• facebook
  • whatsapp
  • telegram

పొడిబారుతున్న పుడమి

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం

పర్యావరణ సమతౌల్యాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో చిత్తడినేలల ప్రాధాన్యం ఎనలేనిది. సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఎల్లప్పుడూ లేదా ఏడాదిలో ఎక్కువకాలం నీరు నిలిచి ఉండే ప్రాంతాలనే చిత్తడి నేలలంటారు. ఇందులో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పరచినవి కొన్నయితే- మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడినవి మరికొన్ని. ప్రపంచవ్యాప్తంగా 40శాతానికి పైగా జీవజాతులకు ఈ నేలలు ఆవాస స్థానాలు. పర్యావరణ పరిరక్షణలో చిత్తడి నేలలు పోషించే పాత్రపై మానవాళికి అవగాహన పెంచేందుకు, 1971 ఫిబ్రవరి రెండో తేదీన ఇరాన్‌లోని రామ్సర్‌లో సదస్సు జరిగింది. ఏటా చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించాలని భావించారు. తొలిసారిగా 1997 ఫిబ్రవరి రెండో తేదీన ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని జరిపారు. సహజమైన చిత్తడినేలలు మొక్కలకు, జలచరాలకు ఆవాసాలుగా ఉన్నాయి. పెద్ద మొత్తంలో తమలో నీటిని నిలుపుకొని, క్రమానుగతంగా నెమ్మదిగా ఆ నీటిని విడుదల చెయ్యడం ద్వారా, భూగర్భజలాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. జీవజాలానికి సంతానోత్పత్తి కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి. నీటి శుద్ధీకరణ, నీటి నియంత్రణ, జీవవైవిధ్యానికి ఇవి దోహదం చేస్తాయని ఐక్యరాజ్యసమితి చిత్తడినేలలను అభివర్ణించింది.

మానవ కార్యకలాపాలతో అనర్థం

రామ్సర్‌ సదస్సు 50వ వార్షికోత్సవం సందర్భంగా 2021 డిసెంబరు 15న ‘గ్లోబల్‌ వెట్‌ల్యాండ్‌ ఔట్‌లుక్‌’ ప్రత్యేక నివేదిక ప్రపంచవ్యాప్తంగా చిత్తడినేలల అస్తిత్వం ఆందోళనకరంగా ఉందని తెలిపింది. 1970 నుంచి 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా 35శాతం చిత్తడినేలలు కనుమరుగైపోయాయి. మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే చిత్తడి నేలలు (వరి పొలాలు వంటివి) మాత్రం 233శాతం పెరిగాయి. అయితే సహజసిద్దంగా ప్రకృతి ఏర్పరచిన చిత్తడి నేలలు మాత్రం ఏడాదికి 0.78శాతం చొప్పున... అంటే అడవుల కంటే మూడు రెట్లు వేగంగా మాయమైపోతున్నాయి. ఈ క్షీణత ఎక్కువగా భూవినియోగ మార్పు వల్లే సంభవిస్తోందనేది నివేదిక సారాంశం. వాతావరణ మార్పులు, ఆధునిక రసాయనిక వ్యవసాయ విధానాలు ఈ నేలల క్షీణతకు కారణమవుతున్నాయి. చిత్తడి నేలలను కాపాడుకోవాలంటే ముందుగా విశ్వవ్యాప్తంగా ప్రజలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ఊహించిన దానికంటే వేగంగా చిత్తడినేలలపై ప్రభావం చూపిస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టం పెరుగుదల వల్ల ఏర్పడుతున్న తీరప్రాంతాల కోత... చిత్తడినేలల స్వభావాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో జీవవైవిధ్యం, ఆహారోత్పత్తి, స్థానికుల జీవనోపాధి దెబ్బతింటాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావం మధ్యధరా ప్రాంత చిత్తడినేలలపై ఎక్కువగా కనిపిస్తుందని, వేడిగాలులు, తుపానులు, కరవులతో ఈ ప్రాంతం అల్లాడుతుందని నివేదిక పేర్కొంది.

భారత భూభాగంలో సుమారు 153 లక్షల హెక్టార్లలో చిత్తడినేలలు ఆవరించి ఉన్నాయి. మొత్తం భూభాగంలో ఇది 4.7శాతం. మనదేశంలో చిత్తడినేలలకు నగరీకరణ, తీర ప్రాంతాల కోత పెనుముప్పుగా పరిణమించాయి. ఇప్పటికే గడిచిన నాలుగు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సహజమైన చిత్తడినేలల్లో సింహభాగం మాయమైపోయాయని పలు నివేదికల సారాంశం. ముంబయి, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల ఎదుగుదలలో వీటి పాత్ర కీలకం. అయితే ఆయా నగరాలు పెరుగుతున్న కొద్దీ ఈ నేలలు కనుమరుగైపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిరుడు విడుదల చేసిన నివేదికలో 1970 నుంచి 2014 వరకు ముంబయి 71శాతం చిత్తడినేలలను కోల్పోయింది. తరువాతి స్థానాల్లో అహ్మదాబాద్‌ (57శాతం), బెంగళూరు (56శాతం), హైదరాబాద్‌ (55శాతం) నగరాలు ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ 38శాతం తడి నేలలను కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొల్లేరు గణనీయంగా కుదించుకుపోయింది.

ప్రజాభాగస్వామ్యం కీలకం

ఉష్ణమండల వర్షారణ్యాల కంటే మడ అడవులు వంటి తీరప్రాంత చిత్తడినేలలు 55 రెట్లు ఎక్కువగా కర్బన ఉద్గారాలను సంగ్రహిస్తాయి. భూమ్మీద మూడు శాతంగా ఉన్న ‘పీట్‌ల్యాండ్స్‌(కుళ్లిపోతున్న వృక్ష పదార్థాలతో కూడిన తడినేలలు)’ను 2030కల్లా కనీసం 50శాతమైనా పునరుద్ధరించాలని గ్లోబల్‌ వెట్‌ల్యాండ్‌ అవుట్‌లుక్‌ నివేదిక సూచించింది. సమగ్ర నీటి నిర్వహణ విధానాలతో పర్యావరణ సంబంధిత నీటి ప్రవాహాలను స్వేచ్ఛగా ప్రవహింపజేయాలి. కాలుష్యాన్ని నియంత్రించాలి. స్వచ్ఛజలాల్లోకి కాలుష్యకారకాలు ప్రవేశించకుండా అడ్డుకోవాలి. చిత్తడి నేలల ఆక్రమణ, వాటి స్వభావాల మార్పును నిరోధించాలి... ఈ తరహా చర్యల ద్వారా తడి నేలలను సంరక్షించుకోవచ్చని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ‘చిత్తడి నేలల విలువపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. వాటి పరిరక్షణ, కోల్పోయిన ప్రాంతాల పునరుద్ధరణలో ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే అత్యంత విలువైన ఈ పర్యావరణ వ్యవస్థలను మనం సంరక్షించుకోగలం. ఇప్పుడు కావాల్సింది కేవలం నినాదాలు కాదు బలమైన, సామూహిక పరిరక్షణ చర్యలే’ అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఆ దిశగా ముందడుగు వేయాల్సిన బాధ్యత ఇప్పుడు అందరిమీదా ఉంది.

- గొడవర్తి శ్రీనివాసు
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రహస్యాల అన్వేషణలో కీలక అడుగు

‣ ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు

‣ భద్రతా విధానంలోనూ పెడపోకడే

‣ యెమెన్‌లో ఆరని రావణకాష్ఠం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-02-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం