• facebook
  • whatsapp
  • telegram

మధ్యాసియాతో బంధం బలోపేతం

భారత్‌ వ్యూహాత్మక అడుగులు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పునరాగమనం- మధ్యాసియాలో రాజకీయ సమీకరణలను ప్రభావితం చేస్తోంది. తాలిబన్లపై పాకిస్థాన్‌, చైనాలకున్న పట్టు ఒక్క భారత్‌కే కాదు- రష్యా, మధ్యాసియా దేశాలకూ కలవరం కలిగిస్తోంది. మధ్యాసియాలోని తజికిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కజక్‌స్థాన్‌ ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగాలు. 1991లో సోవియట్‌ విచ్ఛిన్నం తరవాత అవి స్వతంత్ర దేశాలయ్యాయి. వీటిలో తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌లకు అఫ్గాన్‌తో భూ సరిహద్దు ఉంది. పాక్‌ అండతో తాలిబన్లు తమ భూభాగాల్లోనూ ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఎగదోస్తారని, అఫ్గాన్‌ నుంచి నల్లమందు, హెరాయిన్‌ల అక్రమ రవాణా పెచ్చరిల్లుతుందని మధ్యాసియా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఉగ్రవాదుల అడ్డా...

అఫ్గాన్‌ సరిహద్దు వెంబడి దాదాపు ఆరు వేల మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారని తజికిస్థాన్‌ ఇటీవల వెల్లడించింది. అంతేకాదు- అల్‌ఖైదా, లష్కరే తోయిబా, ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్థాన్‌ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు చెందిన 10,000 మంది విదేశీ మూకలు అఫ్గానిస్థాన్‌లో తిష్ఠ వేయడం మధ్యాసియా దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. కజక్‌స్థాన్‌లో ఇటీవల జరిగిన హింసాయుత ఘటనల వెనక పాక్‌, తుర్క్‌మెనిస్థాన్‌, అఫ్గాన్‌ ఉగ్రవాద సంస్థల హస్తం ఉంది. ఈ సందర్భంగా అఫ్గాన్‌ జనాభాలో వివిధ జాతుల గురించి ఆకళింపు చేసుకోవలసి ఉంది. అఫ్గాన్‌ జనాభాలో పష్తూన్‌ తెగవారు 42శాతం దాకా ఉంటారు. తాలిబన్లు, వారి నాయకులు ప్రధానంగా ఈ తెగకు చెందినవారే. 27శాతం అఫ్గాన్లు తజిక్‌ తెగకు చెందినవారైతే- ఉజ్బెక్కులు తొమ్మిది శాతం, హజారాలు ఎనిమిది శాతం చొప్పున ఉంటారని అంచనా. 1996లో తాలిబన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వారిని ప్రతిఘటించిన ఉత్తరాది కూటమికి రష్యా, ఇరాన్‌లతోపాటు తజికిస్థాన్‌ సైతం మద్దతు ఇచ్చింది. ఆ కూటమి ప్రధానంగా అఫ్గానీ తజిక్కులు, ఉజ్బెక్కులు, హజారాలతో ఏర్పడినది. నిరుడు తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కొద్దికాలం పాటు తిరిగి ఉత్తరాది కూటమి నుంచి ప్రతిఘటన ఎదురైంది. కూటమి నాయకుల్లో ఒకరైన మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే ప్రస్తుతం తజికిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉగ్రవాద ముప్పును దృష్టిలో పెట్టుకుని భారత్‌, తజికిస్థాన్‌  2012 లోనే సైనిక వ్యూహపరమైన భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిరుడు ఆగస్టులో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడి భారతీయులను భద్రంగా తరలించడానికి తజికిస్థాన్‌ సాయపడిందని జనవరి 27న అయిదు మధ్యాసియా దేశాల అధినేతలతో జరిపిన వర్చువల్‌ సభలో ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభ అఫ్గానిస్థాన్‌తో పాటు చాబహార్‌ రేవు మీద కూడా సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దీన్నిబట్టి భద్రతతో పాటు ఆర్థిక సంబంధాలకూ భారత్‌, మధ్యాసియా దేశాలు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో అర్థమవుతుంది. సముద్ర తీరమే లేని మధ్యాసియా దేశాలు తమ ఆర్థికాభివృద్ధికి భారత్‌, ఇరాన్‌లు ఎంతగానో తోడ్పడతాయని గుర్తించాయి. 1991 నుంచే పీవీ నరసింహారావు ప్రభుత్వం మధ్యాసియా దేశాలతో ఆర్థిక సంబంధాల వృద్ధికి కృషి ప్రారంభించింది. కానీ, భారతీయ సరకులు భూమార్గంలో మధ్యాసియాకు చేరాలంటే పాక్‌, అఫ్గాన్‌ల మీదుగానే రవాణా కావాలి. అందుకు అవకాశం ఇవ్వకుండా పాకిస్థాన్‌ సైంధవుడిలా అడ్డుపడింది. దీనికి తెరవెనక నుంచి వత్తాసు ఇచ్చిన చైనా తనవరకు తాను మధ్యాసియాలో ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం’ ద్వారా ఆర్థికంగా పాగా వేసింది. చైనా-మధ్యాసియాల మధ్య నేడు 4,100 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. దీన్ని 2030కల్లా రెట్టింపు చేయాలని చైనా లక్షిస్తోంది. భూమార్గ వాణిజ్యానికి పాక్‌ మోకాలడ్డటంతో మధ్యాసియాతో భారత్‌ వాణిజ్యం 200 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఇరాన్‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న చాబహార్‌ రేవు ద్వారా మధ్యాసియాకు ఎగుమతి దిగుమతులను పెంచాలని భారత్‌ ఆశిస్తున్నా అమెరికా ఆంక్షలు విధిస్తుందేమోనన్న ఆందోళన వెన్నాడుతోంది. బందర్‌ అబ్బాస్‌ రేవు నుంచి మధ్యాసియా వరకు రష్యా, ఇరాన్‌లు నిర్మిస్తున్న అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌ గుండా సరకులు ఎగుమతి చేయాలన్నా, ఆ కారిడార్‌ ఇంకా పూర్తికాలేదు.

పాక్‌ అడ్డంకులు

తుర్క్‌మెనిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌- ఇండియా (టాపి) గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రతిపాదన వచ్చినా పాక్‌తో ఉద్రిక్తతల వల్ల ‘టాపి’పై భారత్‌ ఉత్సుకత చూపడం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌-మధ్యాసియా సహకార వృద్ధికి వర్చువల్‌ సభ గట్టిగా ప్రయత్నించింది. భారత్‌-మధ్యాసియా సెక్రటేరియట్‌ను ఏర్పరచి విదేశాంగ, వాణిజ్య, సాంస్కృతిక స్థాయుల్లో ఏటా మంత్రుల సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది. మధ్యాసియాలో చమురు, సహజవాయువు, యురేనియం, మరి ఇతర ఖనిజ నిక్షేపాలున్నాయి. కజక్‌స్థాన్‌ భారత్‌ ఇంధన అవసరాలను తీర్చగలదు. తుర్క్‌మెనిస్థాన్‌లో ప్రపంచంలోనే నాలుగో పెద్ద సహజవాయు నిక్షేపాలున్నాయి. దీంతోపాటు ఉజ్బెకిస్థాన్‌ కూడా భారత్‌తో భద్రతా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు కోట్లకు పైగా జనాభా ఉన్న మధ్యాసియా దేశాల్లో భారతీయ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ లభిస్తుంది. ఈ దేశాల్లో భారతీయ వంటకాలు, సినిమాలు, యోగా, నృత్య-సంగీతాలకు ఇప్పటికే అమిత జనాదరణ ఉంది. కానీ, భారతీయ ఎగుమతులు మధ్యాసియాకు చేరడానికి పాక్‌ వల్ల అడ్డంకులు ఎదురవుతుంటే, చైనా ఎంచక్కా భూమార్గంలో వాణిజ్యాన్ని వృద్ధి చేసుకొంటోంది. చైనా ప్రభావం పోనుపోను పెరిగిపోవడం చూసి మధ్యాసియా దేశాలు భారత్‌ను ఆష్కబాత్‌ ఒప్పందంలోకి ఆహ్వానించాయి. దీనివల్ల మధ్యాసియాలోకి భారతీయ సరకులు చేరడం కొంత సులువు అవుతుంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి రష్యా సైతం భారత్‌ ప్రవేశాన్ని ఆకాంక్షిస్తోంది. దీనికి భారత్‌-మధ్యాసియా వర్చువల్‌ సభ గట్టి పునాది వేసింది.

బలపడుతున్న రక్షణ భాగస్వామ్యం

పాకిస్థాన్‌ ఉసిగొల్పుతున్న తాలిబన్‌ ఉగ్రవాద మూకలు తమ దేశాల్లో విధ్వంసం సృష్టించవచ్చనే అనుమానాలు మధ్యాసియా దేశాల్లో బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిరుడు నవంబరులో భారత్‌, రష్యా, ఇరాన్‌, మధ్యాసియా దేశాల జాతీయ భద్రతా సలహాదారులు దిల్లీలో సమావేశమై చర్చించారు. గత డిసెంబరులో మధ్యాసియా దేశాల విదేశాంగ మంత్రులు దిల్లీ వచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన మధ్యాసియా దేశాల సభలో- ఇక నుంచి రెండేళ్లకు ఒకసారి భారత్‌- మధ్యాసియా శిఖరాగ్ర సభ నిర్వహించాలని నిశ్చయించారు. భారత్‌, మధ్యాసియా దేశాల మధ్య ఇప్పటికే నెలకొని ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని, ఉమ్మడిగా ఉగ్రవాద నిరోధ సైనిక అభ్యాసాలు జరపాలని సభలో పాల్గొన్న ఆరుగురు దేశాధినేతలు నిర్ణయించారు. ఉగ్రవాద రహిత ప్రపంచాన్ని ఆకాంక్షిస్తున్నారు. తదనుగుణంగా అఫ్గానిస్థాన్‌ మీద సీనియర్‌ అధికారుల స్థాయిలో ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

- ఏఏవీ ప్రసాద్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక సంస్కరణలతో లాభపడిందెవరు?

‣ జీవవైవిధ్యానికి పెనుముప్పు

‣ గిట్టుబాటుకాని మద్దతుధర

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-02-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం