• facebook
  • whatsapp
  • telegram

హరిత భాగ్యానికి విత్తనబంతి


అభివృద్ధి పేరుతో సాగుతున్న చర్యలు, మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల పచ్చదనం క్రమంగా తరిగిపోతోంది. దాంతో పర్యావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మొక్కలను విస్తృతంగా పెంచేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అందుకోసం విత్తన బంతులను వినియోగిస్తున్నాయి.


పచ్చదనం నానాటికీ తరిగిపోతున్నందు వల్ల కాలుష్యం తీవ్రమవుతోంది. వాతావరణ మార్పులతో ఠారెత్తించే ఎండలు, కుండపోత వానలు, వణికించే చలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాయి. ఇలా నాటిన మొక్కలను సంరక్షించడానికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పశువులు, ఇతర కారణాల వల్ల చాలా మొక్కలు సరిగ్గా ఎదగడం లేదు. కొండ, కోనల ప్రాంతాల్లో మొక్కలు నాటడమూ కష్టతరం. అయితే, విత్తన బంతులను రూపొందించి తొలకరి ప్రారంభంలో ఆయా ప్రాంతాల్లో వెదజల్లడం వల్ల తక్కువ ఖర్చుతోనే పచ్చదనాన్ని పెంచవచ్చు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో స్థానిక పాలక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దయెత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్ని చోట్ల డ్రోన్ల సాయంతో వాటిని వెదజల్లుతున్నారు.


విస్తృతంగా తయారీ

తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటేందుకు హరితహారం కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా అటవీ శాఖ వనాల ప్రాంతాల్లో డ్రోన్లతో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమం చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి గ్రామశివారులో రాష్ట్రంలోనే తొలిసారిగా 2020లో మారుత్‌ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో 15 వేల విత్తన బంతులను చల్లి రికార్డు సృష్టించారు. ప్రతి విత్తన బంతి కిందపడిన ప్రాంతాన్ని డ్రోన్‌ సాయంతో జియోట్యాగింగ్‌ చేస్తారు. దాని ఆధారంగా వర్షాకాలంలో ఎన్ని మొక్కలు మొలకెత్తాయో తెలుసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లాలో అయిదేళ్ల క్రితం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏకంగా    2.30 కోట్ల విత్తన బంతులు వెదజల్లారు. వాటిలో చాలా వరకు ప్రస్తుతం వృక్షాలుగా మారాయి. ఈ విషయాన్ని ‘ట్రాక్‌’ అనే సంస్థ ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ధ్రువీకరించింది. కర్ణాటకలో చిట్టడవులను పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా విత్తన బంతుల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పలు చోట్ల విత్తన బంతుల కార్యక్రమం కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు- పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులతో పెద్దమొత్తంలో వాటిని తయారు చేయిస్తున్నాయి. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో కొన్ని చోట్ల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు క్రమంగా అంతరిస్తున్నాయి. వాటి సంఖ్యను పెంచేందుకు స్థానిక గ్రామీణులు విత్తన బంతులను సరైన మార్గంగా ఎంచుకుంటున్నారు.


ప్రభుత్వ, బంజరు భూములు, గుట్టలు, కొండల ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లవచ్చు. విత్తనబంతి తయారీకి ప్రధానంగా ఎర్ర, బంక మట్టి మిశ్రమం అవసరం. జామ, నేరేడు, సీతాఫలం తదితర పండ్ల చెట్లు, నీడనిచ్చే రావి, మర్రి వంటి ఇతర వృక్షాల విత్తులను విత్తన బంతుల లోపల ఉంచి ఆయా ప్రదేశాల్లో వెదజల్లుతారు. వర్షం పడినప్పుడు విత్తన బంతి సులువుగా నేలలో కరిగిపోయి దానిలోని విత్తనం మొలకెత్తుతుంది. విత్తన బంతులు సేంద్రియ విధానంలోనే తయారవుతాయి. మొక్కలు నాటడం కంటే ఇలా బంతుల రూపంలో వెదజల్లడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని వృక్ష నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నాటే మొక్కల కంటే ఈ బంతుల్లోని విత్తనాలు సహజంగా, బలంగా వేళ్లూనుకుంటాయని వారు విశ్లేషిస్తున్నారు.


అవగాహన కల్పించాలి

ఏ దేశమైనా క్షేమంగా ఉండాలంటే అక్కడి భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33శాతం మేర అరణ్యాలు విస్తరించి ఉండాలి. మన జాతీయ అటవీ విధానం సైతం ఇదే విషయాన్ని స్పష్టీకరిస్తోంది. అయితే, దేశీయంగా ప్రస్తుతం దాదాపు 25శాతం విస్తీర్ణంలోనే వనాలు నెలకొన్నాయి. దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. వనాలు తరిగిపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో కోతులు జనావాసాల్లోకి వచ్చి తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. మొక్కజొన్న, కూరగాయల పంటలను సైతం అవి నాశనం చేస్తున్నాయి. ఈ సమస్యను నివారించాలంటే కొండ కోన ప్రాంతాల్లో విత్తన బంతుల ద్వారా విస్తృతంగా పండ్ల చెట్లను పెంచాలి. దానివల్ల మర్కటాలు తిరిగి వనాల్లోకి వెళ్ళిపోతాయి. అరణ్యాల ఆవశ్యకత, విత్తన బంతుల ప్రాధాన్యంపై ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. స్థానిక సంస్థల సాయంతో పాఠశాల యాజమాన్యాలు పెద్దయెత్తున వాటి తయారీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ బంతులను సమీపంలోని బంజరు భూములు, కొండ కోనల్లో వెదజల్లితే పచ్చదనం పరిఢవిల్లి మానవాళికి     కొద్దిమేరకైనా రక్షాకవచంగా నిలుస్తుంది.


- మిరియాల గణేష్‌ కుమార్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హక్కులు దక్కని గిరిజన పల్లెలు

‣ భారత్‌ - శ్రీలంక మైత్రిలో నూతన ఒరవడి

‣ మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!

‣ న్యాయ దీపికలు.. నారీ అదాలత్‌లు!

‣ ప్లాస్టిక్‌ కట్టడికి సమష్టి భాగస్వామ్యం

‣ అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్యం

‣ పక్కా ప్రణాళికతో... వరదా వరమే!

Posted Date: 11-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం