• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్యం


శీతోష్ణస్థితి  నియంత్రణలో మహాసముద్రాలదే ముఖ్య భూమిక. నీలి ఆర్థిక వ్యవస్థ, సాగర వనరుల ద్వారా జరిగే సుస్థిర అభివృద్ధి విలువ అపారం. అనంత జలరాశిలోని అపార జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.


భూగోళంపై వ్యాపించిన సముద్ర భాగంలో 39శాతమే వివిధ దేశాల అధికార పరిధిలో ఉంది. మిగిలిన సముద్ర జలరాశి- అంతర్జాతీయ జలాలే. అందులో చేపలు పట్టడానికి, నౌకలు, జలాంతర్గాములు తిరగడానికి, కేబుల్స్‌ పైపులైన్లు వేయడం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు, విమానాలు ఎగరడానికి అన్ని దేశాలకూ స్వేచ్ఛ ఉంటుంది. సముద్రాలు, సాగర కాలుష్యం, రవాణా మార్గాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ జలాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు తగిన అంతర్జాతీయ ఒడంబడికలు లేవు. ఆ లోటును తీర్చడానికి, అంతర్జాతీయ జలాల పరిసరాలను కాపాడటానికి, అక్కడి సహజ వనరులు, నౌకాయానం, ఇతర అంశాలపై తలెత్తే తగాదాల పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీన్ని జాతీయ అధికార పరిధి వెలుపలి జీవవైవిధ్య ఒప్పందం లేదా అంతర్జాతీయ జలాల ఒప్పందం (హైసీస్‌ ట్రీటీ)గా వ్యవహరిస్తున్నారు. 2004 నుంచి ఐరాస చొరవతో ప్రపంచ దేశాల మధ్య ఈ ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు గత నెలలోనే ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలో జరిగే ఐరాస సర్వప్రతినిధి సభలో కనీసం 60 సభ్య దేశాలు ఆమోదించిన తరవాత ఇది అమలులోకి వస్తుంది. అనంతరం ఆయా దేశాల చట్టసభలూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.


బాధ్యతాయుత వినియోగం

ఏ దేశానికైనా తన తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్‌ మైళ్ల (22 కి.మీ.)దాకా వ్యాపించి ఉన్న ప్రాదేశిక జలాలపై సార్వభౌమాధికారం దక్కుతుంది. ఆయా దేశాలు తమ తీరం నుంచి 200 నాటికల్‌ మైళ్ల (370 కి.మీ.) మేరకు జాతీయ అధికార పరిధితో కొన్ని పరిమిత ప్రయోజనాలతో కూడిన ప్రత్యేక ఆర్థిక మండళ్లను కలిగి ఉంటాయి. ఈ ప్రాంతానికి ఆవల వ్యాపించి ఉన్న మహాసముద్రాన్ని మానవ ఉమ్మడి వారసత్వ సంపదగా పరిగణిస్తారు. ఐరాస సముద్ర చట్ట ఒప్పందం-1982 కేవలం ప్రాదేశిక జలాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని సముద్ర ప్రాంతాలను మాత్రమే నియంత్రిస్తుంది. ముఖ్యంగా జీవవైవిధ్య సంరక్షణ విషయంలో తగిన రక్షణ కరవైంది. ఐరాస అంచనా ప్రకారం- ప్రపంచంలోని భూభాగంలో 17శాతం, సముద్ర భాగంలో 10శాతమే రక్షిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ జీవవైవిధ్య ఫ్రేమ్‌వర్క్‌, భూమి, సముద్ర ప్రాంతంలోని 30శాతాన్ని 2030 నాటికి సంరక్షించాలనే 30/30 ప్రతిజ్ఞ తదితర ఒప్పందాల లక్ష్యసాధనల దిశగా ముందడుగు వేసేందుకు అంతర్జాతీయ జలాల ఒప్పందం చట్టపరమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కొన్నేళ్లుగా శీతోష్ణస్థితి మార్పులతోపాటు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, కాలుష్య కారకాలు, చేపలవేట పెరిగాయి. దానివల్ల అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్య నష్టానికి, ఆవరణ వ్యవస్థల క్షీణతలను ఎదుర్కోవడానికి దేశ ప్రాదేశిక జలాలకు ఆవల సైతం సముద్ర రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు అవసరమైన విధివిధానాలను ఈ ఒప్పందం సమకూరుస్తుంది. సముద్ర పరిసరాలను బాధ్యతాయుతంగా వినియోగించేలా చూడటానికి, జీవవైవిధ్య విలువను సంరక్షించడానికి ఇది తోడ్పడుతుంది.



చర్చలతో పరిష్కారం

శాస్త్రీయ, వాణిజ్య రంగాల్లో వినియోగించే ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో వాడే సముద్ర గర్భ వనరుల్లో న్యాయమైన వాటాలు, లాభాల పంపిణీ వంటివి తేలాల్సి ఉంది. దీనిపై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య మరింత స్పష్టత రావాలి. సాగర సాంకేతికత పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉండి సాగర జన్యు వనరులపై పేటెంట్లు కలిగి ఉన్న ప్రైవేటు సంస్థలకు దన్నుగా ఉన్న కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ఒప్పందం సంరక్షణ, సుస్థిరతల మధ్య సమతూకాన్ని పాటించడం లేదంటూ కీలకమైన అంతర ప్రభుత్వ సమావేశం నుంచి రష్యా ఉపసంహరించుకుంది. చాలావరకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ జలాల్లో శాస్త్రీయ అన్వేషణ జరపడానికి కావాల్సిన సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం లేవు. ఫలితంగా సాగర రక్షిత ప్రాంతాల ఏర్పాటు, నిర్వహణ, వ్యయం, లాభాల వాటాల పంపకం వంటి అంశాల్లో సమస్యలు నెలకొన్నాయి. ధనిక, పేద దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తూ, అంతరాల్ని తగ్గించేలా- అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక చేయూతను అందించడానికి నిధులు కేటాయించే అంశాన్ని ఒప్పందంలో చేర్చారు. ఈ క్రమంలో తలెత్తే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ ఒప్పందం పేర్కొనే లక్ష్యాల సాధనకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేస్తేనే సాగర జీవవైవిధ్యాన్ని రక్షించడం సుసాధ్యం!


అంతర్జాతీయ జలాల్లో విచ్చలవిడి అన్వేషణ, విపరీతమైన చేపల వేట, సముద్ర గర్భ ఖనిజ తవ్వకాలు, చమురు, సహజ వాయువుల కోసం డ్రిల్లింగ్‌ వంటివి పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐరాస సభ్య దేశాల ఒప్పందం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది.


అంతర్జాతీయ జలాల్లో జరిపే సముద్ర గర్భ ఖనిజ తవ్వకాల వంటి కార్యకలాపాలతో సముద్ర జీవులు, ఆవరణ వ్యవస్థలపై దుష్ప్రభావం పడుతోంది. దాన్ని నిర్ధారించడానికి అవసరమైన మార్గదర్శకాలను ఈ ఒప్పందం రూపొందిస్తుంది. ఈ ఒప్పంద నియమాల అమలు, పర్యవేక్షణకు తగిన ఏర్పాటు ఉంటుంది.


వర్ధమాన దేశాలకు సాగర సాంకేతికత బదిలీ అయ్యి అంతర్జాతీయ జలాల పరిధిలో వనరుల పంపకం సమానంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన వ్యవస్థ ఈ ఒప్పందం వల్ల ఏర్పాటవుతుంది.


సముద్ర ఆవరణ వ్యవస్థల సంరక్షణకు, వాటి సుస్థిర యాజమాన్యానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ప్రస్తుత, రాబోయే తరాల కోసం ఆరోగ్యకరమైన పరిసరాలను అందించడానికి ఇది సాయపడుతుంది.


- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పక్కా ప్రణాళికతో... వరదా వరమే!

‣ సౌర విద్యుత్తుకు పెద్దపీట

‣ అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు

‣ ఎగుమతులకు చెల్లింపుల ఇక్కట్లు

‣ వైమానిక రవాణా.. అవకాశాల ఖజానా!

Posted Date: 24-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం