• facebook
  • whatsapp
  • telegram

అన్నదాతకు అండగా కృత్రిమ మేధ



ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రతి రంగాన్నీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ) ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ రంగంలోనూ ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో సాగు స్వరూపాన్ని ఏఐ పూర్తిగా మార్చివేసేలా ఆవిష్కరణలు జరుగుతున్నాయి.


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. అనేక దేశాలు యాంత్రీకరణను దాటుకుని స్మార్ట్‌ వ్యవసాయం వైపు పరుగులు తీస్తున్నాయి. ఇండియాలోనూ అటు వైపు అడుగులు పడుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), డేటా ఆధారిత పరిష్కారాలు సాగులో కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. 1960ల్లో వచ్చిన హరిత విప్లవంతో దేశీయంగా ఆహారోత్పత్తి గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నేలక్షీణత, నీటికొరత, విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వంటి సవాళ్లను సాగు రంగం ఎదుర్కొంటోంది. వీటికితోడు పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, భవిష్యత్‌ తరాలకు ఆహారభద్రతను అందించడానికి కృత్రిమ మేధ, బిగ్‌డేటా అనలిటిక్స్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగపడతాయి.


దిగుబడుల పెంపే లక్ష్యం

స్థిర వ్యవసాయానికి ఏఐ ముఖ్య సహాయకారిగా మారుతోంది. డ్రోన్లు, సెన్సర్లు తదితరాల ద్వారా రైతులు నేల ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులు, పంట పెరుగుదల, తెగుళ్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికతలు వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి, నీటిపారుదల, ఫలదీకరణం, పంటల రక్షణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి. ఏఐ ఆధారిత ముందస్తు విశ్లేషణల సాయంతో మార్కెట్‌ పోకడలను తెలుసుకొని, నష్టాలను తగ్గించుకోవచ్చు. నేల స్వభావం, పంట రకాలు, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను ఏఐ సాంకేతికత సూచిస్తుంది. వాటిద్వారా పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు పంటల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు, మొబైల్‌ యాప్‌లతో ఉత్తమ వ్యవసాయ విధానాలను అన్నదాతలకు తెలియజెప్పవచ్చు. సహజవనరుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ఏఐ, డేటా అనలిటిక్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. ఉపగ్రహ చిత్రాలు, భౌగోళిక సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అటవీ నిర్మూలన, నేల క్షీణత, నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించవచ్చు. పర్యావరణ వ్యవస్థలను, జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ఇవి తోడ్పడతాయి. ఏఐ ఆధారిత అనువర్తనాలు నీటి నిర్వహణ, పంట మార్పిడి, సకాలంలో పంట కోత, సాగుచేయాల్సిన రకం, సరైన సమయంలో నాటడం లేదా విత్తడం, చీడపీడల ప్రభావం తదితరాలపై అన్నదాతలకు సరైన సూచనలు అందిస్తాయి.


ప్రపంచ జనాభా 2050 నాటికి వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. పెరిగే జనాభాకు అనుగుణంగా పంట దిగుబడులను సాధించాలి. ఆహార కొరతను అధిగమించడానికి ఉత్పాదకతను పెంచడమే పరిష్కారం. ఈ విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం వల్ల విత్తనాలు విత్తడానికి సరైన సమయాన్ని నిర్ణయించడం రైతులకు సవాలుగా మారింది. కృత్రిమ మేధ సహాయంతో కర్షకులు వాతావరణ పరిస్థితులను విశ్లేషించవచ్చు. వ్యవసాయ క్షేత్రాల్లో వివిధ రకాల కార్యకలాపాలను సులభంగా నిర్వహించగల రోబోలను ఏఐ ఆధారంగా తయారుచేస్తున్నారు. ఏఐ వ్యవస్థలు ఉపగ్రహ చిత్రాలు, పూర్వ సమాచారాన్ని ఉపయోగించి కీటకాల దాడి వంటి వాటి గురించి ముందుగానే చెబుతాయి. డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీతో పాటు పొలాల పర్యవేక్షణనూ చేపట్టవచ్చు. డ్రైవర్‌ లేని ట్రాక్టర్లు, ఏఐ ఆధారిత రోబోలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి. అనేక దేశాల్లో వ్యవసాయ పనులకు కూలీల కొరత నెలకొంది. అధునాతన పరికరాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు.


తగిన జాగ్రత్తలు తీసుకుంటూ...

భారత వ్యవసాయంలో ఏఐ, డేటా ఆధారిత అనువర్తనాలను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ సంఘాల సమష్టి కృషి అవసరం. సుస్థిర సాగుకు జాతీయ కార్యక్రమం (ఎన్‌ఎంఎస్‌ఏ), డిజిటల్‌ ఇండియా వంటివి వ్యవసాయంలో సాంకేతికత వినియోగానికి పునాది వేశాయి. ఇండియాలో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులే. తమకున్న చిన్న కమతాల్లో ఆధునిక పరికరాలను వినియోగించడం వారికి సమస్యగా మారింది. వీటికి ప్రారంభ పెట్టుబడి అధికంగా ఉండటం, ఆయా పరికరాల వినియోగంపై అవగాహన కొరవడటమూ ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు కృత్రిమ మేధ కొన్ని భద్రతాపరమైన ప్రశ్నలను సైతం లేవనెత్తుతోంది. ఆహార సరఫరాలకు అంతరాయం కలిగించే ఉద్దేశంతో ఏఐ ఆధారిత వ్యవసాయ వ్యవస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏఐని వినియోగించాలి. ఏది ఏమైనా సంప్రదాయ వ్యవసాయంలో ఉన్న అనేక సవాళ్లకు ఏఐ పరిష్కారం చూపుతుంది. భవిష్యత్తులో సాగు మొత్తం ఏఐ కేంద్రంగానే జరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా వ్యవస్థలను సమాయత్తం చేయడం ప్రభుత్వాల కర్తవ్యం.


- దేవవరపు సతీష్‌బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సేద్యానికి బలిమి... దేశానికి కలిమి!

‣ సాగర గర్భం... అంతర్జాల కేంద్రం

‣ కేంద్రానికి మిగులు సాయం

‣ విజృంభిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

‣ కట్టుబడాలిక... సంకీర్ణ ధర్మానికి!

‣ సవాళ్లను అధిగమిస్తేనే వరి సిరులు

‣ అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

Posted Date: 11-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం