• facebook
  • whatsapp
  • telegram

ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!



కొంతకాలంగా కొద్దిపాటి వర్షాలకు సైతం దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకొంటున్నాయి. రహదారులపై భారీగా నీళ్లు నిలుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. నదీ తీరాలతో పాటు చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమణకు గురికావడంవల్లే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు పర్యావరణవేత్తలు అంటున్నారు.


వాతావరణ మార్పులకు తోడు మానవ చర్యల కారణంగా భారత్‌లో వరదలు సర్వసాధారణంగా మారాయి. గురుగ్రామ్‌, నొయిడా, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలు ఈ ఏడాదిలో ముంపునకు గురయ్యాయి. ఏటా దేశంలో అనేక చోట్ల ఈ పరిస్థితి కనిపిస్తూనే ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికారహితంగా సాగుతున్నాయి. జలవనరులను ధ్వంసం చేసి, వాటిని ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. దాంతో వాన నీరు పారేందుకు వీలులేక ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. నదులు, చెరువులు, కుంటలు, వాగులను పునరుద్ధరించుకోవడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.


కాంక్రీటు నిర్మాణాలు

మన దేశం అనేక నదీవ్యవస్థలతో విలసిల్లుతోంది. భారీ నీటి ప్రవాహాలతో లక్షల కిలోమీటర్ల మేర విస్తరించిన పెద్ద నదులతో పాటు ఉప నదులు, చిన్న నదులు కలిపి వందల సంఖ్యలో ఉన్నాయి. నాగరికతకు, సంస్కృతికి అద్దంపట్టే ఈ నదీతీరాల వెంబడి అనేక నగరాలు, పట్టణాలు వెలశాయి. ఇవి విస్తరిస్తున్నకొద్దీ నదుల విస్తీర్ణం కుంచించుకుపోతోంది. ఒకప్పుడు నదీతీరాలు విశాలంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కాంక్రీటు నిర్మాణాలతో నిండిపోయాయి. రాజధాని దిల్లీ సహా అనేక నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దా చిన్నా తేడా లేకుండా అన్ని నదీవ్యవస్థలకూ ఆక్రమణల చెర తప్పడంలేదు. దేశంలో చిన్న నదీవ్యవస్థలు క్షీణించడం- చుట్టుపక్కల నగరాల్లో జీవనోపాధికి భారీ సవాళ్లు విసరనుందని 2015 నాటి పరిశోధన ఒకటి హెచ్చరించింది. ప్రభుత్వాలు కాలుష్య నివారణ కార్యక్రమాలను గంగ, యమున వంటి పెద్ద నదులకే పరిమితం చేస్తున్నాయని, చిన్న నదుల సంగతిని పట్టించుకోవడంలేదని అది విశ్లేషించింది. గువాహటి వద్ద ప్రవహించే భరాలీ, బహినీ... వారణాసి గుండా వెళ్ళే వరుణ, అస్సీ... పుణె వద్ద ప్రవహించే ములా తదితర నదుల పరిరక్షణకు, వాటి పునరుద్ధరణకు ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదన్న వాస్తవాన్ని ఆ నివేదిక ఉదాహరించింది.


పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, చెత్తను వేయడంవల్ల నదీగర్భాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. గతంలో జీవధారలతో అలరారిన ఎన్నో నదులు నేడు చిన్నపాటి మురుగు కాలువలుగా దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు చెన్నై మహానగర దాహార్తి తీర్చిన కూవం, హైదరాబాద్‌కు భాగ్యదాతగా నిలిచిన మూసీ, బెంగళూరుకు సొగసులద్దిన వృషభావతి నేడు మురుగు కాలువలుగా, దుర్గంధభరితంగా మారిపోయాయి. ఏపీలోని తుల్యభాగ, గోస్తని తదితర నదులదీ ఇదే దుస్థితి. కొద్దిరోజుల కిందట ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో పెద్ద సంఖ్యలో కార్లు హిండన్‌ నది వరదలకు మునిగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. సాహిబీ నది పోటెత్తడంతో దిల్లీ-జైపుర్‌ జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహించింది. నదీ స్థలంలో రహదారిని నిర్మించినా భారీ వానలకు వచ్చిన ప్రవాహం తన స్థానాన్ని మరచిపోలేదని పర్యావరణవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. సాహిబీ నదీ తీరాన అంకురించిన గురుగ్రామ్‌ ప్రస్థానం ఇప్పుడు ఆ నదే కనుమరుగయ్యేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా అనేక నదుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.


ప్రత్యేక చట్టాలు అవసరం

నదులు, జలాశయాల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలదేనని కేరళ హైకోర్టు 2020లో స్పష్టం చేసింది. స్థానిక సంస్థల్లో సహజంగా ఉండే అధికార జోక్యం, నిధుల లేమి ఈ బాధ్యతను పూర్తిగా విస్మరించేలా చేస్తున్నాయి. చిన్న నదుల పునరుజ్జీవానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. ఆక్రమణల తొలగింపు, ఇసుక తవ్వకాల నిలిపివేత, వ్యర్థాలను అడ్డుకోవడం ద్వారా నదీ గమనాన్ని పునరుద్ధరించవచ్చు. నదులు స్వేచ్ఛగా ప్రవహించేందుకు అమెరికా వంటి దేశాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఇందుకు స్వేచ్ఛా ప్రవాహ విధానాలను అనుసరిస్తున్నాయి. మన దేశంలోనూ ఇటువంటి విధానాలు, చట్టాలు అవసరం. చిన్న నదులను పునరుద్ధరించుకుంటే ముంపు సమస్య పరిష్కారం కావడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరతకు ఇబ్బంది ఉండదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.


- గొడవర్తి శ్రీనివాసు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతుకు మేలు చేసేదే సరైన విధానం

‣ అన్నదాతకు అండగా కిసాన్‌ కేంద్రాలు

‣ భావి తరాలకు బంగారు భవిష్యత్తు

‣ తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రత

Posted Date: 12-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం