• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ - ఫ్రాన్స్‌ చెట్టపట్టాల్‌ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవమైన బాస్టిల్‌ డే (జులై 14) వేడుకల్లో గౌరవ అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొన్నేళ్లుగా ఆయా రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్య బంధం బలపడింది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు ఇరు దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. 


ఫ్రాన్స్‌లో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య బంధం ప్రాధాన్యాన్ని మరోసారి తెలియజెప్పింది. రెండున్నర దశాబ్దాలుగా భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య సహకార మైత్రి కొత్త పుంతలు తొక్కుతోంది. రక్షణ, అంతరిక్ష రంగాల్లో, పౌర ప్రయోజనాలకు అణుశక్తి వినియోగంపై 1998లోనే రెండు దేశాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఆ తరవాత సముద్రాల్లో భద్రతాపరమైన సహకార వృద్ధిపై ముందడుగు పడింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి పోటీగా వ్యూహపరమైన పొత్తుతో ముందుకు సాగాలని భారత్‌, ఫ్రాన్స్‌లు నిశ్చయించాయి. నౌకాదళాల మధ్య సహకార వృద్ధి, భారత్‌లో జలాంతర్గాముల నిర్మాణం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఇతర దేశాలతో వ్యూహపరమైన భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా దిల్లీ-పారిస్‌లు పురోగమిస్తున్నాయి.


సమాచార మార్పిడి

భారత్‌, ఫ్రాన్స్‌లు 2015లో సాగర మైత్రి పటిష్ఠతకు సంప్రతింపులు ప్రారంభించాయి. సముద్రాల్లో నౌకల సంచారం గురించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి 2017లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఇతర దేశాల నౌకల రాకపోకలపై నిఘా పెడుతున్నారు. రహస్య సమాచార మార్పిడికి 2018 మార్చిలో మరొక ఒప్పందం కుదుర్చుకున్నారు. సముద్ర దొంగల ఆట కట్టించడానికి, సాగరాల్లో ఉగ్రవాదుల సంచారాన్ని అడ్డుకోవడానికి ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఉపగ్రహాల సాయంతో ఇండో-పసిఫిక్‌ జలాల్లో నౌకల కదలికలపై నిఘా వేయడానికి భారత్‌, ఫ్రాన్స్‌ అంతరిక్ష పరిశోధన సంస్థల మధ్య 2019లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. 2047 వరకు ద్వైపాక్షిక సహకార వృద్ధికి మార్గదర్శక ప్రణాళికను రూపొందించుకోవాలని ఇటీవల మరో ఒప్పందం చేసుకున్నారు.


ఫ్రాన్స్‌కు చెందిన స్కార్పీన్‌ జలాంతర్గాములను భారత్‌లోని మఝ్‌గావ్‌ డాక్స్‌లో మేకిన్‌ ఇండియా పథకం కింద తయారుచేయడానికి గతంలో కుదిరిన ఒప్పందం విజయవంతంగా పూర్తయింది. అదనంగా మూడు జలాంతర్గాముల నిర్మాణానికి ఈ నెలలో మరో ఒప్పందం కుదిరింది. ఒక ఏడాది హిందూ మహాసముద్రం, తరవాతి సంవత్సరం మధ్యధరా సముద్రంలో 1993 నుంచి భారత్‌, ఫ్రాన్స్‌ నౌకాదళాలు సంయుక్త విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. 2001లో వీటికి ‘వరుణ’ అని నామకరణం చేశారు. 21వ వరుణ విన్యాసాలను ఈ ఏడాది జనవరిలో గోవా తీరంలో నిర్వహించారు. 2022 జులైలో భారత్‌, ఫ్రాన్స్‌ నౌకాదళాలు అట్లాంటిక్‌ మహాసముద్ర ఉత్తర భాగంలోనూ సంయుక్త విన్యాసాలు జరిపాయి. వాటిని సముద్ర భాగస్వామ్య అభ్యాసాలు (ఎంపీఎక్స్‌)గా వర్ణించారు. ఈ ఏడాది జూన్‌లో ఒమన్‌ సింధుశాఖలో భారత్‌, ఫ్రాన్స్‌, యూఏఈ నౌకదళాలు సంయుక్త ఎంపీఎక్స్‌ విన్యాసాలు నిర్వహించాయి. ఈ మూడు దేశాలు ఈ అభ్యాసాలు జరపడం ఇదే తొలిసారి. యూఏఈతోపాటు ఆస్ట్రేలియా, గ్రీస్‌, ఈజిప్ట్‌ దేశాలతోనూ సాగర భాగస్వామ్యాన్ని భారత్‌, ఫ్రాన్స్‌లు వృద్ధి చేసుకుంటున్నాయి. హిందూ మహా సముద్రంలో సమాచార మార్పిడి ద్వారా ద్వైపాక్షిక భద్రతా సమన్వయానికి అవి నడుం కట్టాయి. యూఏఈ, సింగపూర్‌, మడగాస్కర్‌, సీషెల్స్‌ దేశాలు సైతం భారత్‌, ఫ్రాన్స్‌లతో ఈ విషయంలో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.


భద్రతపై ఆందోళన

హిందూ మహాసముద్రం, దక్షిణాసియా, దక్షిణ పసిఫిక్‌, ఆఫ్రికాలలో చైనా ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా పట్టు పెంచుకోవడం భారత్‌, ఫ్రాన్స్‌లకు ఆందోళన కలిగిస్తోంది. హిందూ, పసిఫిక్‌ మహా సముద్రాలలో (ఇండో పసిఫిక్‌) రీయూనియన్‌, క్లిపర్టన్‌ దీవులు, ఇతర ప్రాంతాలు, అంటార్కిటికాలలో ఫ్రాన్స్‌కు సైనిక, పరిశోధన స్థావరాలున్నాయి. రీయూనియన్‌ దీవిలోని ఫ్రెంచి నౌకాదళంతో కలిసి భారత్‌ సాగర రవాణాపై నిఘా వేస్తోంది. పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ రేవులో చైనా కార్యకలాపాలపై నిఘా వేయడానికి ఫ్రాన్స్‌ సహకారం ఎంతో ఉపకరిస్తుంది. చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు, భారత్‌-చైనా సరిహద్దు సంఘర్షణలు, చైనా-అమెరికా వైరం, తైవాన్‌ సంక్షోభం ఇండో-పసిఫిక్‌లో భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సాగర చట్టాల ఒప్పందాన్ని సైతం చైనా ఉల్లంఘిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌, ఫ్రాన్స్‌లు చేయీచేయీ కలపడం సాగర శాంతికి ఎంతగానో దోహదపడుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత

‣ హరిత భాగ్యానికి విత్తనబంతి

‣ హక్కులు దక్కని గిరిజన పల్లెలు

‣ భారత్‌ - శ్రీలంక మైత్రిలో నూతన ఒరవడి

‣ మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని