• facebook
  • whatsapp
  • telegram

కజకిస్థాన్‌లో ప్రజాందోళనలు

నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం

మధ్యాసియాలో సంపన్న దేశమైన కజకిస్థాన్‌లో జరుగుతున్న ఆందోళనలతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆందోళనలపై భద్రతాదళాలు ఉక్కుపాదం మోపడంతో దాదాపు 160 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. జానొవెజెన్‌ నగరంలో గ్యాస్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. కొద్దిరోజుల్లోనే ఆందోళనలు ప్రధాన నగరాలైన ఆల్మాటి, నూర్‌సుల్తాన్‌ తదితర ప్రాంతాలకు వ్యాపించడంతో భద్రతాదళాలు, ప్రదర్శనకారుల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమైనా, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడంలేదు. అల్లర్లను అణచి వేయాలని అధ్యక్షుడు తొకయెవ్‌ సమీకృత భద్రతా ఒప్పంద సంస్థ (సీఎస్‌టీఓ)ను కోరడంతో కూటమిలోని దేశాలనుంచి దాదాపు మూడువేలమంది సైనికులు కజక్‌లో దిగడం సంచలనం సృష్టించింది. ఈ సైనిక బలగాల్లో అత్యధికులు రష్యా సైనికులే! గ్యాస్‌ ధరలను ఏకంగా రెట్టింపు చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘షల్‌కెత్‌’ (వృద్ధ తరం గద్దెదిగాలి) అంటూ నినదించారు. ప్రస్తుతానికి ఆందోళనలు సద్దుమణిగినా భవిష్యత్తులో తిరిగి ఉప్పెనలా ఎగసిపడే అవకాశాలున్నాయి.

చైనా భారీ పెట్టుబడులు

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అనంతరం రిపబ్లిక్‌గా అవతరించిన కజక్‌లో నూర్‌సుల్తాన్‌ నజర్‌బయేవ్‌ పాలన అప్రతిహతంగా కొనసాగింది. దేశాన్ని ఉక్కు పిడికిలితో పాలించిన ఆయన- విపక్షాలను, ప్రజాఉద్యమాలను కఠినంగా అణచివేశారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న తొకయెవ్‌ను అధ్యక్షుడిగా నియమించారు. చమురు నిల్వల కారణంగా కజక్‌ సంపన్న దేశంగా అవతరించింది. కానీ పాలకవర్గం అవినీతి, అక్రమాలతో దేశ ప్రజలు మాత్రం దారిద్య్రంలోనే మగ్గుతున్నారు. చమురుతోపాటు బొగ్గు, యురేనియం తదితర నిల్వలు దేశంలో భారీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో మూడు శాతందాకా కజక్‌లో ఉన్నాయని అంచనా. నూర్‌సుల్తాన్‌ దీర్ఘపాలనలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ఎటువంటి రూపంలోనూ అనుమతించలేదు. చిన్నచిన్న ప్రదర్శనలనూ భద్రతాదళాలు క్రూరంగా అణచివేసేవి. అధ్యక్షుడు తొకయెవ్‌ ఇటీవల జరిగిన ఆందోళనలను తనకు అనుకూలంగా మలచుకున్నారు. నూర్‌సుల్తాన్‌ అనుకూల వర్గానికి చెందిన అనేక మందిని కీలక పదవుల నుంచి తొలగించారు. తద్వారా దేశంపై తనదే తిరుగులేని అధికారమని చెప్పేందుకు యత్నిస్తున్నారు. కజకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలో రష్యన్ల జనాభా అధికంగా ఉంటుంది. అక్కడ ఖనిజ నిక్షేపాలు ఎక్కువ. అందువల్లే రష్యా ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకోవాలని ఆశిస్తోంది. కజక్‌తోపాటు మధ్యాసియాలోని పలు ప్రాంతాలు తమవేవని చైనా వాదిస్తోంది. గతంలో చైనాకు చెందిన ఒక వెబ్‌సైట్‌ డ్రాగన్‌ దేశంలో తిరిగి చేరేందుకు కజక్‌ ఆసక్తిగా ఉందని ఒక కథనాన్ని ప్రచురించింది. దానిపై కజక్‌ విదేశాంగ శాఖ వర్గాలనుంచి తీవ్రంగా స్పందన రావడంతో, ఆ వెబ్‌సైట్‌ తమ ప్రభుత్వ విధానాలను వెల్లడించడంలేదని చైనా ప్రకటించింది. చైనా ప్రతిష్ఠాత్మక బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌లో కజక్‌కు కీలక స్థానం ఉంది. ఐరోపా, చైనాల మధ్య అనుసంధానంగా ఆ దేశం ఉండటంతో 2014నుంచి చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంధనం, రవాణా రంగాల్లో గణనీయంగా చైనా పెట్టుబడులున్నాయి. కజక్‌నుంచి ఇంధనాన్ని చైనా భారీగా దిగుమతి చేసుకుంటోంది. ఐరోపాకు వస్తు రవాణా పరంగా కజకిస్థాన్‌నుంచి వెళ్ళే రైలు మార్గం కీలకం. ప్రస్తుత ఆందోళనల ప్రభావం చైనాపై పడకపోవడంతో ఇరుదేశాల మధ్య సాధారణ స్థితిలోనే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక అవసరాల దృష్ట్యా తొకయెవ్‌ను చైనా సమర్థిస్తోంది. భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఏర్పడితే బీజింగ్‌ జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

భారత్‌ చొరవ తీసుకోవాలి

మధ్యాసియాలోని కజక్‌స్థాన్‌, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ దేశాలతో భారత్‌కు సుదీర్ఘంగా విస్తృతమైన స్నేహ, వాణిజ్య సంబంధాలున్నాయి. అఫ్గాన్‌ సమస్యపై ఆ దేశాలనుంచే మనం వ్యూహరచన చేయాలి. కజక్‌కు భారత్‌ అనేక రకాలుగా సాయం అందించింది. తమ దేశ వనరులపై కన్నేసిన చైనాను నిలువరించేందుకు కజక్‌ ప్రజలు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. కజకిస్థాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా భారత్‌ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యాసియా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఉంది. అక్కడి దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలకు భారత్‌ పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అయితే కరోనా విజృంభణతో వర్చువల్‌గా ఆయా దేశాల నేతలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇరాన్‌ చాబహార్‌ ఓడరేవునుంచి అఫ్గాన్‌తోపాటు మధ్యాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలకు భారత్‌ యత్నిస్తోంది. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం కావడంతో మధ్యాసియా దేశాలతో సంబంధాలను పెంచుకొనేందుకు భారత్‌ దృష్టి సారించాలి.

- కొలకలూరి శ్రీధర్‌
 
******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు

‣ ఓటరు మౌనం... పార్టీల్లో ఉత్కంఠ!

‣ అందరికీ అందని వైద్య సేవలు

‣ ప్రాథమిక హక్కులకే అగ్రాసనం

‣ ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-01-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయం

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం