• facebook
  • whatsapp
  • telegram

పులులే అడవులకు రక్షఅంతర్జాతీయ పులుల దినోత్సవం. ఒకప్పుడు తూర్పు, దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతమంతటా పులులు వ్యాపించి ఉండేవి. ఇప్పుడవి పదమూడు దేశాలకే పరిమితమయ్యాయి. పులులు మనుగడ సాగించే అడవులు జీవవైవిధ్యానికి నెలవులు. ఈ అడవుల భద్రత ఎంతోమంది రైతుల సంక్షేమంతో, ప్రజల ఆహార భద్రతతో ముడివడి ఉంటుంది. పులుల్ని కాపాడుకుంటే, అడవుల్ని సంరక్షించుకున్నట్లే.


అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ 1986లో పెద్దపులిని మనుగడ ప్రమాదంలో పడిన జాతిగా ప్రకటించింది. వీటి సంఖ్య తగ్గడంతో రెడ్‌లిస్ట్‌లో చేర్చింది. ఒకప్పుడు పెద్దపులికి ఆవాసంగా ఉన్న భూభాగంలో 95 శాతందాకా తగ్గిపోయింది. ప్రపంచంలోని వ్యాఘ్రాల్లో 75 శాతందాకా భారత్‌లో ఉన్నాయి. 2022 గణాంకాల ప్రకారం, దేశంలో కనీసం 3,167 పులులు ఉన్నాయి. పులుల సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్టు టైగర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరవాతి కాలంలో  దేశవ్యాప్తంగా ఏర్పాటైన టైగర్‌ రిజర్వులు పులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. ప్రాజెక్టు టైగర్‌ కార్యక్రమ స్వర్ణోత్సవం సందర్భంగా- పులులున్న దేశాలతో కూడిన అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి భేటీని గత ఏప్రిల్‌లో భారత్‌ మైసూరులో నిర్వహించింది.


టైగర్‌ రిజర్వులే నెలవులు

వ్యవసాయ వంగడాలకు మూలమైన మొక్కలకు, పర్యాటకానికి, ఉపాధి కల్పనకు, చేపల లభ్యతకు, పశుగ్రాసానికి, కలపకు, జిగురుకు, తునికి ఆకు తదితర ఎన్నో కలపేతర అటవీ ఉత్పత్తులకు, కర్బన శోషణకు, నిల్వకు, నీటి లభ్యతకు, నీటి వడపోతకు, మృత్తిక సంరక్షణకు, పోషక చక్రానికి పులులు ఉండే అడవులే ఆధారం. తుపానులు, వరదల వంటి ప్రకృతి విపత్తులను కూడా అడవులు నియంత్రిస్తాయి. అడవులు నశించి పంట పొలాలు పెరగడం, రోడ్లు, జలాశయాలు, గనులు, వ్యవసాయం, జల విద్యుత్తు కేంద్రాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు పులుల ఆవాసాల్ని దెబ్బతీస్తున్నాయి. పులుల వేటతోపాటు వాటికి ఆహారమయ్యే జంతువుల వేట... వ్యాఘ్ర జాతి అంతరించే ప్రమాదం అంచుకు చేరడానికి కారణమవుతోంది. మూఢనమ్మకాలతో పులిచర్మం, శరీర భాగాలు, గోళ్లు, దంతాలు, వెంట్రుకలు, మాంసం వంటివాటికి జాతీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. కొన్ని దేశాల్లో మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. పులుల వధకు ఇవన్నీ కారణమవుతున్నాయి. పులి ప్రధాన ఆహారమైన దుప్పులు, జింకల వేటతో ఆసియా దేశాల్లో వ్యాఘ్రాల సంఖ్య గణనీయంగా క్షీణించినట్లు తెలుస్తోంది.  


దేశంలోని ఎన్నో జాతీయ పార్కులు, టైగర్‌ రిజర్వులు, కార్బెట్‌, కాన్హ, తాడోబా, ముదుమలై, బందీపూర్‌, రణథంబోరు వంటి జాతీయ పార్కులున్నాయి. ఇవి పులి ప్రధాన ఆకర్షణగా ఉపాధిని కల్పిస్తూ, ఆదాయాన్ని అందిస్తూ హరిత పర్యాటకానికి ఊతమిస్తున్నాయి. తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ప్రాంతం అడవులు, ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌- పులులకు నెలవులుగా పేరొందాయి. మహారాష్ట్రలోని తడోబా, తిపేశ్వర్‌ తదితర రక్షిత ప్రదేశాల నుంచి పులుల వలస కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో వాటి సంఖ్య పెరుగుతోంది. పులులు గతంలో విస్తరించి, సంచరించిన ప్రాంతాల్లోకి తిరిగిరావడం, స్థిరపడటం, సంతానాన్ని వృద్ధి చేయడం వంటివి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో మెరుగుదలగా భావించవచ్చు. తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో పులుల సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలను, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులోపలి భాగంలోని గ్రామాలను, పులుల కోసం వెలుపలికి తరలించడాన్ని ఇటీవల ఆయా టైగర్‌ రిజర్వ్‌లను సందర్శించిన కేంద్ర బృందం ప్రశంసించింది. ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పులుల జనాభా తిరిగి కోలుకోవడానికి తీవ్రస్థాయి సంరక్షణ చర్యలు అవసరమని ‘పెద్దపులుల స్థితిగతుల నివేదిక-2022’ పేర్కొంది. రహదారులు వంటి మౌలిక సౌకర్యాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్‌ రిజర్వు తూర్పు, పడమర ప్రదేశాల మధ్యనుండే నడవాలో క్షీణించిందని నివేదిక వెల్లడించింది.


నడవాల పునరుద్ధరణ

పులుల సంరక్షణకు వాటి ఆవాసాలను కలిపే నడవాలను పునరుద్ధరించాలి. తద్వారా సమూహాల మధ్య సంపర్కం తదితర చర్యలు చోటుచేసుకొని పులి జాతి మరింత శక్తిమంతమవుతుంది. పులి వేటను, దాని ఆహార జంతువుల వధను నిరోధించాలి. వాటి జనాభాను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. పులుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి. దీనికి తగిన సంఖ్యలో సుశిక్షితులైన సిబ్బంది, వాహనాలు, అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించాలి. దురదృష్టవశాత్తు పశువులుగాని, మనుషులుగాని పులి లేదా ఇతర వన్యప్రాణి దాడిలో గాయపడినా, మరణించినా నష్టపరిహారం చెల్లించాలి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పులుల సంరక్షణ చర్యలను కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకూడదు. అన్ని టైగర్‌ రిజర్వులతోపాటు వాటి బయటి అటవీ ప్రాంతాలు, ఒకప్పుడు పులులు సంచరించిన ప్రాంతాల్లోనూ సంరక్షణ చర్యలు చేపట్టాలి. కొత్త టైగర్‌ రిజర్వులు నెలకొల్పాలి.ప్రజాబాహుళ్యంలో పర్యావరణంపై అవగాహన పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలకు ఉన్నతస్థాయిలో తగిన ప్రోత్సాహం కీలకం. ప్రభుత్వాలు, స్థానిక సమాజాలు వన్యప్రాణి సంరక్షకులు కలిసి పాటుపడినప్పుడే పులి జాతిని, దాని ఆవాసాలను కాపాడటం సాధ్యమవుతుంది. అడవులు పులులను రక్షిస్తే, పులులు అడవులను రక్షిస్తాయి. వీటిమధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. పులుల సంరక్షణే ఆవరణ వ్యవస్థకు భద్రత!


వ్యాఘ్రాల గణన

శిక్షణ పొందిన అటవీశాఖ సిబ్బంది, వాచర్లు, అటవీ దారులు వాగుల్లో గస్తీ తిరిగి, పులి పాదముద్రల ద్వారా ఇతర సంకేతాలను పరిశీలించడం ద్వారా పులుల గణన చేపడతారు. వాటికవే ఫొటోలు తీసే కెమెరాలను పులులు తిరిగే అవకాశం ఉండే ప్రాంతాల్లో అమర్చడం, రేడియోకాలర్‌ ఏర్పాటు ద్వారా పులి జాడలను గుర్తిస్తారు. పులి రక్షణకు, వేటను నిరోధించడానికి, ఉచ్చులు వేసే అవకాశం ఉండే నీటివనరులు, పులులు సంచరించే ప్రాంతాలు, అక్రమంగా తీగలు వేసే ప్రదేశాలపై నిరంతరం నిఘా ఉంచుతారు. కొన్నిసార్లు  గాయం కారణంగా, జబ్బు చేయడం వల్ల పులి శారీరకంగా అశక్తంగా మారి జంతువులను వేటాడలేని పరిస్థితికి చేరుకుంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే మనుషులపై దాడిచేసే అవకాశం ఉంటుంది.


- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ - ఫ్రాన్స్‌ చెట్టపట్టాల్‌

‣ ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత

‣ హరిత భాగ్యానికి విత్తనబంతి

‣ హక్కులు దక్కని గిరిజన పల్లెలు

‣ భారత్‌ - శ్రీలంక మైత్రిలో నూతన ఒరవడి

‣ మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని