• facebook
  • whatsapp
  • telegram

గిట్టుబాటుకాని మద్దతుధర

చేయూతనిస్తేనే రైతుకు మేలు

దేశానికి ఆహార భద్రతను సాధించేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధరలు కీలకం. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించడానికి 1964లో లాల్‌ బహదూర్‌ శాస్త్రి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాటి కేంద్ర కార్యదర్శి ఎల్‌.కె.ఝా నేతృత్వంలో కేంద్రం ఆహార ధాన్యాల ధరల సంఘాన్ని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు 1965లో పంటలకు ధరలు నిర్ణయించేందుకు వ్యవసాయ ధరల కమిషన్‌, ప్రభుత్వం తరఫున పంటలను సేకరించేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లను ఏర్పాటు చేశారు. పంట పండించిన తరవాత ధరలు పడిపోతే రైతులు నష్టపోకుండా చూసేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రజలకు అవసరమైన పంటలు పండించేలా కర్షకుల్ని ప్రోత్సహించడం ఇందులో భాగం. అయితే, ప్రస్తుతం దేశంలో 51 రకాల పంటలు పండుతున్నా 23 రకాలకు మాత్రమే కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తోంది. 2014లో భాజపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల అమలుపై 2015 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సమాధానంగా పంటల పెట్టుబడిపై అదనంగా 50 శాతం అధికంగా కనీస మద్దతు ధరలు పెంచడం సాధ్యం కాదని కేంద్రం ప్రమాణపత్రం దాఖలు చేసింది. రెండోసారి 2019 ఎన్నికలకు వెళ్లే ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ‘ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం’ సమావేశంలో నిర్ణయం తీసుకుని, సొంత ఫార్ములాను అనుకరిస్తూ- స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, తాను సూచించిన విధానం ప్రకారం కేంద్రం పంటలకు మద్దతు ధరలను నిర్ణయించడం లేదని స్వయంగా స్వామినాథన్‌ పలుమార్లు వెల్లడించడం గమనార్హం. 

సిఫార్సులు ఇలా...

2004 నవంబరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం వ్యవసాయం లాభసాటిగా ఉండాలని, రైతులకు కనీస మద్దతు ధరలు దక్కేలా అధ్యయనం చేసి, సూచనలు చేయాల్సిందిగా స్వామినాథన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2006 అక్టోబరులో నివేదిక ఇచ్చింది. స్వామినాథన్‌ కమిటీ పంట ఉత్పత్తులకు వాస్తవంగా అయ్యే ఖర్చును గణించడానికి ఆరు ఫార్ములాలను సిఫారసు చేసి దానిపై 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర ఉండాలని పేర్కొంది. స్వామినాథన్‌ కమిటీ ఏ1 ఫార్ములా ప్రకారం- రైతు సాగుకైన ఖర్చులు, మానవశ్రమ, సొంత, అద్దెకు తీసుకునే యంత్రాలు, సొంత, ఖరీదు చేసిన విత్తనాలు, పురుగు మందులు, సొంత, ఖరీదు చేసిన ఎరువులకయ్యే విలువలు, సాగునీటికయ్యే ఖర్చు, యంత్రాలు (ట్రాక్టరు వగైరా), భూమి తరుగుదల, మూలధనంపై వడ్డీ, ఇతర పనిముట్ల కూలీ ఖర్చులు, భూమి నిర్వహణ వ్యయాలను గణించారు. ఏ2 ఫార్ములా ప్రకారం- ఏ1, భూమి కౌలు ధరను లెక్కించారు. బీ1 ఫార్ములా ప్రకారం- ఏ1, మూల వస్తువుల విలువపై వడ్డీని పరిగణించారు. బీ2 ఫార్ములా ప్రకారం- బీ1, సొంత భూమిపై అద్దె, లీజు భూమి అద్దె గణించారు. సీ1 ఫార్ములా ప్రకారం- బీ1, కుటుంబ సభ్యుల కూలీ విలువ లెక్కించారు. సీ2 ఫార్ములా ప్రకారం- బీ2, కుటుంబ సభ్యుల కూలీ విలువలు కలపాలి. రైతులకు మద్దతు ధరను నిర్ణయించడానికి సీ2+50 ఫార్ములాను స్వామినాథన్‌ కమిటీ సిఫారసు చేసింది.

యూపీఏ ప్రభుత్వ హయాములోనే 2013లో మద్దతు ధరల నిర్ణయం కోసం రమేష్‌చంద్‌ కమిటీనీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 2015లో నివేదిక సమర్పించింది. రమేష్‌చంద్‌ కమిటీ సీ2+10 శాతం అదనంగా కనీస మద్దతు ధరలు ఉండాలని సూచిస్తూ స్వామినాథన్‌ కమిటీ ఫార్ములాలో కొన్ని మార్పులు చేసింది. స్వామినాథన్‌ సీ2 ఫార్ములాతో పాటు కుటుంబ సభ్యుల శ్రమను నైపుణ్య కార్మిక విలువగా పరిగణించాలని, మూలధనంపై వడ్డీని పూర్తి పంటకాలానికి లెక్కించాలని, భూమి లీజు విలువను మార్కెట్‌ రేటును బట్టి లెక్కించాలని, దేశానికంతటికీ ఒకే మద్దతు ధర సరికాదని, పంట పండిన తరవాత శుద్ధి చేయడం, మార్కెట్‌కు తరలించడం, ఆరబెట్టడం, రవాణా ఖర్చులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం వీరి సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ2+50ని మాత్రమే కనీస మద్దతు ధర గణనకు ప్రామాణికంగా తీసుకున్నది. వాస్తవానికి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయకున్నా, చేస్తున్నట్లు నమ్మబలుకుతోంది.

సాగుపై చిన్నచూపు

వరి ధాన్యానికి మద్దతు ధరను రూ.1,888గా 2020-21లో ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిందేమిటంటే- స్వామినాథన్‌ కమిటీ సీ2+50 ఫార్ములా ప్రకారం వరి ధాన్యం క్వింటాలు ధర రూ.2,501, రమేష్‌చంద్‌ కమిటీ సీ2+10 ప్రకారం రూ.2,285 ఉండాలి. రమేష్‌చంద్‌ కమిటీ ఫార్ములాను సీ2+50గా లెక్కిస్తే రూ.3,116 ఉండాలి. ఈ లెక్కల ప్రకారం స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను యథావిధిగా అమలు చేస్తే రైతులకు ఎంతో అదనపు లబ్ధి చేకూరేది. మరోవైపు, 2014కు ముందు కనీస మద్దతు ధరల పెంపు ఒక్క వరి ధాన్యానికే తీసుకుంటే, 2007-08లో క్వింటాలుకు రూ.645 కనీస మద్దతు ధర ఉండగా 2013-14 నాటికి రూ.1,310కి చేరుకుని 103 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. 2014 నుంచి 2021 నాటికి రూ.1,940కి పెరిగింది. ఈ ఏడేళ్లు కేవలం 48.09 శాతం పెరుగుదల మాత్రమే నమోదు కావడం గమనార్హం. కోట్ల మంది ఆధారపడిన వ్యవసాయాన్ని ఉపాధి చూపే, ప్రజల ఆహార అవసరాలు తీర్చే రంగంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఎన్‌డీఏ సర్కారు అలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనే ఆశ, నమ్మకం కలగడం లేదు. వ్యవసాయం లాభసాటి కాదని, దానిపై పెట్టే పెట్టుబడులు, ఇచ్చే రాయితీలు నిరర్థకమని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ చర్యలద్వారా అనిపిస్తోంది.

మిగతా పంటలకు అంతంతే!

గడచిన ఏడేళ్లలో పెరిగిన పెట్టుబడి ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే- కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కావు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి, పెంచిన మద్దతు ధరలకు పొంతన కుదరడం లేదు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తున్నా, ప్రధాన పంటలైన వరి, గోధుమల నుంచి 21-25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండిన మిగతా పంటలలో 10 శాతానికే కనీస మద్దతు ధర లభిస్తోంది. ఇతర ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో దళారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వరి, గోధుమలకు మినహా మిగతా పంటలకు ప్రణాళికాబద్ధంగా కేంద్రం ప్రోత్సాహం అందించడంలేదు. రైతులకు మేలు జరగకపోగా- దేశంలో పప్పులు, నూనెగింజల కొరత ఏర్పడి అనివార్యంగా దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు

‣ భద్రతా విధానంలోనూ పెడపోకడే

‣ యెమెన్‌లో ఆరని రావణకాష్ఠం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 28-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం