• facebook
  • whatsapp
  • telegram

అణు విద్యుదుత్పత్తి వైపు అడుగులు



భూతాపాన్ని పెంచే బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల నుంచి భారత్‌ పునరుత్పాదక సౌర, పవన వనరుల వైపు మళ్ళుతోంది. అణు విద్యుత్‌ పునరుత్పాదక వనరు కాదు. అయినా, 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థతను సాధించడానికి అది తోడ్పడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలో అణువిద్యుదుత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది.


భారత్‌ 2030కల్లా తన విద్యుత్‌ అవసరాల్లో 50 శాతాన్ని పునరుత్పాదక, హరిత ఇంధనాల ద్వారా తీర్చుకోవాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నాటికి పునరుత్పాదక ఇంధన వనరులతో ఇండియా 172 గిగావాట్ల విద్యుదుత్పాదక సామర్థ్యాన్ని సాధించింది. అప్పటికి భారతదేశ మొత్తం విద్యుదుత్పాదన సామర్థ్యం 416 గిగావాట్లు. 2030కల్లా కేవలం పునరుత్పాదక ఇంధనాలతోనే 500 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సౌర కాంతి రాత్రిపూట అందుబాటులో ఉండదు. పవన విద్యుదుత్పాదనా ఎల్లప్పుడూ సాధ్యపడదు. అణు విద్యుత్తుకు అలాంటి పరిమితులు ఉండవు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భారత అణు విద్యుదుత్పాదన సామర్థ్యం 6.78 గిగావాట్లు. 2030కల్లా దీన్ని 22 గిగావాట్లకు పెంచాలని కేంద్రం నిశ్చయించింది. దీన్ని సాధిస్తే అమెరికా, ఫ్రాన్స్‌ల తరవాత ప్రపంచంలో మూడో అతిపెద్ద అణు విద్యుత్‌ ఉత్పత్తిదారుగా భారత్‌ నిలుస్తుంది. ఈ లక్ష్య సాధనకు అణు విద్యుత్‌ కేంద్రాల విస్తరణను వేగవంతం చేస్తోంది.


కెనడా తొలి అడుగు

భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి 700 మెగావాట్ల అణు రియాక్టర్‌ గత నెలలో గుజరాత్‌లోని కాక్రాపార్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించింది. అది 90శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. భారత అణు విద్యుత్తు సంస్థ (ఎన్‌పీసీఐఎల్‌) రూపొందించిన ఈ రియాక్టర్‌ను అధిక పీడన భారజల రియాక్టర్‌ (పీహెచ్‌డబ్ల్యూఆర్‌)గా వర్గీకరిస్తున్నారు. కాక్రపార్‌లో ఇప్పటికే రెండు 220 మెగావాట్ల పీహెచ్‌డబ్ల్యూఆర్‌ రియాక్టర్లు ఉన్నాయి. మరో 700 మెగావాట్ల పీహెచ్‌డబ్ల్యూఆర్‌ రియాక్టర్‌ నిర్మాణం త్వరలో పూర్తవుతుంది. 2031 కల్లా 16 పీహెచ్‌డబ్ల్యూఆర్‌ రియాక్టర్లను నెలకొల్పాలని ఇండియా లక్షిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌లోని రావత్‌భాటాలో రెండు, హరియాణాలోని గోరఖ్‌పుర్‌లో మరో రెండు 700 మెగావాట్ల అణు రియాక్టర్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని చుట్కా, కర్ణాటకలోని కైగా, రాజస్థాన్‌లోని మాహి బాన్స్‌వాడాలోనూ ఈ తరహా రియాక్టర్లను నెలకొల్పుతారు.


కెనడా తొలిసారిగా అధిక పీడన భారజల రియాక్టర్‌ను రూపొందించి విద్యుదుత్పాదనకు వినియోగించింది. ఈ పరిజ్ఞానాన్ని కెనడా 1960ల్లో భారత్‌కు అందించింది. దానితోపాటు కెనడా సరఫరా చేసిన పరికరాలతో రాజస్థాన్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో రెండు 220 మెగావాట్ల అధిక పీడన భారజల రియాక్టర్లను నిర్మించారు. 1974లో భారత్‌ పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిన తరవాత కెనడా అణు రంగంలో భారత్‌కు సహకరించడం మానేసింది. అప్పటి నుంచి భారతీయ శాస్త్రజ్ఞులు సొంతంగా అధిక పీడన భారజల రియాక్టర్ల తయారీని చేపట్టి, వివిధ అణు కేంద్రాల్లో వాటిని అమర్చి సత్తా చాటుకున్నారు. 220 మెగావాట్లతో మొదలుపెట్టి 540 మెగావాట్లు, ఇప్పుడు 700 మెగావాట్ల రియాక్టర్ల తయారీకి చేరుకున్నారు. ఇకపై 900 మెగావాట్ల అధిక పీడన భారజల అణు రియాక్టర్ల తయారీకి భారతీయ శాస్త్రజ్ఞులు నడుంకట్టారు. వాటితోపాటు రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచీ అణు రియాక్టర్లను భారత్‌ సమకూర్చుకొంటోంది.


భరోసా నింపితేనే..

తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలో రష్యా అందించిన నాలుగు భారీ వెయ్యి మెగావాట్ల రియాక్టర్ల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. తమిళనాడులోనే కల్పాక్కం అణు విద్యుత్‌ కేంద్రంలో 500 మెగావాట్ల ఫాస్ట్‌ బ్రీడర్‌ నమూనా రియాక్టర్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ యురేనియాన్ని పునర్వినియోగార్హ ప్లుటోనియం ఇంధనంగా మారుస్తుంది. అందువల్ల అణు ఇంధన కొరత ఉండదు. భారత్‌లో పుష్కలంగా దొరికే థోరియం నిల్వలతో అణు విద్యుదుత్పాదన సాధించాలని కేంద్రం లక్షిస్తోంది. అధిక పీడన భారజల రియాక్టర్లు ఎంతో సురక్షితమైనవని నిపుణులు చెబుతున్నారు. అయితే, అణువిద్యుత్‌ పరంగా ప్రజల్లో ఎన్నో భయాలు నెలకొన్నాయి. గతంలో జపాన్‌లోని ఫుకుషిమా దైచీ అణువిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన నేటికీ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే వ్యర్థాల వల్ల నీరు కలుషితమై తమ జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని గతంలో మత్స్యకారులు పెద్దయెత్తున ఉద్యమించారు. అణువిద్యుత్‌ కేంద్రాల వల్ల రేడియేషన్‌ సమస్య పెచ్చరిల్లుతుందన్న ఆందోళనా ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో ప్రజలకు, స్థానిక వనరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటులో కేంద్రం పటిష్ఠ జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి భద్రతపై ప్రజల్లో భరోసా నింపాలి.


- ఆర్య
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇరాక్‌తో ఇండియా చమురు బంధం

‣ జనవిశ్వాస్‌.. తగ్గనున్న కేసుల భారం

‣ ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!

‣ రైతుకు మేలు చేసేదే సరైన విధానం

‣ అన్నదాతకు అండగా కిసాన్‌ కేంద్రాలు

‣ భావి తరాలకు బంగారు భవిష్యత్తు

‣ తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రత

Posted Date: 15-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం