• facebook
  • whatsapp
  • telegram

తెలుగు రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ

రైల్వే బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు

దేశ సమైక్యతకు ప్రతీకగా భారతీయ రైల్వే వాసికెక్కింది. అన్ని రైల్వే జోన్లు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ మాట అర్థవంతమవుతుంది. నిధుల కేటాయింపులో తెలుగు రాష్ట్రాలపై రైల్వే శాఖ దుర్విచక్షణ చూపుతోందనే అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకీ బలపడుతోంది. ఉత్తర భారతంతో పోలిస్తే రవాణా పరంగా కాసులు కురిపిస్తున్న తెలుగు రాష్ట్రాలపై రైల్వే శాఖ శీతకన్ను వేస్తోందనే వాదనకు ప్రతి కేంద్ర బడ్జెట్‌ బలం చేకూర్చుతోంది. అత్యవసరమైన ప్రాజెక్టులకు సైతం అరకొర నిధులు మంజూరు చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. 

పురోగతి ఏదీ?

భారతీయ రైల్వే సాధారణంగా రోజుకు మూడు కోట్లకుపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వేలో నేటికీ కొన్ని ప్రాంతాలకు కనీస వసతులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల అనుసంధానం, వంతెనల నిర్మాణం, కొత్త లైన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కేటాయిస్తుండటంతో ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఏదీ ముందుకు కదలడం లేదు. 2021 రైల్వే బడ్జెట్‌తో పోల్చితే 2022లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిధుల కేటాయింపు 30శాతం దాకా పెరిగిందని అధికారవర్గం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.3048 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7032 కోట్లు ప్రత్యేకించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే జీఎం సంజీవ్‌ కిశోర్‌ తెలిపారు. దశాబ్దాలుగా కదలిక లేని ప్రాజెక్టుల గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. లైన్ల విద్యుదీకరణకోసం గత బడ్జెట్‌లో రూ.617 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.791 కోట్లు ఇచ్చారు. అవి ఎందుకూ సరిపోవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైనును దశాబ్దం క్రితం ప్రకటించారు. 308 కిలోమీటర్ల లైను నిర్మాణంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి శావల్యపురందాకా 46 కి.మీ. మాత్రమే జరిగాయి. మిగిలిన పనులు ఇంకెన్ని దశాబ్దాలకు పూర్తవుతాయో తెలియదు! తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి-నర్సాపుర్‌ రైల్వే లైన్‌ కోసం దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు. గోదావరి నదిపై వంతెనలు ఏర్పాటు చేసి కొత్త రైల్వే లైన్‌ వేస్తే కొబ్బరి వ్యాపారులకు మేలు జరుగుతుంది. కోనసీమ ప్రాంతంతో ఇతర వ్యాపార కార్యకలాపాలు సైతం వృద్ధి చెందుతాయి. 22 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు ప్రకటన చేసినా, నేటికీ పురోగతి లేదు.

తెలంగాణలోని మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ కొత్తలైను నిర్మాణానికి 1997లో ప్రతిపాదన చేశారు. నేటికీ ఆ ప్రాజెక్టు పనులు పూర్తికాలేదు. 244 కి.మీ. పనుల కోసం రూ.1723 కోట్లు ప్రతిపాదించినా, రూ.289 కోట్లే కేటాయించారు. ప్రాజెక్టులో 66 కి.మీ. తెలంగాణ పరిధిలో, మిగిలిన 178 కి.మీ. కర్ణాటక జోన్‌లోకి వస్తాయి. దేవరకద్ర, మక్తల్‌ మధ్య 40 కి.మీ. పనులు పూర్తయ్యాయి. తెలంగాణ పరిధిలో ఉన్న లైన్‌ నిర్మాణం కోసం రూ.452 కోట్లు ప్రతిపాదించినా, ఇప్పటికీ ఆ నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. కడప- బెంగళూరు లైన్‌ నిర్మాణాన్ని 2008-09లో ప్రతిపాదించారు. 255 కి.మీ. పొడవైన ఆ ప్రాజెక్టుకు రూ.2706 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కేటాయింపుల్లో జాప్యం వల్ల అదీ సకాలంలో పట్టాలకు ఎక్కడం లేదు. ఏపీ పరిధిలోని కడప-పెండ్లిమర్రి మధ్య 21 కి.మీ. లైన్‌ మాత్రమే పూర్తయింది.

పట్టించుకోని వైనం

తెలంగాణలోని భద్రాచలం-సత్తుపల్లి లైన్‌ నిర్మాణం చేపట్టాలని దశాబ్దం కిందట ప్రకటించినా నేటికీ పూర్తి కాలేదు. 54 కి.మీ. పనుల్లో భద్రాచలం-చందూరుగొండ మధ్య 25.10 కి.మీ. పనులే పూర్తి చేశారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి లైనును 2006లో ప్రకటించారు. 151 కి.మీ.కిగాను మనోహరాబాద్‌-గజ్వేల్‌ మధ్య 31కి.మీ. పనులే పూర్తి చేశారు. పరలివయిజనాథ్‌-వికారాబాద్‌ పనుల్లోనూ ప్రగతి లేదు. నంద్యాల-ఎర్రగుంట్ల లైన్‌ విద్యుదీకరణ పరిస్థితీ అలాగే ఉంది. ధర్మవరం-పాకాల మధ్య 228 కి.మీ. విద్యుదీకరణలో 2017 నుంచి ఇప్పటిదాకా 67 కి.మీ. మాత్రమే పూర్తయింది. డబ్లింగ్‌ ప్రాజెక్టులు, బైపాస్‌ల నిర్మాణాలు ఏళ్లతరబడి పెండింగులోనే ఉంటున్నాయి. ప్రమాదాల నివారణకు క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణం అరకొరగానే సాగుతోంది. రైల్వే గేట్ల ఏర్పాటు, అండర్‌ పాస్‌ల నిర్మాణాలకు సంబంధించి వందల్లో ప్రతిపాదనలు ఉన్నా పదుల సంఖ్యలోనూ పనులు జరగడంలేదు. కీలకమైన ప్రాజెక్టులకోసం ప్రజాప్రతినిధులు వేల కొద్దీ వినతులు ఇచ్చినా, ఇస్తున్నా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకొని జోన్లవారీగా కేటాయింపులు చేయడం ఉత్తమం. దానివల్ల అధిక ఆదాయాన్ని ఇచ్చే తెలుగు రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు దక్కుతాయి.

- నాదెళ్ల తిరుపతయ్య
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బ్రిటన్‌తో వాణిజ్య బంధానికి రాచబాట

‣ వర్తమానం విడిచి భవితపై సాము

‣ మధ్యాసియాతో బంధం బలోపేతం

‣ పొడిబారుతున్న పుడమి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం