్‌ (ట్విన్‌ ఇంజిన్‌ డెక్‌బేస్డ్‌ ఫైటర్‌ జెట్‌) అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై మోహరించే యుద్ధవిమానాల ఎంపిక కీలకంగా మారింది. ఈ క్రమంలో అమెరికా తయారీ ‘సూపర్‌ హార్నెట్‌’ను కాదని రఫేల్‌కే భారత్‌ ఓటు వేసింది. రెండింటి శక్తి సామర్థ్యాలు దాదాపు సమానంగానే ఉన్నా, ఇప్పటికే వైమానిక సేన ఈ ఫ్రెంచి విమానాలను ఉపయోగిస్తోంది. నౌకాదళం, వాయుసేన రకం రఫేల్స్‌లో 80 శాతం సారూప్యతలు ఉంటాయి. దీంతో విడిభాగాలకు ఇబ్బంది ఉండదు. శిక్షణ, నిర్వహణ కేంద్రాల వ్యయమూ తప్పుతుంది. ఇప్పటికే భారత్‌ అవసరాలకు తగినట్లు వాయుసేన రఫేల్స్‌లో మార్పులు జరిగాయి. వాటిని నౌకాదళం కూడా వాడుకొనే అవకాశం ఉంది. అదే సూపర్‌ హార్నెట్‌లు కొనుగోలు చేస్తే, వాటిలో మార్పులకు అమెరికా సవాలక్ష నిబంధనలు విధిస్తుంది. ఇక రక్షణ కొనుగోళ్ల మండలి ప్రధాని ఫ్రాన్స్‌ పర్యటనకు ముందే రఫేల్స్‌కు పచ్చజెండా ఊపింది. కానీ, ఫ్రాన్స్‌లో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశం లేదు. మరోవైపు ‘దసో’ సంస్థ మాత్రం ‘రఫేల్‌ ఎం’ రకాన్ని భారత్‌ ఎంచుకొందని ప్రకటించింది. గతంలో రఫేల్‌ విమానాల కొనుగోలు సమయంలో రాజకీయ దుమారం రేగిన క్రమంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. సంయుక్తంగా అభివృద్ధి చేయడంపై భారత్‌-ఫ్రాన్స్‌ ఆసక్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం బ్రిటన్‌ సంస్థ రోల్స్‌రాయిస్‌ కూడా పోటీ పడుతుండగా, మొగ్గు ఫ్రాన్స్‌వైపే ఉన్నట్లు కనిపిస్తోంది.


యూఏఈతో ఆర్థిక మైత్రి

ఫ్రాన్స్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)ను సందర్శించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత మోదీ అయిదోసారి ఈ దేశంలో పర్యటించారు. ఇరు దేశాల బంధానికి ఇంధనం, ఆర్థిక, ప్రవాసుల అంశాలే మూలాధారం. ఈ పర్యటనలో వాటికి సంబంధించిన కీలక ఒప్పందాలు కుదిరాయి. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకొనేలా రూపాయి- దిర్హమ్‌లో వాణిజ్యం చేసేందుకు ఆర్‌బీఐ- సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ యూఏఈ ఒడంబడిక చేసుకొన్నాయి. దీంతో ఎక్స్ఛేంజి రేట్లలో ఒడుదొడుకులను నివారించడంతోపాటు అదనపు ఖర్చు, సమయం తగ్గుతాయి. భారత్‌లో అత్యధిక పెట్టుబడులు పెట్టే తొలి పది దేశాల్లో ఒకటిగా యూఏఈ నిలుస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో, భారత్‌లో పెట్టుబడులు పెట్టడం తేలికవుతుంది. అంతర్జాతీయంగా రూపాయి వినియోగం పెరిగేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. యూఏఈలోని దాదాపు 30 లక్షలమంది ప్రవాస భారతీయులు మరింత సులువుగా తమ కుటుంబాలకు డబ్బులు పంపేందుకు అవకాశం దక్కుతుంది. ఇక ఇరు దేశాల మధ్య కరెన్సీ ఎక్స్ఛేంజి రేట్‌ అంశాలను పరిష్కరించుకోవడానికి ‘లోకల్‌ కరెన్సీ సెటిల్మెంట్‌ వ్యవస్థ’ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. భారత్‌కు చెందిన యూపీఐ, యూఏఈకి చెందిన ఐపీపీని అనుసంధానించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది- పశ్చిమ దేశాల ఆర్థిక ఆయుధమైన అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ ‘స్విఫ్ట్‌’కు దూరం జరిగేందుకు ఇరు దేశాల ప్రయత్నంగా భావించవచ్చు. యూఏఈ క్రమంగా వాషింగ్టన్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరు, సముద్ర భద్రత, సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాల్లో దిల్లీతో కలిసి అడుగులు వేస్తోంది. భారత్‌ నుంచి నాగ్‌, బ్రహ్మోస్‌ క్షిపణుల కొనుగోలుకు చర్చలు జరుపుతోంది. గల్ఫ్‌ దేశాల్లో రాజకీయంగా బలమైన పలుకుబడి కలిగిన యూఏఈ- భారత పశ్చిమాసియా వ్యూహంలో కీలకంగా మారింది.


కలిసి అడుగులు

ప్రధాని మోదీ 2015లో యూఏఈలో చేపట్టిన పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసింది. దాంతో 2019లో సభ్యదేశాల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఇస్లామిక్‌ సహకార సంస్థ(ఓఐసీ) సదస్సుకు భారత్‌ను యూఏఈ ఆహ్వానించింది. పుల్వామా దాడికి భారత్‌ ప్రతిస్పందనను, కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపును ఆ దేశం అర్థం చేసుకొంది. కశ్మీర్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చిన తొలి దేశం యూఏఈనే. గతేడాది సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదరడం ఇరు దేశాల మధ్య అవగాహనకు అద్దం పట్టింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సృష్టించిన ఆహార ధాన్యాల కొరత యూఏఈని భారత్‌కు మరింత చేరువ చేసింది.


- పెద్దింటి ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మలేసియాతో రక్షణ మైత్రి

‣ మానవతా దీప్తిశిఖ

‣ అణు ఇంధనంతో అంతరిక్ష యాత్రలు

‣ రైతులు రెట్టింపు ధరలు పొందే వ్యూహం

‣ జీఎస్టీ మండలి సంస్కరణల పథం

‣ అంతరిక్ష అన్వేషణకు చంద్రయానం

‣ ప్రజలే సార్వభౌములు!

Posted Date: 19-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం