• facebook
  • whatsapp
  • telegram

భావి తరాలకు బంగారు భవిష్యత్తు‘ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మౌలిక సదుపాయాలే వెన్నెముక. అటువంటి కీలక రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆధునిక తెలంగాణ స్వరూపానికి సంబంధించిన నమూనా సీఎం కేసీఆర్‌ మదిలో ఉంది. ఆ దిశగా మరో శతాబ్ద కాలానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నది కేసీఆర్‌ ఆలోచన. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోంది. మూలధన వ్యయంలో తెలంగాణ ముందువరసలో ఉంది. సీఎం కేసీఆర్‌ దార్శనికత, దూరదృష్టి వల్ల రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఊహకందని వేగంతో ముందుకు సాగుతోంది. కేసీఆర్‌ పాలన మౌలిక సదుపాయాల కల్పనలో స్వర్ణయుగం.’


రాష్ట్రం ఏర్పడిన దశాబ్దకాలంలోనే ప్రాజెక్టులను రూపొందించుకోవడం, నిర్మించుకోవడం, వాటి ఫలాలను అనుభవించడం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఇంత వేగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తిచేసిన ఉదంతాలు లేవు. ప్రాజెక్టుల రూపకల్పనకే ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్న రాష్ట్రాలను చూస్తున్నాం. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలనాదక్షత వల్ల మనం వేగంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, రహదారులు, విద్యుత్తు, రవాణా ప్రాజెక్టులు, హైదరాబాద్‌ నగరంలో మెట్రో ప్రాజెక్టు, పరిశ్రమలు.. చెప్పుకొంటూ పోతే ఏ రంగంలో చూసినా తెలంగాణతో పోటీ పడగలిగే రాష్ట్రాలు అతి స్వల్పం.


హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి

తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్‌ది చెరగని ముద్ర. శతాబ్దాలుగా అంతర్జాతీయంగా పేరొందిన చారిత్రక హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యాన వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. నగరాభివృద్ధికి బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రపంచంలోనే వివిధ రంగాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. ఇంతటి కీలకమైన నగరంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు దారి చూపించారు. దాన్ని త్వరితగతిన పూర్తిచేయడంలో విశేషంగా కృషి చేశారు. అదే స్ఫూర్తితో రూ.69వేల కోట్లతో మెట్రో రైలు వ్యవస్థను విస్తరించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ నడుమ నగర ప్రజలకు మెట్రో పెద్ద ఊరట.


అంతేకాకుండా- నిర్మాణ సమయంలో, ఆ తరవాత వేల మందికి ఈ విస్తరణ ప్రాజెక్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. హైదరాబాద్‌లో మరిన్ని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో... వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ), వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్‌ఎన్‌డీపీ) ముఖ్యమైనవి. ట్రాఫిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఆర్‌డీపీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెద్దయెత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు, కారిడార్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొన్నేళ్లుగా నగరాన్ని ఇబ్బంది పెడుతున్న వరదల నుంచి రక్షణ కల్పించేందుకు రూ.985 కోట్ల వ్యయంతో 56 నాలాలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌ నలుదిక్కులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం- నగరాన్ని హెల్త్‌ సిటీగా తీర్చిదిద్దుతుంది. వీటి వల్ల హైదరాబాద్‌ నగర ముఖచిత్రం మారుతోంది. పదేళ్ల కిందట, ఇప్పుడు హైదరాబాద్‌ ఎలా ఉందో మీరే పోల్చుకోండి.


ఐటీ రంగం పరుగులు..

ఐటీ రంగాన్ని సీఎం కేసీఆర్‌ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతోంది. 2013-14లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు. 2021-22 నాటికి అవి రూ.1,83,569 కోట్లకు చేరాయి. తెలంగాణ ఐటీ రంగంలో  7,78,121 మందికి ఉపాధి లభించింది. టీ-హబ్‌, వీ-హబ్‌, టీ-వర్క్స్‌ వంటి అనేక వినూత్న ఆలోచనలతో ఐటీ రంగాన్ని హైదరాబాద్‌ శాసించే స్థాయికి చేరింది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి.


‘టీఎస్‌ ఐపాస్‌’ తెలంగాణ పారిశ్రామిక రంగానికి వరం. పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం, వేగంగా అనుమతులు మంజూరు చేయడం వంటి చర్యలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎదుగుతోంది. ఈ రంగానికి నీటి కొరత లేకుండా 10శాతం నీటిని ప్రత్యేకించి పరిశ్రమలకే కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. రెప్పపాటు సమయమైనా కోత లేకుండా పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు అందిస్తుండటానికి సీఎం కేసీఆరే కారణం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తోంది. జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటే అందుకు నిదర్శనం.


తెలంగాణ ఏర్పడిన తరవాత మొట్టమొదట సీఎం కేసీఆర్‌ వ్యవసాయ, సాగునీటి రంగాలపై దృష్టిపెట్టారు. నీళ్ల కోసం 60ఏళ్లు వేదన అనుభవించిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్‌ పట్టుదలే- కేంద్రం సహకరించకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేలా చేసింది. పంట పొలాల్లోకి కాళేశ్వరం జలాలు వచ్చి రైతుల కన్నీళ్లు తుడిచాయి. తద్వారా చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయిలో భూమి సాగవుతోంది. అంతే స్థాయిలో ధాన్యం పండుతోంది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానానికి తెలంగాణ ఎదిగింది. ఇవన్నీ కాళేశ్వరం అందించిన ఫలితాలే. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తాగునీటి, పరిశ్రమల అవసరాలనూ తీరుస్తోంది. తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారింది.


ఆధునిక తెలంగాణ నమూనా

సీఎం కేసీఆర్‌ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఏ ఆలోచనతో ముందుకు సాగుతున్నారు? భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించాలని ఆయన తపన పడుతున్నారు. ఆధునిక తెలంగాణ ఎలా ఉండాలన్న నమూనా ఆయన మదిలో ఉంది. అందుకు అనుగుణమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వర్తమానం నుంచి భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్త పరిణామాలను, అభివృద్ధి నమూనాలను గమనిస్తూ తెలంగాణను అందుకు తగ్గ మార్పులకు సమాయత్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన రంగానికి పెద్దపీట వేయడానికి అనేక కారణాలున్నాయి. మంచి రోడ్లు, నాణ్యమైన విద్యుత్తు వంటి వసతులకు ఉత్తమ ప్రభుత్వ విధానాలు తోడైతే రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దాంతో ప్రజలు ఆర్థికంగా బలోపేతమవుతారు. పరిశ్రమలు విరివిగా ఏర్పడితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అలా వచ్చే రాబడితో మరిన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టవచ్చు. ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. అందుకు తెలంగాణ ఐటీ, పారిశ్రామిక, సాగునీటి, వ్యవసాయ రంగాలే ఉదాహరణ. ఈ నాలుగు రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న సీఎం కేసీఆర్‌ చేతుల్లో తెలంగాణ పదిలంగా ఉందనడంలో సందేహమే లేదు.


విద్యుదుత్పత్తిలో మున్ముందుకు..

అభివృద్ధి స్థాయిని మదింపువేసే కీలక సూచికల్లో విద్యుత్తు వినియోగ సూచీ ప్రధానమైనది. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లే. సీఎం కేసీఆర్‌ కృషితో ఇప్పుడా సామర్థ్యం 18,567 మెగావాట్లకు చేరింది. విద్యుత్తు రంగంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ప్రభుత్వరంగ సంస్థ టీఎస్‌ జెన్‌కో ఆధ్వర్యాన కాకతీయ థర్మల్‌ విద్యుత్తు కర్మాగారం, కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్తు స్టేషన్‌ ఏడో దశ, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ప్రారంభమయ్యాయి. దామరచర్లలో యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం త్వరలో ప్రారంభంకానుంది. ముఖ్యంగా కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ 48 నెలల రికార్డు సమయంలో పూర్తయింది. విద్యుత్తు రంగంపై వ్యక్తమైన అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణలో వెలుగులు నింపుతున్నారు. గృహావసరాలతో పాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును తెలంగాణ సర్కారు సరఫరా చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలో ‘పవర్‌ హాలిడే’ ఊసే లేదు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రత

‣ డ్రాగన్‌తో సయోధ్య సాధ్యమేనా?

‣ లొసుగులు సరిదిద్దితే దండిగా రాబడి

‣ నల్లసముద్రంపై సంక్షోభ మేఘం

‣ పేదరికం తెగ్గోసుకుపోయిందా?

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం