• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌తో సయోధ్య సాధ్యమేనా?



భారత్‌, చైనా సంబంధాలు ఏనాటికైనా సాధారణ స్థితికి చేరుకుంటాయా? సరిహద్దు విషయమై ఉభయ దేశాలు ఏదో ఒకరోజు యుద్ధానికి దిగుతాయా? ఏళ్ల తరబడి సమాధానాలు దొరకని ప్రశ్నలివి. ఆగస్టులో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్‌ సమావేశం, సెప్టెంబరులో దిల్లీలో జీ-20 సదస్సు జరగనున్నాయి. ఆ సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌లు ప్రత్యేకంగా సమావేశమై సయోధ్య ప్రయత్నాలను ముందుకు తీసుకువెళతారేమో చూడాలి.


భారత్‌, చైనా సంబంధాల విషయంలో ఎప్పటికప్పుడు పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడుతుంటాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశీ వ్యవహారాల కమిషన్‌ అధ్యక్షుడు వాంగ్‌ యీ ఇటీవల దక్షిణాఫ్రికాలో సమావేశమయ్యారు. అప్పుడూ ఉభయ దేశాల సంబంధాలపై పరస్పర విరుద్ధ సంకేతాలే వచ్చాయి. 2020 నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)పై రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసిందని డోభాల్‌ వ్యాఖ్యానించారు. దానికి బదులుగా వాంగ్‌ యీ తమ దేశం ఎవరి మీదా ఆధిపత్యం చలాయించాలనుకోవడం లేదని పేర్కొన్నారు. నిరుడు నవంబరులో ఇండొనేసియాలోని బాలిలో జీ-20 సమావేశం జరిగింది. ఆ సందర్భంగా భేటీ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. నేతలిద్దరూ ద్వైపాక్షిక సంబంధాలను స్థిరపరచాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నారని భారత ప్రభుత్వమూ నిర్ధారించింది. అంతమాత్రాన రెండు దేశాల మధ్య మళ్ళీ సామరస్యత నెలకొంటోందని భావించవచ్చునా అంటే అనుమానమే!


అంగీకరించని చైనా

సరిహద్దులో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. దాంతో ఉభయ దేశాల మధ్య సామరస్యత నెలకొంటుందనే ఆశాభావం కలగడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న భారత్‌, చైనా సైనిక దళాల కోర్‌ కమాండర్ల చర్చల్లో సరిహద్దు నుంచి తన సేనలను ఉపసంహరించడానికి చైనా అంగీకరించలేదు. తదుపరి జరగాల్సిన 19వ విడత చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదు. చైనా ప్రజా విమోచన సైన్యం వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బంకర్లు, రాడార్‌, క్షిపణి, ఫిరంగి స్థావరాలను నిర్మిస్తూనే ఉంది. కొత్తగా రహదారులు, హెలిపాడ్లు, వంతెనలు, ఇంటర్నెట్‌ తదితర కమ్యూనికేషన్‌ వసతులను నెలకొల్పుతోంది. పౌర, సైనిక ప్రయోజనాలు రెండింటికీ ఉపకరించే షియావోకాంగ్‌ గ్రామాలను సరిహద్దు వెంట నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్న వైమానిక స్థావరాలను మరింత బలోపేతంచేసి, కొత్తగా మరో ఏడెనిమిది స్థావరాలను, హెలిపాడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ దేశాల నేతలు, మంత్రులు కరచాలనం చేసుకున్నంత మాత్రాన ఉద్రిక్తతలు తొలగి స్నేహం, సయోధ్య నెలకొంటాయని ఆశించలేం.


సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తొలగనంత వరకు ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవు. అసలు భారత్‌, చైనా సరిహద్దులను ఇంతవరకు కచ్చితంగా గుర్తించనే లేదని, బ్రిటిష్‌ వలస పాలకులు గీసిన మెక్‌మహాన్‌ రేఖే ఇప్పటికీ సరిహద్దుగా చలామణీ అవుతోందనే వాదన ఉంది. సరిహద్దు వివాదం ఒక కొలిక్కి రాకపోవడానికి ఇదే మూలకారణమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గతంలో మెక్‌మహాన్‌ రేఖను సరిహద్దుగా అంగీకరించినందుకు బదులుగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను తనకు వదలుకోవాలని చైనా భారత్‌కు అన్యాపదేశంగా షరతు పెట్టిందని ఒక జర్మన్‌ విశ్లేషకుడు పేర్కొన్నారు. చైనాలోని ఇతర రాష్ట్రాలకే కాకుండా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుకూ రవాణా అనుసంధానాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌ గుండా నిర్మించాలన్నది చైనా పథకం. అందుకే ఆ ప్రాంతం తనదేనంటూ మ్యాపులు ప్రచురిస్తూ ఉంటుంది. కానీ, భారత్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేదు.


సైనికంగా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ- ఆర్థికంగా, దౌత్యపరంగా మెరుగైన సంబంధాలే కొనసాగుతూ వచ్చాయి. దౌత్య స్థాయిలో బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థ, జీ-20 వేదికల్లో భారత్‌, చైనాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ వేదికల్లోనూ సరిహద్దు ఘర్షణల ప్రస్తావన వచ్చినట్లు రెండు ప్రభుత్వాల తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి. చాలా సంవత్సరాలపాటు చైనాయే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండేది. 2021-22తో పోలిస్తే 2022-23లో భారత్‌-చైనా వాణిజ్యం తగ్గి, భారత్‌-అమెరికా వాణిజ్యం పెరిగింది. సరిహద్దు సమస్య పరిష్కారమైతే తప్ప చైనాతో వ్యాపార వృద్ధికి అవకాశమే లేదని ప్రధాని మోదీ ఇటీవల స్పష్టం చేశారు. మరోవైపు భారత్‌, బ్రెజిల్‌, రష్యా, చైనాలతో ఏర్పడిన ‘బ్రిక్స్‌’ కూటమి.. ఆగస్టు శిఖరాగ్ర సమావేశంలో డాలర్‌కు పోటీగా ఉమ్మడి కరెన్సీ తీసుకొస్తుందని ఊహాగానాలు రేగాయి. కానీ, భారత్‌ తన రూపాయిని బలోపేతం చేసుకొంటుందే తప్ప బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీని మాత్రం కాదని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ జులై మొదటి వారంలోనే విస్పష్టం చేశారు. రష్యా సైతం ఇప్పటికిప్పుడు ఉమ్మడి కరెన్సీని తీసుకురావడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించింది. తన సరిహద్దులో చైనా అతిక్రమణలు సమసిపోనంతవరకు భారత్‌ ఉమ్మడి కరెన్సీకి కలిసివచ్చే అవకాశం లేదు. బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీ పరోక్షంగా బీజింగ్‌ ఆర్థిక ఆధిపత్యానికే తోడ్పడవచ్చు. దీన్ని నివారించడానికి భారత్‌, అమెరికాలు ఆర్థిక బంధాన్ని బలపరచుకుంటున్నాయి.


‘క్వాడ్‌’తో అడ్డుకట్ట

హిమాలయాల్లో, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ‘క్వాడ్‌’ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నాలుగు దేశాలు వ్యాపార, సైనిక, సాంకేతిక పరంగా సంబంధాలను బలపరచుకొంటున్నాయి. తేజస్‌ యుద్ధ విమానాల్లో అమర్చేందుకు అమెరికన్‌ జీఈ ఇంజిన్లను భారత్‌లోనే తయారు చేయడానికి ఇటీవల ఒప్పందం కుదిరింది. చైనా నుంచి అమెరికా, జపాన్‌లు తరలిస్తున్న పరిశ్రమల్లో కొన్ని భారత్‌కు రానున్నాయి. సెమీ కండక్టర్ల తయారీలో స్వావలంబన సాధనకు అమెరికా, తైవాన్‌, జపాన్‌లు భారత్‌కు తోడ్పడగలవు. ఏతావతా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోకుండా భారత్‌, చైనాలు ఆర్థిక, రాజకీయ బంధాలను బలోపేతం చేసుకోవడం సాధ్యం కాదు.


సరిహద్దుల్లో పోటాపోటీగా నిర్మాణాలు

ప్రపంచంలో మేటి శక్తులుగా ఎదగాలని ధ్యేయంగా పెట్టుకున్న భారత్‌, చైనాలు సరిహద్దుల విషయంలో పట్టు సడలించడానికి సిద్ధంగా లేవు. కాబట్టి, రెండు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు పూర్తిగా సమసిపోతాయనుకోవడం భ్రమే అవుతుంది. చైనాకు దీటుగా సరిహద్దుల్లో రహదారులు, వంతెనల వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని భారత్‌ వేగవంతం చేసింది. 2014లో ఇందుకు 4000 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఇప్పుడు ఆ వ్యయం 14,000 కోట్ల డాలర్లకు పెరిగిందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ ఒక సందర్భంలో వెల్లడించారు.


- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లొసుగులు సరిదిద్దితే దండిగా రాబడి

‣ నల్లసముద్రంపై సంక్షోభ మేఘం

‣ పేదరికం తెగ్గోసుకుపోయిందా?

‣ న్యాయ సంస్కరణల రగడ

‣ పులులే అడవులకు రక్ష

‣ భారత్‌ - ఫ్రాన్స్‌ చెట్టపట్టాల్‌

‣ ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత

Posted Date: 11-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం