• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ - శ్రీలంక మైత్రిలో నూతన ఒరవడి



సంక్షుభిత పరిస్థితుల్లో శ్రీలంక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రణిల్‌ విక్రమసింఘే ఇటీవల భారత్‌లో పర్యటించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రితోపాటు వివిధ శాఖల మంత్రులతో సమావేశమయ్యారు. పర్యాటకం, విద్యుత్తు, వాణిజ్యం, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిలో పరస్పర సహకారాన్ని వేగవంతం చేయాలని అభిలషించారు. 


వాణిజ్య, సైనిక కార్యకలాపాలకు వ్యూహాత్మక స్థానమైన హిందూ మహాసముద్రంలో శ్రీలంక పాత్ర కీలకం. సాంస్కృతికంగా, మతపరంగా, భాషాపరంగా భారత్‌, శ్రీలంకల మధ్య వేల సంవత్సరాల అనుబంధం ఉంది. గతేడాది శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం తదితర పరిణామాల్లో భారత్‌ అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఆహార పదార్థాలు, వస్తుసామగ్రి, చమురును అందించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ప్యాకేజీ పొందడానికి అవసరమైన సహాయం చేసింది. దీనిపై శ్రీలంక నాయకత్వం, ప్రజలు, అక్కడి మీడియా నుంచి హర్షం వ్యక్తమైంది. కొవిడ్‌ మహమ్మారితోపాటు, తదనంతర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంకకు బలమైన మద్దతు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు తాజా పర్యటనలో సింఘే కృతజ్ఞతలు తెలిపారు. గతంలో శ్రీలంకకు అధ్యక్షుడిగా ఉన్న రాజపక్సే చైనా అనుకూల ధోరణి అవలంబించే ఎత్తుగడలకు పాల్పడ్డారు. విక్రమసింఘే అధికారంలోకి వచ్చాక భారత్‌, చైనాలతో సత్సంబంధాలు నెరపుతూ మధ్యేమార్గాన్ని అవలంబిస్తున్నారు. ఈ విషయంలో కొలంబో నుంచి దిల్లీ మరింత మెరుగైన సహకారాన్ని ఆశిస్తుందనడంలో సందేహం లేదు.


శ్రీలంకలో భారత కరెన్సీ చలామణీని త్వరలోనే ఆమోదిస్తామని కొన్నాళ్ల క్రితమే విక్రమసింఘే స్పష్టం చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని పెంపొందించేందుకు దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా పర్యటనలో జరిగిన ఒప్పందం మేరకు రాబోయే రెండు, మూడు నెలల్లో శ్రీలంకలో యూపీఐ చెల్లింపులకు ఆమోదం లభిస్తుంది. ప్రధాని మోదీ, విక్రమసింఘే సమక్షంలో రెండు దేశాల ప్రతినిధులు అయిదు ద్వైపాక్షిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై అంగీకారం కుదిరింది. ఇరు దేశాల మధ్య తరచూ తలెత్తే మత్స్యకారుల సమస్యపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, సింఘేల మధ్య చర్చ జరిగింది. ఇరుదేశాల్లో విద్యుత్‌ గ్రిడ్‌లను అనుసంధానించడానికి, పెట్రోలియం పైప్‌లైన్‌ నిర్మాణానికి- రెండు దేశాలను రోడ్డు మార్గంతో కలిపేలా వంతెన నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు ఇరువర్గాలు తెలిపాయి.  శ్రీలంక ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా భారత్‌, చైనా కీలకపాత్ర పోషిస్తున్నాయి. లంక విదేశీ వాణిజ్యంలో సింహభాగం భారత్‌దే. ఇండియా, లంక సమీకృత ఇంధన గ్రిడ్‌ సహా సంయుక్త అవకాశాల కోసం అన్వేషిస్తున్నాయి. తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని ట్రింకోమలి, కొలంబోలను కలుపుతూ సముద్రగర్భ చమురు పంపిణీ పైప్‌లైన్‌ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించనున్నట్లు ఆ దేశ ఇంధనశాఖ మంత్రి తెలిపారు.


ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి¨ భౌగోళిక బంధాల బలాన్ని పెంచుకోవడానికి తన భారత పర్యటన అవకాశం కల్పిస్తుందని విక్రమసింఘే ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్‌ అనుసరిస్తున్న పొరుగుకే తొలి ప్రాధాన్యం, సాగర్‌ విజన్‌ విధానాల్లో శ్రీలంక ముందుందని, రెండు దేశాల రక్షణ ప్రయోజనాలు, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయని, ఇరుపక్షాలూ కలిసి పని చెయ్యాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రోద్బలంతో గతంలో శ్రీలంక రాజ్యాంగంలో చేరిన 13వ సవరణ అమలుపై మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది లంకలోని తమిళులకు సంబంధించినది. శ్రీలంకలోని అన్ని ప్రాంతాలు, అక్కడి సమాజంలో అన్ని వర్గాల సమాన, సుస్థిర అభివృద్ధికి భారత్‌ మద్దతు ఉంటుందని చెప్పడం ద్వారా మోదీ శ్రీలంక తమిళ ప్రజలకు సైతం భరోసా ఇచ్చినట్లయింది. హిందూ మహాసముద్రంలో భారత్‌ స్థానాన్ని పటిష్ఠం చేసుకునే ప్రణాళికలకు శ్రీలంకలో పెరుగుతున్న చైనా ఉనికి సవాలుగా మారుతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో సంబంధాల్లో సుహృద్భావ పరిస్థితులు కొనసాగాలని భారత్‌ ఆశిస్తోంది. ఈ విషయంలో గతంలో రాజపక్సే సృష్టించిన అడ్డంకులను సింఘే తొలగించగలరని మనదేశం విశ్వసిస్తోంది.


- జి.శ్రీనివాసు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!

‣ న్యాయ దీపికలు.. నారీ అదాలత్‌లు!

‣ ప్లాస్టిక్‌ కట్టడికి సమష్టి భాగస్వామ్యం

‣ అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్యం

‣ పక్కా ప్రణాళికతో... వరదా వరమే!

Posted Date: 31-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం