• facebook
  • whatsapp
  • telegram

ఏమవుతుంది.. అవిశ్వాసం?


మణిపుర్‌లో హింసాత్మక ఘటనల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పెదవి విప్పాలంటూ విపక్షాలు పట్టుపడుతున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోరుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి తరఫున లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉప నేత గౌరవ్‌ గొగొయ్‌ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. దాంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వేడెక్కాయి. అవిశ్వాస తీర్మానంపై నిన్నటి (మంగళవారం) నుంచి చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ గురువారం సమాధానమిచ్చే అవకాశముంది.


పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగే లోక్‌సభలో మెజారిటీ ఉంటేనే ఏ పార్టీ ప్రభుత్వమైనా మనుగడ సాగిస్తుంది. ఈ దిగువ సభకు మంత్రిమండలి ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని భారత రాజ్యాంగంలోని 75(3) అధికరణ స్పష్టం చేస్తోంది. అయితే, అనేక అంశాలతో కూడిన మంత్రుల ఉమ్మడి బాధ్యత రెండు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి: ప్రధాని సలహా లేకుండా ఏ వ్యక్తీ మంత్రిమండలిలో సభ్యుడు కాలేరు. రెండు: ప్రధానమంత్రి తొలగించాలని సిఫారసు చేసిన తరవాత ఏ సభ్యుడూ మంత్రిమండలిలో కొనసాగలేడు. ప్రభుత్వం ఏదైనా విధానాన్ని తీసుకురాదలచినప్పుడు దానిపై మంత్రిమండలి చర్చిస్తుంది. ఆ దశలో మంత్రి ఎవరైనా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు. ఒకసారి నిర్ణయం జరిగిన తరవాత మంత్రిమండలిలోని ప్రతి సభ్యుడూ దానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉండాల్సిందే. ప్రభుత్వం లోక్‌సభలో విశ్వాసం కోల్పోయిన సందర్భంలోనూ మంత్రిమండలి ఉమ్మడిగా బాధ్యత వహిస్తుంది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం వైదొలగడం (రిజిగ్నేషన్‌), లేదంటే సభ రద్దు కావడం (డిసొల్యూషన్‌) జరుగుతుంది. అయితే, ఇటువంటి పరిస్థితి తలెత్తడానికి ఏ అంశం దారితీస్తుందన్నది కీలకం. చెప్పాలంటే, పాలనా పగ్గాలను వదులుకోవడానికి లేదా సభను రద్దు చేయడానికి ఏ అంశాన్ని ఆధారం చేసుకోవాలన్నది ప్రాథమికంగా నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వమే! అటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేనప్పటికీ, మణిపుర్‌ అంశంపై చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే విపక్ష ఇండియా కూటమి తాజాగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.


చర్చ కోసమే..

నిబంధనల ప్రకారం- ఏయే కారణాలవల్ల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందో స్పీకర్‌కు నోటీసు ఇచ్చిన సభ్యుడు అందులో స్పష్టంగా పేర్కొనాలి. తగినంత మంది సభ్యులు మద్దతు తెలిపితే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానానికి అంగీకరించి దానిపై చర్చకు అనుమతిస్తారు. సాధారణంగా, ఇటువంటి చర్చ నోటీసులో పేర్కొన్న అంశాలకే పరిమితం కావాల్సి ఉన్నప్పటికీ, సభ్యులెవరైనా ఇతర అంశాలను ప్రస్తావించే అవకాశమూ ఉంటుంది. ముఖ్యంగా, అదే సెషన్‌లో ప్రత్యేకంగా చర్చ చేపట్టిన అంశాలతో పాటు- చివరిసారి చర్చించిన అంశాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సైతం ప్రస్తావించవచ్చు. తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన సభ్యుడికి సమాధానం కోరే హక్కు ఉంటుంది. కాబట్టి, సభ్యులు మాట్లాడిన అనంతరం అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు ప్రధానమంత్రి సమాధానమివ్వడం ఆనవాయితీ. ఇందుకు స్పీకర్‌ నిర్దేశిత సమయాన్ని ఆయనకు కేటాయిస్తారు. లోక్‌సభలో విపక్ష కూటమి ‘ఇండియా’ బలం 142. అధికార ఎన్డీయేకు అంతకు రెట్టింపు కంటే అధికంగా 334 మంది సభ్యులున్నారు. సంఖ్యాపరంగా చూస్తే, ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం. ఈ విషయం విపక్షాలకూ తెలుసు. అయితే, మణిపుర్‌ అంశంపై ప్రధాని మోదీతో మాట్లాడించాలన్నదే తమ ఉద్దేశమని; ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా రెండు భావాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము పైచేయి సాధిస్తామని విపక్ష నేతలు అంటున్నారు. సాంకేతికంగా మణిపుర్‌లోని శాంతి భద్రతల అంశం హోంమంత్రి పరిధిలోకి వస్తుంది. కాబట్టి, చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకునే అవకాశముంది. అలాంటప్పుడు తాను సమాధానం ఇవ్వాలా లేదా అన్నది ప్రధాని నిర్ణయించుకోవచ్చు. 


ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం, ఉద్దేశం లేనప్పటికీ- ఒక ప్రత్యేకమైన అంశాన్ని లోక్‌సభలో చర్చకు లేవదీయాలన్న వ్యూహంతోనే విపక్షాలు ‘అవిశ్వాస’ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటాయి. భారత రాజకీయాల్లో ఇటువంటి చారిత్రక సందర్భాలెన్నో! దేశంలో తొలిసారిగా 1963లో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆచార్య జె.బి.కృపలానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నాడు దానిపై నాలుగు రోజుల పాటు 21గంటల సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తం 40మంది ఎంపీలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచారు. అనంతరం నెహ్రూ ఇచ్చిన సమాధానం విపక్ష సభ్యుల మన్ననలూ పొందింది. ‘అధికారంలో ఉన్న పార్టీని ఆ స్థానం నుంచి కూలదోయడానికో, లేదంటే ఆ ఉద్దేశంతోనో అవిశ్వాస తీర్మానం తీసుకొస్తారు. కృపలానీ ప్రవేశపెట్టిన తీర్మానంలో అసలు అలాంటి ఉద్దేశమే లేదేదన్నది విస్పష్టం. కేవలం చర్చ కోసమే దీన్ని తీసుకురావడం ఎంతో ఆసక్తికరం. మరెంతో ప్రయోజనకరం కూడా. వ్యక్తిగతంగా నేను సైతం చర్చ కోసం ఈ తీర్మానాన్ని ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం ముందుకు తరచూ ఇలాంటి పరీక్షలు రావడం మంచిది’ అని నెహ్రూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చిందీ ఈ ఉద్దేశంతోనే!


ఇది రెండోసారి..

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2018, జులై 20న విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అప్పుడా తీర్మానాన్ని 325మంది సభ్యులు వ్యతిరేకించగా, కేవలం 126మంది ఎంపీలే బలపరచారు. ఆ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ- 2023లోనూ తమ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి అదే నాంది అవుతుందంటూ జోస్యం చెప్పారు. ఆ తరవాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. మరి తదుపరి ఎన్నికల్లో మోదీ చెప్పిన జోస్యమే నిజమవుతుందా?


కుప్పకూలిన దేశాయ్‌ సర్కారు

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరవాతి నుంచి 2018 వరకు లోక్‌సభలో మొత్తం 27 అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిలో 15కు పైగా ఒక్క ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చినవే! 1979లో మొరార్జీ దేశాయ్‌ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు- చర్చ పూర్తికాకముందే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దాంతో తీర్మానంపై ఓటింగ్‌ జరగకుండానే నాటి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. భారత రాజకీయాల్లో అదో అరుదైన సందర్భం.


- వివేక్‌ కే అగ్నిహోత్రి

(విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్‌)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం

‣ అణు విద్యుదుత్పత్తి వైపు అడుగులు

‣ ఇరాక్‌తో ఇండియా చమురు బంధం

‣ జనవిశ్వాస్‌.. తగ్గనున్న కేసుల భారం

‣ ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!

Posted Date: 15-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం