• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం


జీవవైవిధ్య పరిరక్షణ చట్టం-2002 అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయినా నిర్దేశిత లక్ష్యాల సాధనలో సర్కారీ వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. చట్టం పటిష్ఠ అమలుకు అవసరమైన నిధులు, సిబ్బందిని సమకూర్చడం ద్వారా రాష్ట్రాల్లోని బోర్డులు, స్థానిక కమిటీలను బలోపేతం చేయడం ఎంతో అవసరం. దీన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవవైవిధ్య చట్టం (సవరణ) బిల్లు- 2023కు పార్లమెంటు ఆమోదం తెలిపింది.


పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రత, సుస్థిర ఉపాధుల కల్పనకు జీవవైవిధ్య పరిరక్షణ ఎంతో అవసరం. అరుదైన జీవజాతుల ఉనికి, ప్రకృతి సమతుల్యత వంటి అంశాలెన్నో దీనితో ముడివడి ఉన్నాయి. దశాబ్దాల తరబడి జీవవైవిధ్య వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు ఆశించిన రీతిలో దృష్టి పెట్టలేదు. ఫలితంగా ప్రకృతి వనరులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. 1992 నాటి రియో జీవవైవిధ్య పరిరక్షణ ఒప్పందానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకొచ్చింది. స్థానికుల భాగస్వామ్యంతో ప్రకృతి వనరుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయాలని; జీవవైవిధ్య, జన్యుపరమైన వనరుల వాణిజ్యంలో లాభాలను స్థానికులకు అందించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఈ లక్ష్యాల సాధనలో ప్రభుత్వ యంత్రాంగాలు రెండు దశాబ్దాలుగా తడబడుతూనే ఉన్నాయి.


అమలుకాని నిబంధనలు

జీవవైవిధ్య చట్ట నిబంధనలను అమలు చేసేందుకు చెన్నై కేంద్రంగా జాతీయ జీవవైవిధ్య అథారిటీ, రాష్ట్రాల్లో జీవవైవిధ్య మండళ్లను నెలకొల్పారు. పంచాయతీలు, పురపాలికల స్థాయిలో జీవవైవిధ్య యాజమాన్య సంఘాలను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజా జీవవైవిధ్య రిజిస్టర్లను రూపొందించాలి. విలువైన వనరులుండే ప్రదేశాలను పరిరక్షించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సూక్ష్మజీవరాశులు, పశువులు, ఇతర జీవజాతులు, పురాతన సంప్రదాయ పంటలకు సంబంధించిన వివరాలను రిజిస్టరులో నమోదు చేసి, వాటిని రక్షించడం ఈ సంఘాల కర్తవ్యం. కానీ, ఈ నిబంధనలను అమలుచేసే యంత్రాంగాలను పరిపుష్టం చేయడంపై చాలా రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచలేదు. చట్టం అమలు తీరు నిరాశాజనకంగా ఉండటంతో 2018 ఆగస్టులో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఆరు నెలల్లో జీవవైవిధ్య కమిటీలను ఏర్పాటుచేసి, రిజిస్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని పర్యావరణ మంత్రిత్వశాఖ, జాతీయ అథారిటీలను ఆదేశించింది. దాంతో కమిటీల ఏర్పాటు జోరందుకొంది. జాతీయ అథారిటీ గణాంకాల ప్రకారం- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,77,223 జీవవైవిధ్య కమిటీలు ఏర్పడి, 2,67,000 రిజిస్టర్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిబంధనల అమలు అంతంతమాత్రంగానే ఉంటోంది. ముఖ్యంగా సున్నితమైన జీవవైవిధ్య వనరులు, ప్రదేశాలను గుర్తించి, వాటిని పరిరక్షించేందుకు అవసరమైన శిక్షణ కొరవడుతోంది. ఆయుర్వేద, యోగ, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి రంగాల్లో జీవవైవిధ్య, జన్యుపరమైన వనరుల ద్వారా సమకూరే వాణిజ్య ఆదాయంలో స్థానికులకు వాటా ఇవ్వాలన్నది చట్ట నిబంధన. ఈ ప్రక్రియలో భాగంగా జీవవైవిధ్య బోర్డుల నుంచి ఔషధ సంస్థలు అనుమతి తీసుకోవాలి. వాటి నుంచి వసూలయ్యే వాణిజ్య రుసుమును జీవవైవిధ్య కమిటీల ద్వారా వనరుల పరిరక్షణ, పునర్ధురణకు వినియోగించాలి. ఏళ్ల తరబడి అమలుకు నోచుకోని ఈ నిబంధనలను ఇప్పుడు చట్ట సవరణ ద్వారా మరింత బలహీనపరచడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


జీవవైవిధ్య చట్ట సవరణ బిల్లును 2021 డిసెంబరులో లోక్‌సభలో ప్రవేశ పెట్టినప్పటి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విదేశీ పెట్టుబడులు, పరిశోధన, మేధో హక్కులు, వాణిజ్య అవసరాలతో ముడివడిన బిల్లులపై పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ సంప్రతింపుల జోలికి వెళ్ళకుండా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం, బిల్లులో ఔషధ పరిశ్రమల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దాంతో బిల్లును సమీక్ష నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపగా, నిరుడు ఆగస్టులో నివేదిక సమర్పించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చట్ట నిబంధనలను సమర్థంగా అమలు చేయడానికి తాజా సవరణలు దోహదపడతాయని పర్యావరణ మంత్రిత్వశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ వ్యాఖ్యానించారు.


చిత్తశుద్ధితో కృషి..

ఒక పక్క దేశంలోని జీవవైవిధ్య వ్యవస్థలు, వనరులు ప్రమాదంలో పడుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సున్నిత, అటవీ, తీర ప్రాంత ప్రకృతి వ్యవస్థలు, అరుదైన వృక్ష జాతులు, వన్యప్రాణుల సంతతి వేగంగా అంతరిస్తుండటం ఆందోళనకరం. అభివృద్ధి పేరిట అటవీ, తీర ప్రాంతాలతో పాటు మడ, చిత్తడి భూములను చేజేతులా కాలుష్య కాసారాలుగా మార్చడం.. వ్యర్థాల పారబోతను సమర్థంగా కట్టడి చేయకపోవడంవల్ల జీవవైవిధ్య వ్యవస్థలపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటున్నాయని కాగ్‌ ఇటీవలే ఎండగట్టింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిరుడు మాంట్రియల్‌ వేదికగా కుదిరిన చారిత్రక అంతర్జాతీయ జీవవైవిధ్య ఒప్పందంపై భారత్‌ సంతకం చేసింది. ఈ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవాలంటే- అందుబాటులో ఉన్న వనరులను సుస్థిర ప్రాతిపదికన వినియోగించుకోవాలి. భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేలా ప్రభుత్వ వ్యవస్థలు చిత్తశుద్ధితో జీవవైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలి. ఈ క్రతువులో స్థానిక సమూహాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలి.


వనరులపై అపరిమిత స్వేచ్ఛ!

జీవవైవిధ్య చట్ట సవరణ బిల్లు-2023లో ఆయుష్‌ ఔషధ పరిశ్రమకు పెద్దపీట వేశారు. జీవవైవిధ్య వనరుల ద్వారా దేశీయ సంస్థల నుంచి సమకూరే ఆదాయంలో స్థానికులకు చెందాల్సిన లాభాల్లో వాటా పంపకానికి సంబంధించిన నిబంధనలను తొలగించారు. లాభాల పంపకాన్ని సమర్థంగా అమలుచేస్తే స్థానికుల సహకారంతో వనరుల పరిరక్షణ మెరుగ్గా ఉంటుందంటూ వివిధ రాష్ట్రాల బోర్డులు, కేంద్ర పంచాయతీరాజ్‌ సంస్థలు పార్లమెంటరీ సంఘానికి విన్నవించినా మన్నన దక్కలేదు. స్థానికుల సంప్రదాయ విజ్ఞాన హక్కులను విస్మరించి, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ‘బయో పైరసీ’పై అంతర్జాతీయ వేదికల్లో గట్టిగా వాదించే ఇండియా- దేశీయ కంపెనీలకు జీవవైవిధ్య వనరులపై అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడం నివ్వెరపరచేదే! సాగుచేసిన, ప్రైవేటు భూముల్లో పెంచిన జీవవైవిధ్య వనరుల ద్వారా జరిగే వాణిజ్య లావాదేవీలపై ఇంతవరకూ ఉన్న ఆంక్షలను తాజా బిల్లులో ఎత్తివేశారు. విదేశీ కంపెనీలు, విదేశీ భాగస్వామ్యం కలిగిన సంస్థలు జీవవైవిధ్య వనరులను వినియోగించుకునేందుకు జాతీయ అథారిటీ అనుమతిని తప్పనిసరి చేశారు. జీవవైవిధ్య వనరులను ధ్వంసం చేసేవారికి లక్ష రూపాయల నుంచి రూ.50లక్షల వరకు జరిమానా, అయిదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని 2002 నాటి చట్టం చెబుతోంది. తాజా బిల్లులో ఈ నిబంధనను సవరించారు. జైలు శిక్షను పూర్తిగా తొలగించి, జరిమానాను రూ.10లక్షలకు పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అణు విద్యుదుత్పత్తి వైపు అడుగులు

‣ ఇరాక్‌తో ఇండియా చమురు బంధం

‣ జనవిశ్వాస్‌.. తగ్గనున్న కేసుల భారం

‣ ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!

Posted Date: 15-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం