• facebook
  • whatsapp
  • telegram

యెమెన్‌లో ఆరని రావణకాష్ఠం

ప్రకంపనలు సృష్టిస్తున్న అంతర్యుద్ధం

దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంనుంచి యెమెన్‌ బయటపడే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఆహార ధరల నియంత్రణలో వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి వంటి ఆరోపణలతో ఆ దేశ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్‌ 2012లో పదవీచ్యుతుడయ్యారు. ఆ తరవాత సౌదీ అరేబియా అండతో అధ్యక్ష పీఠమెక్కిన మన్సూర్‌ హాదీ- జిహాదీల దాడులు, దక్షిణాదిన వేర్పాటువాద ఉద్యమం, నిరుద్యోగం వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. ఆ పరిస్థితులను హూతీ (షియా ముస్లింలలో ఒక వర్గమైన జైదీ షియా తెగ) తిరుగుబాటుదారులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇరాన్‌ మద్దతుతో ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని ప్రబల శక్తిగా ఎదిగారు. ఉత్తర యెమెన్‌లో అత్యంత కీలకమైన సదా ప్రావిన్సును 2014లో వాళ్లు ఆక్రమించడంతో అంతర్యుద్ధం మొదలైంది. తిరుగుబాటుదారులు క్రమంగా దక్షిణాది వైపున దేశ రాజధాని సనా సహా అనేక నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దాంతో మన్సూర్‌ హాదీ 2015లో దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ పరిణామాలతో ఆగ్రహించిన సౌదీ- మరో ఎనిమిది దేశాల (ఎక్కువగా సున్నీ ముస్లిం దేశాలే)తో చేతులు కలిపి హూతీ తిరుగుబాటుదారులపై దాడులు ప్రారంభించింది. ఆ సంకీర్ణ బలగాలకు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ అండగా నిలిచాయి. భీకర దాడులతో దక్షిణ యెమెన్‌లోని పలు ప్రాంతాల నుంచి హూతీలను సంకీర్ణ బలగాలు వెనక్కి పంపగలిగినప్పటికీ, సనా సహా మరికొన్ని నగరాల్లో అది సాధ్యం కాలేదు. ఎడతెగని యుద్ధంతో ఇరు పక్షాలకూ భారీగా నష్టం వాటిల్లింది. ఓ దశలో కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడి వంటి ఒప్పందాలు చేసుకున్నా, అవేవీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు.

మొన్నటిదాకా యెమెన్‌లో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొన్నా, ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఉత్తర యెమెన్‌లో ప్రభుత్వ బలగాల అధీనంలో ఉన్న మరీబ్‌ నగరంలో హూతీలు ఇటీవల విధ్వంసం సృష్టించారు. సంకీర్ణ బలగాల్లో సౌదీతో కలిసి సాగుతున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దేశ రాజధాని అబుడాబిలో ఈ నెలలో డ్రోన్‌ దాడులకు తెగబడ్డారు. తాజాగా క్షిపణి దాడులకూ ప్రయత్నించారు. మరోవైపు యెమెన్‌లో సదా ప్రావిన్సులోని ఓ జైలుపై ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో 80 మందికి పైగా మృత్యువాతపడ్డారు. అది సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాల పనేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం యెమెన్‌ అంతర్యుద్ధం కారణంగా 2021 చివరినాటికి 3.77 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాల్లో 60శాతం ఆహారం, ఆరోగ్య సేవల కొరత వంటి పరోక్ష కారణాల వల్ల సంభవించినవే. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) లెక్కల ప్రకారం యెమెన్‌ జనాభాలో దాదాపు 45శాతానికి ఆహార భద్రత లేదు. 50 వేల మంది కరవు వంటి పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహార లోపంతో కుదేలవుతున్నారు. అంతర్యుద్ధం కారణంగా దాదాపు 46 లక్షల మంది దేశం విడిచి వెళ్ళాల్సి వచ్చింది. మరోవైపు- యెమెన్‌ వ్యవహారం ప్రస్తుతం సౌదీ, ఇరాన్‌ మధ్య ఆధిపత్య పోరు (సున్నీ వర్సెస్‌ షియా)గా మారింది!

యెమెన్‌ సంక్షోభంతో నేరుగా సంబంధం లేకున్నా, అక్కడి పరిణామాలు ఇండియాపైనా ప్రభావం చూపుతున్నాయి. అంతర్యుద్ధం కారణంగా ఆ దేశం నుంచి 2015లో వేలమంది భారతీయులను ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ఇటీవల అబుడాబిలో హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. యెమెన్‌లో సైనిక చర్యలకు దూరంగా ఉండకపోతే యూఏఈ లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని హూతీ అధికార ప్రతినిధి ఇటీవల హెచ్చరించారు. అది భారత్‌కు ఆందోళనకరమే! ఎందుకంటే యూఏఈ జనాభాలో 30శాతం భారతీయులే. ఆ దేశ చమురుశుద్ధి కేంద్రాలు సహా పలు కీలక ప్రాంతాల్లో భారతీయులు పనిచేస్తున్నారు. సౌదీలోనూ భారతీయుల సంఖ్య ఎక్కువే. 2015 నుంచి తమ దేశంపైకి 900 క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని, వాటిని ప్రయోగించింది ఇరాన్‌ మద్దతున్న హూతీలేనని సౌదీ ఇటీవల ప్రకటించింది. ఈ తరుణంలో అటు ఇరాన్‌తో, ఇటు సౌదీ-యూఏఈలతో దౌత్య సంబంధాలను భారత్‌ మెరుగ్గా నెరపాలి. ఆయా దేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయులకు హాని కలగకుండా చూడాలి.

- నవీన్‌ కుమార్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వశక్తితో అలుపెరుగని ప్రస్థానం

‣ కజకిస్థాన్‌లో ప్రజాందోళనలు

‣ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం