• facebook
  • whatsapp
  • telegram

సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ



జగన్‌ జమానాలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలింది. రాష్ట్రం రుణ ఊబిలో కూరుకుపోయింది. సకల వ్యవస్థలూ గాడి తప్పాయి. వీటన్నింటినీ సరిదిద్ది రాష్ట్రాభివృద్ధిని పరుగులు తీయించడం నూతన ప్రభుత్వానికి సవాలే. సమర్థ ప్రణాళికలు, వినూత్న విధానాలతో ముందుకు సాగితే ఏపీ దశ మారడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక తీర్పిచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఘనవిజయం కట్టబెట్టారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొలువుతీరబోయే కొత్త ప్రభుత్వానికి అనేక ఆర్థిక సవాళ్లు ఎదురుకానున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంత తేలికేమీ కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో వేరేచెప్పనక్కరలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ద్రవ్య నిర్వహణ, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి వాటిపై తక్షణం దృష్టి సారించాలి.


ఎన్నో అవకాశాలు

గత తాత్కాలిక బడ్జెట్‌ సమయంలో ఏపీ ద్రవ్యలోటును రూ.55,817.50 కోట్లుగా సర్కారు చూపింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ఇది 3.51శాతం. ద్రవ్యపరమైన బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) మూడు శాతం పరిమితి కన్నా ఇది అధికం. ఈ లోటు కొత్త ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. 2019లో రూ.3.6లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్ర రుణభారం 2024 మార్చి నాటికి దాదాపు రూ.11లక్షల కోట్లకు చేరింది. మరోవైపు ప్రాంతీయాభివృద్ధిలో వ్యత్యాసాలు, మౌలిక సదుపాయాల కల్పనలో అసమానతలు, నిరుద్యోగం సైతం ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి. వీటిని సరిదిద్దడానికి కొత్త ప్రభుత్వం దృఢ సంకల్పంతో, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి. ఈ క్రమంలో ద్రవ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదాయాన్ని పెంచడం, చేసే ఖర్చుకు గరిష్ఠ ఫలితాన్ని సాధించడమే లక్ష్యంగా నూతన సర్కారు బహముఖ వ్యూహాలను అమలు చేయాలి. ఆస్తుల వాస్తవ విలువకు అనుగుణంగా న్యాయమైన పన్ను విధించాలి. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించవచ్చు. పనితీరు ఆధారంగా ఆయా శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు జరిపే విధానాలను ప్రవేశపెట్టాలి. దీనివల్ల సమర్థతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రమాదం వాటిల్లకుండా రుణాలను సేకరించడం కోసం ఆర్థిక, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులతో ఒక ప్రత్యేక రుణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జగన్‌ దుర్విధానాల వల్ల అమరావతి నగర అభివృద్ధి ప్రాజెక్టు అటకెక్కింది. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)తో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రగతి ఫలాలు అందరికీ సమానంగా అందడం కోసం ప్రతి ప్రాంత బలాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.



ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ ప్రగతి పథంలో నడవాలంటే ఆర్థికంగా జవసత్వాలు పుంజుకోవాలి. మరోసారి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలి. వాణిజ్య చట్టాలను సరళతరం చేయడం, పాలనాపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించవచ్చు. పన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలు, మేలిమి మౌలిక వసతులు, సింగిల్‌ విండో లైసెన్స్‌ విధానం అందుబాటులో ఉండే ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) ద్వారా విదేశీ, స్వదేశీ పెట్టుబడులను పెద్దయెత్తున ఆకర్షించవచ్చు. దానివల్ల పారిశ్రామికాభివృద్ధి ఊపందుకోవడమే కాకుండా, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి. చైనా జీడీపీలో 20శాతం సెజ్‌ల నుంచే వస్తుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంక్యుబేషన్‌ వసతులు, ఆర్థికపరమైన చేయూత ద్వారా ఇన్నొవేషన్‌ హబ్స్‌ను తీసుకువస్తే అవి డిజిటల్‌ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలుపుతాయి. సాంకేతికపరంగా అభివృద్ధి జరుగుతుంది. అంకుర సంస్థలు ఏర్పాటవుతాయి.


ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పరంగా ఉన్న అవకాశాల వినియోగానికి మౌలిక సదుపాయల కల్పన చాలా కీలకం. విశాఖ-చెన్నై; చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల వంటి బడా ప్రాజెక్టులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి. కచ్చితమైన బడ్జెట్‌ కేటాయింపులు, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం, సమర్థ నిర్వహణ విధానాలను అవలంబిస్తే ప్రాజెక్టులను సకాలంలో, ఖర్చు పెరగకుండా పూర్తి చేయవచ్చు. అభివృద్ధి బ్యాంకులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంప్రతించి ఈ భారీ ప్రాజెక్టులకు కావాల్సిన పెట్టుబడులను సమీకరించవచ్చు. ఎప్పటికప్పుడు పెరిగే కరెంటు అవసరాలు తీర్చుకుంటూ సౌర, పవన విద్యుత్తుపై దృష్టి సారించాలి. దీనివల్ల పర్యావరణానికీ మేలు కలుగుతుంది. 


కలిసికట్టుగా ప్రగతి వైపు

కొత్త ప్రభుత్వం ముందున్నది గడ్డు కాలమే. కష్టపడితే సిద్ధించే లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఉత్తమ విధానాలను అనుసరించడం, పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత సవాళ్లను అధిగమించి అగ్ర స్థాయికి ఎదగవచ్చు. అనుభవం, దార్శనికత మెండుగా ఉన్న నాయకత్వం ఏపీ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తుంది. నాయకులు, ప్రజల్లో ఐక్యత, వినూత్నమైన ఆలోచనా విధానం, తొణకని పట్టుదల ఉంటే రాష్టం అన్ని సవాళ్లనూ అధిగమించి ప్రగతి పథంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఎదురుగా ఉన్న దారి కంటకప్రాయమైనదే. అయితే, ప్రజలందరూ శక్తివంచన లేకుండా కష్టించి తమ కలలను నిజం చేసుకునేందుకు నూతన చైతన్యంతో నిండిన ఆంధ్రప్రదేశ్‌ కళ్లెదురుగా ఉంది. ఆ ఏపీ భవిత చాలా ఆశాజనకంగా కనబడుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింత ఉన్నతమైన భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ముందుకు నడవాల్సిన సమయమిది.


నైపుణ్యాభివృద్ధి కీలకం

ఉద్యోగాల కల్పన, యువతలో నైపుణ్యాల పెంపుదల సమ్మిళిత అభివృద్ధిలో కీలకంగా నిలుస్తాయి. ఏపీ యువతను మేటి నైపుణ్యాలతో తీర్చిదిద్దాలి. వృత్తి విద్యా కోర్సుల్లో బోధన, శిక్షణ ఏకకాలంలో జరిగేలా చూడాలి. సైబర్‌ భద్రత, కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్‌ వంటి నయా సాంకేతికతల్లో తర్ఫీదు ఇవ్వాలి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో రాణించేందుకు యువతకు సాంకేతికత ఆధారిత నైపుణ్యాలను అందించాలి. అంకుర సంస్థలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఐటీ, తయారీ, ఔషధాలు వంటి ముఖ్యమైన రంగాల్లో వ్యాపారులు, సరఫరాదారులు, పరిశోధన సంస్థలు ఒకే చోట కార్యకలాపాలు సాగించేలా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. విజ్ఞాన మార్పిడికి, సామర్థ్యాల పెరుగుదలకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. 


- తుల్జాభవాని దేవినేని

(చార్టర్డ్ ఎకౌంటెంట్)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్నదాతకు అండగా కృత్రిమ మేధ

‣ సేద్యానికి బలిమి... దేశానికి కలిమి!

‣ సాగర గర్భం... అంతర్జాల కేంద్రం

‣ కేంద్రానికి మిగులు సాయం

Posted Date: 14-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం