• facebook
  • whatsapp
  • telegram

జనవిశ్వాస్‌.. తగ్గనున్న కేసుల భారం



ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా పాలన సాగినప్పుడు అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. దేశం ఆర్థికంగా పురోగమిస్తుంది. పౌరుల జీవన ప్రమాణాలూ మెరుగుపడతాయి. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన జన విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లు ఈ దిశగా పడిన పెద్ద ముందడుగు. మన చట్టాల్లో అనవసరంగా క్రిమినల్‌ ఆరోపణలకు తావిచ్చే నిబంధనలను తొలగించడం దీని ప్రధాన ఉద్దేశం.


నిబంధనలను సరిగ్గా పాటించలేదన్న కారణంతో శిక్షలు విధించడానికి మన చట్టాలు అనుమతిస్తున్నాయి. చిన్నాచితకా అతిక్రమణలను నేరాలుగా పరిగణించి శిక్షలు విధించాల్సిన అవసరంలేదు. దీనివల్ల చిరు వ్యాపారులు దెబ్బతింటారు. 42 చట్టాల్లోని అటువంటి 183 నిబంధనలను జన విశ్వాస్‌ బిల్లు తొలగించి చిరు వ్యాపారులకు వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. చిన్నపాటి ఉల్లంఘనలను నేరంగా పరిగణించే పద్ధతికి స్వస్తిచెప్పి జరిమానాలు విధించడానికి ప్రాధాన్యమిస్తుంది. ఇది చట్టంగా మారిన తరవాత ప్రతి మూడేళ్లకు ఒకసారి కనీస జరిమానాలు 10శాతం చొప్పున పెరుగుతాయి. శిక్షల భయం లేకుండా నిబంధనలు పాటించేలా చూడటం జన విశ్వాస్‌ చట్ట లక్ష్యం. ఈ విధంగా సర్కారుపై విశ్వాసం పెంచడం ద్వారా పెట్టుబడులకు ఊతమివ్వాలని బిల్లు లక్షిస్తోంది. చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలను సైతం నేరాలుగా పరిగణిస్తుండటం వల్ల న్యాయవ్యవస్థపై కేసుల భారం పెరుగుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికీ తాజా బిల్లు తోడ్పడుతుంది.


అతిక్రమణలకు అడ్డుకట్ట

పారిశ్రామిక, వ్యాపార వర్గాల నుంచి సూచనలు, అభిప్రాయాలను తీసుకున్న మీదట- పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ బిల్లు ముసాయిదాను ప్రతిపాదించింది. ‘కనీస ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ సూత్రానికి ఇది పట్టం కడుతోంది. జన విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లును పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఆపై దాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) పరిశీలనకు పంపారు. కేంద్రం గతంలో కాలంచెల్లిన అనేక చట్టాలను రద్దుచేసిన విషయాన్ని జేపీసీ గుర్తుచేసింది. జన విశ్వాస్‌ బిల్లు చట్టాలను రద్దు చేయకపోయినా చిన్నపాటి ఉల్లంఘనలను సైతం నేరాలుగా పరిగణించి సుదీర్ఘ వ్యాజ్యాలకు తావిచ్చే ధోరణికి అడ్డుకట్ట వేసిందని ఆ సంఘం పేర్కొంది. దీనివల్ల న్యాయవ్యవస్థకు పెండింగ్‌ కేసుల భారం తగ్గడమే కాకుండా, భవిష్యత్తులో వివిధ చట్టాలకు కాలానుగుణంగా మార్పులు చేయడానికి మార్గం సుగమం అవుతుందని జేపీసీ అభిప్రాయపడింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కాలంచెల్లిన చట్టాలకు మంగళం పాడాలని, చిన్నచిన్న ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించి జైలు శిక్షలు వేసే బదులు... జరిమానాలు విధించడం ద్వారా అతిక్రమణలకు అడ్డుకట్ట వేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, డీపీఐఐటీలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీచేయాలని సిఫార్సు చేసింది. కేంద్రం, రాష్ట్రాలు ఒకే పంథాను అనుసరిస్తే వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతాయి. దాంతో కొత్త పెట్టుబడులు ప్రవహిస్తాయి. గతంలో జరిగిన పౌర ఉల్లంఘనలకు వెనకటి తేదీ నుంచి శిక్షలు, జరిమానాలు విధించవచ్చు. క్రిమినల్‌ నేరాల్లో మాత్రం అవి నిరూపితమైన తరవాతే శిక్షలు విధించాల్సి ఉంటుంది. అదే సమయంలో- లోగడ క్రిమినల్‌ నేరాలుగా భావించినవి, ఆ వర్గీకరణ కిందకు రావని వర్తమానంలో నిర్ధారించినప్పుడు పాత కేసులు వీగిపోతాయి. కాబట్టి, జన విశ్వాస్‌ బిల్లును వెనకటి తేదీ నుంచి వర్తింపజేయాలని, తద్వారా చిన్నపాటి ఉల్లంఘనలను క్రిమినల్‌ నేరాల పరిధి నుంచి తొలగించి కేసుల భారాన్ని తగ్గించాలని సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది.


ప్రస్తుతం భారత్‌లో 1536 చట్టాల్లోని 70,000 నిబంధనలు వ్యాపార నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయి. వాటిలో 26,134 నిబంధనలు చట్ట ఉల్లంఘనలకు జైలు శిక్షలను నిర్దేశిస్తున్నాయి. ఇవి వ్యాపార రంగానికి, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి గుదిబండగా తయారయ్యాయి. దేశంలో అత్యధికంగా ఉద్యోగాలను కల్పిస్తూ, జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఈ శిక్షాత్మక నిబంధనలు వెనక్కు లాగుతున్నాయి. వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించడానికి అవసరమైన అనుమతుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. అయినదానికీ కానిదానికీ శిక్షలకు గురికావలసిన దుస్థితిని తొలగించడం ద్వారా వ్యాపార సంస్థలు, వ్యవస్థాపకులు తమ సమయాన్ని, వనరులను, శ్రద్ధాసక్తులను పూర్తిగా వ్యాపారాభివృద్ధికే కేటాయించే వాతావరణాన్ని సృష్టించాలని జన విశ్వాస్‌ బిల్లు లక్షిస్తోంది. వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రభుత్వ అనుమతుల కోసం మల్లగుల్లాలు పడాల్సిన అగత్యం తప్పితే వ్యాపార సౌలభ్యం ఊపందుకొంటుంది. దానివల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఉత్పాదకత పెరుగుతాయి. నియమ నిబంధనల భారం తగ్గినప్పుడు దేశవిదేశీ మదుపరులు వ్యాపారాలు ప్రారంభించడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారు. అది స్థూల దేశీయోత్పత్తిని పెంచుతుంది.


న్యాయ వ్యవస్థకు పెద్ద ఊరట

అపరిష్కృత కేసుల కొండతో ఊపిరి సలపని న్యాయవ్యవస్థకు జన విశ్వాస్‌ బిల్లు పెద్ద ఊరటనిస్తుంది. చిన్నపాటి ఉల్లంఘనలకు సంబంధించిన వ్యాజ్యాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ఇది వీలు కల్పిస్తోంది. దాంతో న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఏతావతా పౌరులు, వ్యాపారులు తమకు తామే బాధ్యతాయుతంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తారని ప్రభుత్వం నమ్మకం పెట్టుకొంటోందని జన విశ్వాస్‌ బిల్లు సూచిస్తోంది. అయితే, బడా కార్పొరేట్‌ సంస్థలు దీన్ని అలుసుగా తీసుకుని అతిక్రమణలకు పాల్పడే ప్రమాదముంది. దీనివల్ల పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చు. అంతటి ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించి శిక్షించవలసిందే. జన విశ్వాస్‌ బిల్లు ఈ తరహా కేసులను కూడా జరిమానాలతో సరిపెట్టడం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాయు కాలుష్య నిరోధ చట్టం, పర్యావరణ సంరక్షణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలు, వ్యక్తులకు ఎలాంటి శిక్షలు, జరిమానాలు విధించాలో తేల్చే సాంకేతిక సామర్థ్యం మధ్యవర్తిత్వ అధికారులకు ఉండకపోవచ్చు. తపాలా ద్వారా బట్వాడా అయ్యే వస్తువుల చోరీని నేరంగా పరిగణించకూడదని జన విశ్వాస్‌ బిల్లు పేర్కొంటోంది. దీనివల్ల నేరాలు పెరగడమే తప్ప తగ్గేది ఉండదు. కాబట్టి, ఇటువంటి లోపాలు లేకుండా చట్టాన్ని పటిష్ఠం చేయడం ఆవశ్యకం.


ఉల్లంఘన బట్టి జరిమానా

వ్యాపారులు చిన్నాచితకా నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కోర్టులకు వెళ్ళాల్సి వస్తోంది. శిక్షల భయం వ్యాపారుల్లో బెరుకు పెంచి కొత్త పెట్టుబడులను నిరుత్సాహపరుస్తోంది. ఈ దుస్థితిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1500 పాత చట్టాలను తొలగించింది. 39,000 నిబంధనలను సరళతరం చేసింది. గతంలో నేరాలనుకున్నవాటిని నేరాల నిర్వచనం నుంచి తొలగించడానికి 3,500 కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. ఉల్లంఘన బట్టి జరిమానా పరిమాణాన్ని నిర్దేశించడానికి జన విశ్వాస్‌ బిల్లు వీలు కల్పిస్తోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!

‣ రైతుకు మేలు చేసేదే సరైన విధానం

‣ అన్నదాతకు అండగా కిసాన్‌ కేంద్రాలు

‣ భావి తరాలకు బంగారు భవిష్యత్తు

‣ తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రత

Posted Date: 12-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం