• facebook
  • whatsapp
  • telegram

న్యాయ దీపికలు.. నారీ అదాలత్‌లు!



సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, భారత గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ మహిళలపై గృహ హింస, లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. స్త్రీలకు వారి హక్కులు సైతం దక్కడం లేదు. ఈ దురవస్థను తొలగించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. నారీ అదాలత్‌ల పేరుతో మహిళా కోర్టుల ఏర్పాటుకు సిద్ధమైంది.


గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలపై గృహ హింస, లైంగిక వేధింపులు, ఆస్తి హక్కులు తదితరాలకు సంబంధించి ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల వేదికల ఏర్పాటుకు కేంద్రం సంకల్పించింది. అందులో భాగంగా మహిళలతో ప్రత్యేకంగా కోర్టులను కొలువుతీర్చాలని నిర్ణయించింది. వీటిని నారీ అదాలత్‌లుగా పిలుస్తారు. ఈ మేరకు అస్సాం, జమ్మూ కశ్మీర్‌లలో 50 గ్రామాల చొప్పున పైలట్‌ ప్రాజెక్టును వచ్చే ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఆ తరవాత వాటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. ప్రతి గ్రామంలో ఏర్పాటయ్యే నారీ అదాలత్‌లో ఏడు నుంచి తొమ్మిది మంది సభ్యులుంటారు. వీరిలో సగం మంది గ్రామ పంచాయతీకి ఎన్నికైనవారు ఉంటారు. వీరిని న్యాయసఖులుగా పిలుస్తారు. మిగిలిన సగం మంది ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. వీరిని గ్రామస్థులు నామినేట్‌ చేస్తారు. నారీ అదాలత్‌ అధ్యక్ష స్థానంలో ఉండే మహిళను ముఖ్య న్యాయసఖి అంటారు. న్యాయసఖుల్లో ఒకరిని ఈ స్థానానికి ఎంపిక చేస్తారు. ఈమె పదవీకాలం ఆరు నెలలు. భారత శిక్షాస్మృతిపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారి సారథ్యంలో నారీ అదాలత్‌లు పనిచేస్తాయి.


కొరవడిన అవగాహన 

కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాగే మిషన్‌ శక్తి ఉప పథకమైన సంబల్‌లో భాగంగా నారీ అదాలత్‌లను ఏర్పాటు చేయనున్నారు. పరివారిక్‌ మహిళా లోక్‌ అదాలత్‌ల స్ఫూర్తితో నారీ అదాలత్‌లను కేంద్రం ప్రారంభించనుంది. కుటుంబ, వైవాహిక వివాదాలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్‌ వీటిని 2014-15 దాకా నడిపింది. 1990ల్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా సమాఖ్య కార్యక్రమం నారీ అదాలత్‌ల భావనను తెరపైకి తెచ్చింది. 1988లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాలు అమలు చేశాయి. గృహ హింస, లైంగిక వేధింపులు అధికంగా నమోదయ్యే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గ్రామాల్లో వాటిని తగ్గించడంలో నారీ అదాలత్‌ కార్యక్రమం కీలకంగా నిలిచింది. జిల్లా, బ్లాక్‌ స్థాయుల్లో మహిళల్లో చైతన్యం నింపి వారి సాధికారతకు తోడ్పడింది. అప్పట్లో తొలుత ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటకల్లో పది జిల్లాల్లో నారీ అదాలత్‌లను ఏర్పాటు చేశారు. 2014 ఏప్రిల్‌ నాటికి 11 రాష్ట్రాల్లోని 126 జిల్లాల పరిధిలో సుమారు 42వేల గ్రామాల్లో ఇవి పనిచేస్తూ ఉండేవి. కేంద్ర ప్రభుత్వం వాటిని మళ్ళీ అమలులోకి తేవాలని నిర్ణయించింది. నారీ అదాలత్‌లకు ఎలాంటి చట్టపరమైన హోదా లేదు. అవి కుటుంబ వివాదాల్లో సయోధ్య కుదర్చడం, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం, మహిళలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి. అన్యాయం, హింసపై మహిళలు గళం వినిపించి, వాటి నుంచి బయటపడి గౌరవప్రదంగా జీవించడానికి నారీ అదాలత్‌లు తోడ్పడతాయంటున్నారు.


సామాజిక న్యాయంలో భాగంగా ప్రత్యామ్నాయ స్థానిక వివాద పరిష్కార వేదికలకు దేశీయంగా పెద్ద చరిత్రే ఉంది. ఈ క్రమంలోనే న్యాయ పంచాయతీలు, లోక్‌ అదాలత్‌లు, న్యాయ సేవల ప్రాధికార సంస్థ తదితరాలు అమలులోకి వచ్చాయి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలుగా నారీ అదాలత్‌ల ద్వారా మహిళలకు న్యాయ సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. న్యాయ సహాయం అన్నది దాతృత్వమో లేదా ఔదార్యమో కాదు. అది ప్రభుత్వాల కనీస బాధ్యత. పౌరుల హక్కు. అందరికీ సమాన న్యాయం అందించడం సర్కారు ప్రధాన విధి. బడుగు వర్గాలకు తమ చట్టపరమైన హక్కులపై కనీస అవగాహన లేకపోవడం భారత్‌లో ప్రధాన సమస్య. దీన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చట్టపరమైన అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. ప్రజలు పెద్ద సంఖ్యలో వాటిలో పాల్గొనేలా చూడాలి.  


చట్టబద్ధ హోదా కీలకం

అభివృద్ధి చెందిన దేశాలు రెండేళ్లు లేదా అయిదు సంవత్సరాల ప్రణాళికలతో తమ ప్రజలకు చట్టం, హక్కులపై అవగాహన కల్పిస్తున్నాయి. భారత్‌ సైతం అయిదేళ్ల ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. నారీ అదాలత్‌ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి, అవి సమర్థంగా కొనసాగేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. ప్రజల స్పందనకు అనుగుణంగా వాటిని పటిష్ఠంగా తీర్చిదిద్దాలి. చట్టబద్ధ అధికారాలు లేకపోతే నారీ అదాలత్‌లు తమ నిర్ణయాలను అమలు చేయడంలో, అవసరమైన వనరులను అందిపుచ్చుకోవడంలో సమస్యలు ఎదురుకావచ్చు. సమాజంలో తమపై నమ్మకాన్నీ అవి నిలుపుకోలేకపోవచ్చు. చట్టపరమైన హోదా కల్పించడం ద్వారా నారీ అదాలత్‌లు ప్రభుత్వ నిధులు, విరాళాలు అందుకోవడానికి అవకాశం లభిస్తుంది. అవగాహన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఈ నిధులు తప్పనిసరి. చట్టబద్ధ హోదా ద్వారా నారీ అదాలత్‌లు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొని, దీర్ఘకాలం పాటు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 


శిక్షణ అవసరం

దేశీయంగా చట్టాలను, న్యాయస్థానాల తీర్పులను సమర్థంగా అమలు చేయడంలో ఎనలేని అలక్ష్యం రాజ్యమేలుతోంది. ఈ క్రమంలో న్యాయ సహాయం అందించడానికి కొత్తగా నిబంధనలను రూపొందించే బదులు, ఇప్పటికే చేసిన చట్టాలను సమర్థంగా అమలు చేసేలా చూడాలి. వ్యాజ్యానికి ముందే ఆయా తగాదాలకు త్వరితగతిన ముగింపు పలకడానికి సరైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులను అమలులోకి తేవాల్సిన అవసరం ఉంది. వాటిలో న్యాయ విద్యార్థులకూ చోటు కల్పించడం వల్ల వివాదాలకు త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. న్యాయ సహాయ విధానంలో నాణ్యతను పెంచాలంటే, నిపుణులైన లాయర్లను నియమించి, వారికి శిక్షణ ఇవ్వాలి. న్యాయ సహాయం అందించడాన్ని వారు ఒక బాధ్యతగా పరిగణించేలా చూడాలి. స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పించాలి.
 

Posted Date: 26-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం