• facebook
  • whatsapp
  • telegram

ప్లాస్టిక్‌ కట్టడికి సమష్టి భాగస్వామ్యం


పర్యావరణం, జంతుజాలంపై ప్లాస్టిక్‌ కాలుష్యం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక వ్యవస్థకూ అది చేటు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో రెండొంతులు ఒకసారి వాడి పడేసేవే. దాంతో ప్లాస్టిక్‌ కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది.


గత యాభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాబోయే ఇరవై ఏళ్లలో అది రెట్టింపు అవుతుందని అంచనా. ప్లాస్టిక్‌ ఉత్పత్తిని నియంత్రించకపోతే 2060నాటికి ప్లాస్టిక్‌ కాలుష్యం ఇప్పుడున్నదానికి మూడింతలు పెరుగుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా ఏటా ప్లాస్టిక్‌ వాణిజ్యం లక్ష కోట్ల డాలర్లకు మించి ఎగబాకింది. అయితే అది, 60,000 కోట్ల డాలర్ల దాకా సామాజిక, ఆర్థిక నష్టానికి కారణమవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించాలంటే సర్క్యులర్‌ ఎకానమీ వైపు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగాన్ని తగ్గించడం, పునశ్శుద్ధి, పునర్వినియోగం అన్నవి సర్క్యులర్‌ ఎకానమీలో ప్రధాన అంశాలు. దీనివల్ల 2040 నాటికి 4.5 లక్షల కోట్ల డాలర్లకు పైగా ఆదా చేయవచ్చని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. అలాగే, 25శాతం కర్బన ఉద్గారాలను తగ్గించి, ఏడు లక్షల అదనపు ఉద్యోగాలనూ సృష్టించే అవకాశం ఉంది. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేకమందికి ఉపాధి కల్పించి, జీవన ప్రమాణాలను పెంచవచ్చు. అందుకే పర్యావరణ హితకరమైన, ఆర్థికంగా లాభదాయకమైన సర్క్యులర్‌ ఎకానమీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.


విచ్చలవిడి వాడకం

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వల్ల 2040 నాటికి కర్బన ఉద్గారాలు 19శాతానికి పెరగనున్నాయని అంచనా. అసమర్థ నిర్వహణ, మౌలిక సదుపాయాల కొరత వల్ల దేశీయంగా చెత్తను విచ్చలవిడిగా దహనం చేస్తున్నారు. అందులో ప్లాస్టిక్‌ అధికంగా ఉంటోంది. దాంతో వాయు కాలుష్యం అధికమై గుండె, శ్వాసకోశ వ్యాధులు ముమ్మరిస్తున్నాయి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో సింహభాగం ప్యాకేజింగ్‌ రంగానికి సంబంధించినవే. విశ్వవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో 36శాతాన్ని ప్యాకేజింగ్‌ కోసం వాడుతున్నారు. ఆహారం, శీతల పానీయాల కోసం వినియోగించే ప్లాస్టిక్‌ ఒక్కసారి వాడి పారేసేదే. ఇందులో సుమారు 85శాతాన్ని భూమిపై విచ్చలవిడిగా పడేయడంతో అవి ప్రమాదకర వ్యర్థాలుగా మారుతున్నాయి. అందుకే ప్యాకేజింగ్‌ రంగంలో నూతన ఆవిష్కరణలతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.


ఆట బొమ్మలు, ఎలెక్ట్రానిక్‌ వస్తువులు, వైద్య పరికరాలకు సంబంధించిన ప్లాస్టిక్‌ల వల్ల ఏటా 7,500 కోట్ల డాలర్ల పర్యావరణ నష్టం వాటిల్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్‌ వినియోగంలో పైపులు, రంగులు తదితర నిర్మాణ రంగంలో వినియోగించే వస్తువులు 35శాతం వాటాను ఆక్రమించాయి. అందుకే ఆయా రంగాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాల తగ్గింపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పటిష్ఠంగా అమలు చేయాలి. వ్యవసాయం, సాగునీటి రంగాల్లోనూ ప్రస్తుతం ప్లాస్టిక్‌ వాడకం పెరిగింది. సముద్రాల్లో పోగుపడే ప్లాస్టిక్‌లో 20శాతం చేపలు పట్టడం, షిప్పింగ్‌, వినోద కార్యకలాపాల వల్ల వచ్చి చేరుతోంది. ఒక్క చేపల పరిశ్రమ వల్లే ఏటా 4.5 కోట్ల కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్త్రాల పరిశ్రమ బాగా విస్తరించింది. ఇటీవలి కాలంలో ఆయా రకాల దుస్తుల తయారీలోనూ ప్లాస్టిక్‌ను అధికంగా వాడుతున్నారు. ఆ దుస్తులను ఉతికినప్పుడు, పాడైన తరవాత చిన్న ప్లాస్టిక్‌ రేణువులు వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పర్యాటక రంగం ద్వారానూ పెద్దయెత్తున ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతూ, కాలుష్యం కోరలు చాస్తోంది. ఏటా తీరప్రాంత పర్యాటకుల వల్ల 80 లక్షల టన్నుల వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయి. ఇలా తీవ్రమవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ కోసం ప్రభుత్వాలు బహుముఖ చర్యలు చేపట్టాలి.


పటిష్ఠ చర్యలు

ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ పునర్వినియోగంపై దృష్టి సారిస్తున్నా, అది ఆశించిన మేర ఉండటంలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భూమిలో త్వరగా కుళ్ళిపోయే నూతన ఆవిష్కరణలను వేగవంతం చేయాలి. ఆధునిక సాంకేతికత సాయంతో వ్యర్థాల నుంచి వస్తువులను ఉత్పత్తి చేసి, పునర్వినియోగించాలి. వాటిని బహిరంగ మార్కెట్లో సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వాలు రాయితీలు కల్పించాలి. ప్లాస్టిక్‌ నిషేధం పకడ్బందీగా అమలయ్యేలా పాలకులు సరైన చర్యలు చేపట్టాలి. అందుకు తగిన వ్యవస్థాగత మార్పులు అవసరం. ప్లాస్టిక్‌ నియంత్రణలో ప్రభుత్వాల చర్యలకు తోడు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం, చొరవ అత్యంత కీలకం. మదుపరులు, పరిశ్రమల యాజమాన్యాలూ ఈ విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్‌ అన్నది నేడు ప్రపంచ సమస్య. అందువల్ల దేశాల మధ్య చిత్తశుద్ధితో కూడిన సహకారమూ తప్పనిసరి.


- ఎ.శ్యామ్‌కుమార్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పక్కా ప్రణాళికతో... వరదా వరమే!

‣ సౌర విద్యుత్తుకు పెద్దపీట

‣ అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు

‣ ఎగుమతులకు చెల్లింపుల ఇక్కట్లు

‣ వైమానిక రవాణా.. అవకాశాల ఖజానా!

Posted Date: 24-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం