• facebook
  • whatsapp
  • telegram

ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత


విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటికి అవసరమైన ప్రాణవాయువు, ఆహారం, నీరు అందిస్తుంది. సకల జీవరాశిలో మనుషుల వాటా అత్యల్పం. కానీ, ప్రకృతికి మనిషి చేసే హాని అత్యంత అధికం. తల్లితో సమానమైన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ధరణీపుత్రులదే! ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా..


పారిశ్రామిక విప్లవం తరవాత నూతన సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వాటిని ఉపయోగిస్తున్నాం. దీనివల్ల హానికర కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఫలితంగా వాతావరణ కాలుష్యం, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు పర్వతాలు కరిగి సముద్ర నీటిమట్టం అధికమవుతోంది. భూభాగం తగ్గుతోంది. అనేక జీవరాశులు అంతరిస్తున్నాయి. ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. ఫ్రిజ్‌లు, ఏసీల వాడకం పెరగడంతో క్లోరోఫ్లోరో కర్బనాలు విడుదలై ఓజోన్‌ రక్షణ పొర దెబ్బతింటోంది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు అడవుల నరికివేత, విచ్చలవిడి ప్లాస్టిక్‌ వినియోగం పెచ్చరిల్లుతున్నాయి. పారిశ్రామిక రసాయనాలు, పలురకాల వ్యర్థాలతో నదులు కలుషితం అవుతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. తుపానులు, సునామీలు, కరవు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. మానవాళిని కరోనా లాంటి సరికొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.


పునరుద్ధరణీయ ఇంధనాల పెంపు

జనాభా పెరుగుతున్న కొద్దీ వివిధ యంత్రాలు, వాహనాల వినియోగం పెరుగుతోంది. శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువుల వాడకం అధికమవుతోంది. భూగర్భంలో వీటి తయారీకంటే వినియోగం అత్యధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు సహజ వనరుల కొరత ఏర్పడవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన శక్తి తదితరాల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచాలి. భారతదేశం 2030 కల్లా 50 శాతం విద్యుత్తు ఉత్పత్తిని పునరుద్ధరణీయ ఇంధన వనరులతోనే సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 2070 నాటికి నెట్‌జీరో స్థితికి చేరుకోవాలని ఆశిస్తోంది. దేశంలో ప్రస్తుతం ప్రతి వెయ్యి మందికి 225 వాహనాలు ఉండగా, జనాభాకంటే వాహనాల పెరుగుదల రేటు అధికంగా ఉందని ‘పర్యావరణ రక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ)’ తేల్చింది. రవాణా రంగంలో తీవ్రస్థాయిలో డీజిల్‌ పెట్రోల్‌ వాడకం జరుగుతోంది. దీనివల్ల వాయు కాలుష్యం జోరెత్తడమే కాదు- భారీయెత్తున విదేశమారక ద్రవ్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇది దేశీయ ఇంధన భద్రతకు సవాలుగా మారుతోంది. అత్యంత కాలుష్యభరిత నగరాలు మన దేశంలోనే అధికంగా ఉండటం ఆందోళనకరం. ఇలాంటి సమస్యల్ని అధిగమించాలంటే వాహనాలకు విద్యుత్తు, హైడ్రోజన్‌ లాంటి ఇంధనాల వినియోగం పెరగాలి. ప్రారంభ కొనుగోలు ధర అధికంగా ఉండటం, తగినన్ని ఛార్జింగ్‌ కేంద్రాలు లేకపోవడంతో విద్యుత్తు వాహనాలకు ఆశించినమేర ఆదరణ దక్కడం లేదు. ప్రభుత్వాలపరంగా మరింత ప్రోత్సాహం అందిస్తే, ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుంది. మెట్రో రైలు లాంటి ప్రజారవాణా వ్యవస్థలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించుకొని వీలైనంతమేర బస్సు, రైలు వంటి ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల వాడకాన్ని తగ్గించాలి. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా విద్యుత్తు ఉత్పత్తి లాంటి ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వృక్షాలు వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను సహజంగా గ్రహించి, ప్రాణవాయువును విడుదల చేస్తాయి. వాతావరణ సమతుల్యత సాధించాలంటే ఏ దేశంలోనైనా అడవుల విస్తీర్ణం కనీసం మూడోవంతు ఉండాలి. జనాభా పెరుగుదలకు తోడు, పోడు తరహా వ్యవసాయ విస్తీర్ణం పెరగడం, కలప, వంట చెరకు కోసం అడవులపై ఆధారపడటం, పరిశ్రమలు, గృహాల సంఖ్య పెరగడంతో అడవుల నరికివేత మొదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల పెంపకానికి అనేక చర్యలు తీసుకుంటున్నా, పురోగతి ఆశించిన స్థాయిలో లేదు. వృక్షాల నరికివేతకు అడ్డుకట్ట వేసి, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెంచాలనే బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు లెక్కల ప్రకారం దేశంలో రోజుకు సుమారు 30 వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అవి జల వనరులను, నదులను, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రాల్లో చేపలకంటే ప్లాస్టిక్‌ అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్‌పై పరిమితులు, నిషేధాలున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. వాడి పారేసే ప్లాస్టిక్‌ను సేకరించి కొత్త ఉత్పత్తులు సృష్టించే దిశగా అడుగులు పడాలి. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో ఆహార కల్తీ పెరుగుతోంది.


ఉద్గారాల నియంత్రణ

గృహాల్లో అత్యంత సామర్థ్యం కలిగిన, నాణ్యమైన ఉపకరణాలనే ఎంచుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. గ్యాస్‌ వృథాను తగ్గించాలి. ఇతరత్రా ఉపకరణాల వినియోగానికి పునరుత్పాదక వనరులతో ఇంధనాన్ని సమకూర్చుకోవాలి. ఇలాంటివాటిని కర్బన తటస్థ భవనాలుగా పరిగణిస్తారు. కాలుష్య నివారణలో అత్యధిక ఇంధన సామర్థ్యంగల పరికరాల వాడకం, పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని పెంచడం కీలకం. అడవుల పెంపకం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించడమూ ముఖ్యమే. వివిధ వస్తువుల తయారీ, వినియోగంలో తలెత్తే వృథాను సమర్థంగా పునర్వినియోగించడం, వృథాను తగ్గించడం, కొత్త ఉత్పత్తులు తయారు చేయడం లాంటి చర్యలతోనూ వాతావరణ కాలుష్యాన్ని నిరోధించవచ్చు. భూతాపం పెరగకుండా నివారించవచ్చు. ప్రకృతిని పరిరక్షించడం అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడమే. ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టే ప్రతిచర్య దేశ ప్రయోజనాలకు తోడ్పడుతుందని గుర్తించాలి. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, కర్బన ఉద్గారాల నియంత్రణ విధానాలను కచ్చితంగా ప్రకటించేలా చూడాలి. కర్బన ఉద్గారాల శూన్య స్థితి (నెట్‌ జీరో) సాధిస్తామన్న హామీలకు దేశాలన్నీ కట్టుబడాలి. జీ20 సదస్సుకు ఆతిథ్యమిస్తూ, ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌- దృఢసంకల్పంతో కర్బన ఉద్గారాలను నిలువరించి అందరికీ ఆదర్శంగా నిలవాలి.


మురుగుశుద్ధిలో చిత్తశుద్ధి

పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ నీటి కాలుష్యం అధికమవుతోంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి విడుదలయ్యే మురుగునీటిలో కేవలం నాలుగోవంతు మాత్రమే శుద్ధి జరుగుతోంది. మిగతాది జలాశయాల్లోకి చేరి, కాలుష్యానికి కారణమవుతోంది. మురుగు నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయగలిగితే జల కాలుష్యాన్ని చాలామేర నివారించవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హరిత భాగ్యానికి విత్తనబంతి

‣ హక్కులు దక్కని గిరిజన పల్లెలు

‣ భారత్‌ - శ్రీలంక మైత్రిలో నూతన ఒరవడి

‣ మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని