• facebook
  • whatsapp
  • telegram

రహస్యాల అన్వేషణలో కీలక అడుగు

నిర్ణీత లక్ష్యాన్ని చేరిన జేమ్స్‌వెబ్‌ టెలీస్కోపు

అనంతమైన విశ్వంలో మన పాలపుంతకు ఆవల ఇతర గ్రహ వ్యవస్థలు ఉన్నాయా? వాటిపై జీవం జాడలు కనిపిస్తాయా? అసలు మహా విస్ఫోటం (బిగ్‌బ్యాంగ్‌) తరవాత ఏం జరిగింది?... ఇవన్నీ అనాదిగా శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు. వాటికి సమాధానాలు తెలుసుకునే దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు రూపొందించిన జేమ్స్‌వెబ్‌ స్పేస్‌ టెలీస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) నెల రోజుల ప్రయాణం అనంతరం నిర్దేశిత రెండో లగ్రాంజ్‌ పాయింట్‌(ఎల్‌2)ను తాజాగా చేరుకుంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది డిసెంబరు 25న ఫ్రెంచ్‌ గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియాన్‌-5 రాకెట్‌లో జేడబ్ల్యూఎస్‌టీని నింగిలోకి పంపించారు. వాస్తవానికి అక్టోబరులోనే టెలీస్కోపును ప్రయోగించాల్సి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న హబుల్‌ టెలీస్కోపు స్థానంలో జేడబ్ల్యూఎస్‌టీ సేవలు అందించనుంది.

సంక్లిష్ట ప్రక్రియ

దాదాపు 1,380 కోట్ల ఏళ్ల కిందట మహా విస్ఫోటం కారణంగా విశ్వం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ తరవాత పుట్టుకొచ్చిన నక్షత్రాలు, పాలపుంతలు, ఇతర గ్రహాలు, వాటిపై జీవం ఆనవాళ్లు వంటి వాటి గురించి తెలుసుకునేందుకు జేడబ్ల్యూఎస్‌టీ తోడ్పడుతుంది. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావానికి కారణమయ్యే ధూళి మేఘాల లోతులనూ విశ్లేషిస్తుంది. మొత్తంగా విశ్వం పుట్టుకకు కారణమైన పరిస్థితులను దీని ద్వారా అంచనా వేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అందుకే జేడబ్ల్యూఎస్‌టీని టైమ్‌ మెషీన్‌గా, మానవుడు సృష్టించిన మహా అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. జేడబ్ల్యూఎస్‌టీ కార్యక్రమం 1996లోనే ప్రారంభమైంది. తొలుత దాన్ని తరవాతి తరం అంతరిక్ష టెలీస్కోపుగా పిలిచేవారు. 2002 సెప్టెంబరులో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) మాజీ అడ్మినిస్ట్రేటర్‌ జేమ్స్‌వెబ్‌ పేరును పెట్టారు. ఈ టెలీస్కోపు నిర్మాణంలో 14 దేశాలకు చెందిన దాదాపు 10 వేల మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు వేల గంటలు కష్టపడి పనిచేశారు. దాదాపు రూ.75 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన జేడబ్ల్యూఎస్‌టీ అయిదు నుంచి పదేళ్లపాటు సేవలందించనుంది.

విశ్వరహస్యాలపై ఆసక్తి పెరిగిన క్రమంలో రేడియో టెలీస్కోప్‌, ఇన్‌ఫ్రారెడ్‌ టెలీస్కోప్‌ వంటివి పుట్టుకొచ్చాయి. హబుల్‌ టెలీస్కోప్‌ను 1990లో ప్రయోగించారు. దాని వారసురాలిగా జేడబ్ల్యూఎస్‌టీ రంగ ప్రవేశం చేసింది. హబుల్‌తో పోలిస్తే చాలా విషయాల్లో జేడబ్ల్యూఎస్‌టీ మేటిగా నిలుస్తుంది. హబుల్‌ను భూమికి 570 కిలోమీటర్ల ఎత్తులో మోహరించారు. దాని దర్పణం పొడవు 2.4 మీటర్లే. జేమ్స్‌వెబ్‌ టెలీస్కోపు ప్రాథమిక కటకం పొడవు 6.5 మీటర్లు. హబుల్‌లో ఒకటే దర్పణం ఉండగా, జేడబ్ల్యూఎస్‌టీలో షట్కోణాకృతిలో 18 విభాగాలుగా అతి పెద్ద ప్రాథమిక కటకాన్ని తీర్చిదిద్దారు. దాన్ని మడతపెట్టి రాకెట్‌లో ఇమిడ్చే విధంగా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారు. ఆ కటకాలను అత్యంత తక్కువ బరువు కలిగిన బెరీలియంతో రూపొందించారు. అత్యంత బలహీనమైన పరారుణ కిరణాలను ఆకర్షించేందుకు ప్రాథమిక కటకంపై బంగారం పూత పూశారు. జేడబ్ల్యూఎస్‌టీ సుమారు 1,350 కోట్ల సంవత్సరాల పూర్వపు కొత్త పాలపుంతల పుట్టుకను అన్వేషిస్తుంది. హబుల్‌ టెలీస్కోప్‌ 1,250 కోట్ల ఏళ్ల క్రితంనాటి నూతన పాలపుంతల గురించి సమాచారం అందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి

తొలుత జేమ్స్‌వెబ్‌ టెలీస్కోపు నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు కాస్త తేలిగ్గానే భావించారు. ప్రాజెక్టులో ముందుకు వెళ్ళేకొద్దీ అందులోని సంక్లిష్టతలు ఒక్కొక్కటీ తెలిసివచ్చాయి. ఆ క్రమంలో తలెత్తిన నిధుల సమస్యలు తదితరాలను అధిగమించి ఈ బృహత్‌ కార్యక్రమాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు రెండున్నర దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌2 వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణలు తక్కువగా ఉంటాయి. అక్కడ టెలీస్కోపును నియోగిస్తే సూర్యుడు, భూమి, చంద్రుడి నుంచి వచ్చే వెలుగులకు అడ్డుకట్టవేసి, ఎటువంటి ఆటంకాలు లేకుండా విశ్వ రహస్యాలను అన్వేషించవచ్చు. సూర్యకాంతిని నిరోధించడానికి జేడబ్ల్యూఎస్‌టీలో ప్లాస్టిక్‌ను పోలిన కాప్టాన్‌ అనే పదార్థంతో అయిదు పొరల సౌర కవచం ఏర్పాటు చేశారు. దానికి అల్యూమినియం, సిలికాన్‌ పూత పూశారు. ఈ సౌర కవచం 22 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ పొరల గుండా సౌర కాంతి ప్రసరించి, చివరి పొరకు వచ్చేసరికి సహజ శీతల వాతావరణం నెలకొంటుంది. అలా మైనస్‌ 233 డిగ్రీల సెల్సియస్‌లో కటకాలు పనిచేస్తాయి. టెలీస్కోపులో అధునాతన కెమెరాలు, స్పెక్ట్రోమీటర్లను ఏర్పాటు చేశారు. అందులోని మైక్రో షట్టర్‌ 100 పాలపుంతలను ఏకకాలంలో పరిశీలించగలదు. అనాదిగా మానవుణ్ని ఊరిస్తున్న విశ్వ రహస్యాల గురించి జేమ్స్‌వెబ్‌ టెలీస్కోపు ఎలాంటి విశేషాలు చెప్పబోతున్నదోనని ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

- ఎం.అక్షర
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కృత్రిమ మేధతో ఆరోగ్య విప్లవం

‣ స్వశక్తితో అలుపెరుగని ప్రస్థానం

‣ కజకిస్థాన్‌లో ప్రజాందోళనలు

‣ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 28-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం