• facebook
  • whatsapp
  • telegram

సౌర విద్యుత్తుకు పెద్దపీట



సంప్రదాయేతర విధానాల్లో కరెంటు ఉత్పత్తికి ఊతం ఇచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రోజులో వినియోగ సమయాన్ని బట్టి విద్యుత్‌ ఛార్జీలు విధించాలని నిర్ణయించింది. గృహ వినియోగదారులకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.


దేశీయంగా విద్యుత్తులో సింహభాగం థర్మల్‌ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్‌, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్‌ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. నిజానికి రుతువులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలను బట్టి విద్యుత్తు వినియోగం ఏ రోజుకారోజు మారుతుంటుంది. విద్యుత్తు ఉత్పత్తి, వినియోగం ఏకకాలంలో జరగాలి. ఇవి పరిమిత కనిష్ఠ లేదా గరిష్ఠ స్థాయి దాటినప్పుడు మొత్తం సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌) విఫలమై దేశమంతా అంధకారంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.'


భారీ వ్యయం

సౌర విద్యుత్తు పగటిపూట మాత్రమే అందుతుంది. పవన విద్యుత్తు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. వాటి నుంచి తక్షణ ఉత్పత్తి పెంపు సాధ్యం కాదు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచడానికి కొంత సమయం అవసరమవుతుంది. అయితే జల విద్యుత్తు ఉత్పత్తిని పెంచడంతో పాటు, బ్యాటరీల్లో నిల్వలు ఉంటే అప్పటికప్పుడు వాడుకునే అవకాశం ఉంటుంది. లభ్యత పెద్ద మొత్తంలో లేనందువల్ల వాటిపై పూర్తిగా ఆధారపడలేం. పైగా బ్యాటరీల వినియోగం చాలా ఖర్చుతో కూడుకొన్నది. ఈ క్రమంలో విద్యుత్తు గ్రిడ్‌ వైఫల్యం చెందకుండా చూసుకోవడం కత్తి మీద సాము లాంటిది. పగటిపూటే లభ్యమయ్యే సౌర తదితర మిగులు విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేయడం, జల విద్యుత్తు కేంద్రాల్లో నీటిని వెనక్కి తోడి మళ్ళీ కరెంటు ఉత్పత్తికి వినియోగించడం వంటివి చేస్తున్నారు. రెండుసార్లు యంత్రాలు పనిచేయడం వల్ల విద్యుత్తు వృథా అధికంగా ఉంటుంది. అందువల్ల రాత్రిళ్లు విద్యుత్తు వినియోగాన్ని సాధ్యమైనంత కట్టడి చేస్తే ఆ మేరకు సౌర విద్యుత్తును ప్రోత్సహించవచ్చు. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాల పెంపు, గ్రిడ్‌ స్థిరత్వం లక్ష్యంగా కేంద్రం ఇటీవల విద్యుత్తు వినియోగదారుల హక్కుల నియమావళి-2020ని సవరించింది. ఇందులో భాగంగా వ్యవసాయం మినహా మిగిలిన వినియోగదారులు రోజులో విద్యుత్తును వాడే సమయాన్ని బట్టి ఛార్జీలు (టైం ఆఫ్‌ ది డే) విధించాలని ప్రతిపాదించింది. కేంద్రం తాజా సవరణల్లో భాగంగా పగటి పూట సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే ఎనిమిది గంటల పాటు విద్యుత్తు ఛార్జీల్లో ఇరవై శాతం రాయితీ అందిస్తారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆరు నుంచి పది గంటల దాకా విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. ఈ సమయంలో గృహాలకు 10శాతం, ఇతర వర్గాలకు 20శాతం అధిక ధర వసూలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి తొలుత 10 కిలోవాట్ల పైబడి వాడే లో టెన్షన్‌ పారిశ్రామిక, వ్యాపార వినియోగదారులకు, స్మార్ట్‌ మీటర్లు ఉన్నవారికి అమలు చేయాలని భావిస్తోంది. 2025 ఏప్రిల్‌ నుంచి గృహ వినియోగదారులకూ దీన్ని వర్తింపజేయాలని లక్షిస్తోంది. ఈ విధానం అత్యధికంగా విద్యుత్తు వినియోగించే భారీ పరిశ్రమలు, పెద్ద వ్యాపార సముదాయాలకు ఎప్పటి నుంచో అమలులో ఉంది. వాటికి ఉదయం, సాయంత్రం ఆరు నుంచి 10 గంటల మధ్య యూనిట్‌ను ఒక రూపాయి అధిక ధరకు, మిగిలిన సమయాల్లో పగటిపూట సాధారణ ధరకు, రాత్రి ఒక రూపాయి తగ్గింపుతో కరెంటు అందిస్తున్నారు. దానికి కొంచెం భిన్నంగా కేంద్రం ఇటీవలి సవరణల్లో గరిష్ఠ వినియోగ సమయాల్లో అధిక ధరను కొనసాగిస్తూ, పగటిపూట మాత్రం రాయితీ అందజేయాలని సూచించింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి గంటల వారీగా విద్యుత్తును నమోదు చేసే డిజిటల్‌ మీటర్లను బిగించాలి. ఇది భారీ వ్యయంతో కూడుకున్న విషయం.


ఉపశమనం కష్టమే!

చిన్న వ్యాపారాలన్నీ పగటి పూట ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల ఈ విధానంలో వాటికి కరెంటు బిల్లులు తగ్గవచ్చు. గృహాల్లో మిక్సీలు తదితరాల వినియోగం ఉదయం, సాయంత్రం ఆరు నుంచి పది గంటల సమయంలోనే అధికంగా ఉంటుంది. అందువల్ల గృహ వినియోగదారులకు దీనివల్ల పెద్దగా ఉపశమనం ఉండకపోవచ్చు. అయితే, కేంద్రం సవరణలు సౌర విద్యుత్తును, స్మార్ట్‌ మీటర్లను ప్రోత్సహించేలా ఉన్నాయి. దానివల్ల కరెంటు డిమాండు నిలకడగా ఉండటంతో పాటు విద్యుత్తు సంస్థలకు ఉత్పత్తి ప్రణాళిక సులభతరం అవుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు

‣ ఎగుమతులకు చెల్లింపుల ఇక్కట్లు

‣ వైమానిక రవాణా.. అవకాశాల ఖజానా!

‣ భారత్‌ వ్యూహం.. ఉభయతారకం

‣ మలేసియాతో రక్షణ మైత్రి

‣ మానవతా దీప్తిశిఖ

‣ అణు ఇంధనంతో అంతరిక్ష యాత్రలు

Posted Date: 24-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం