• facebook
  • whatsapp
  • telegram

సమ సమాజమే ప్రగతి మార్గం!నిరుడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందించాలనే స్వప్నాన్ని ఆవిష్కరించారు. కొద్దిరోజుల క్రితం తాను మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైతే ఇండియాను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతానని ప్రకటించారు. అసలు అభివృద్ధికి ప్రమాణాలు ఏమిటి, సగటు భారతీయుడికి అభివృద్ధి ఫలాలు చేరువవుతున్నాయా?


భారతదేశం 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా. అంటే జర్మనీ, జపాన్‌లను సైతం వెనక్కునెట్టి అమెరికా, చైనాల తరవాతి స్థానాన్ని ఇండియా ఆక్రమిస్తుందన్నమాట. ఈ లెక్కన 2047కల్లా భారత్‌ నిజంగానే ధనిక దేశమవుతుందా, అభివృద్ధి ఫలాలను అట్టడుగు ప్రజానీకం ఆస్వాదిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014లో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు స్థూల దేశీయోత్పత్తి పరంగా ప్రపంచంలో భారత్‌ పదో స్థానాన్ని ఆక్రమించింది. 2022 వచ్చేసరికి అయిదో స్థానానికి ఎగబాకింది. అయినా దేశ ప్రజల జీవన ప్రమాణాలేమీ మెరుగుపడలేదు. ప్రపంచంలో అత్యధిక పేద ప్రజలున్న భారత్‌- శత కోటీశ్వరుల సంఖ్యలో మాత్రం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచబ్యాంకు ‘స్థూల జాతీయాదాయం(జీఎన్‌ఐ)’ పరంగా దేశాలను అల్పాదాయ, అల్ప మధ్యాదాయ, ఎగువ మధ్యాదాయ, అధికాదాయ దేశాలుగా వర్గీకరించింది. ప్రస్తుతం భారత్‌ 2,170 డాలర్ల (సుమారు రూ.1.79లక్షల) తలసరి ఆదాయంతో అల్ప మధ్యాదాయ దేశంగానే ఉంది. 13,205 డాలర్ల (సుమారు రూ.10.92లక్షల) తలసరి జీఎన్‌ఐని అందుకుంటే తప్ప భారత్‌ అధికాదాయ దేశంగా నిలవలేదు. భారత్‌ జీఎన్‌ఐ వృద్ధిరేటు ఏటా 9-10శాతం చొప్పున పెరిగితేనే 2047 నాటికి అధికాదాయ దేశంగా అవతరిస్తుంది.


పెరుగుతున్న ఆర్థిక అంతరాలు

ఒక దేశ వాస్తవ అభివృద్ధికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నిజంగా కొలమానమవుతుందా అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జీడీపీ అనేది నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తుసేవలను మాత్రమే గణిస్తుంది. అది ఆ దేశ ప్రజల సుఖసంతోషాలను ప్రతిబింబించదు. జీడీపీలో మద్యం, సిగరెట్ల అమ్మకాలు, వాటిపై వాణిజ్య ప్రకటనలు, కారాగారాల మీద పెట్టే ఖర్చు, అణ్వాయుధాల తయారీ వ్యయం వంటివీ కలిసి ఉంటాయి. అవి బాలలకు లభించే విద్యావైద్యాలను ప్రతిబింబించవు. అందుకే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమ సంస్థ (యూఎన్‌డీపీ) ఆర్థికవేత్తలు ప్రజాశ్రేయస్సుకు కొలమానంగా 1990లో మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)ని రూపొందించారు. అది ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలనూ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆయుష్షూ పెరుగుతుంది. విద్యాప్రమాణాలు జీవనోపాధికి, మనో వికాసానికి పునాది వేస్తాయి. కాబట్టి, కేవలం తలసరి ఆదాయం లేదా జీఎన్‌ఐని మాత్రమే కాకుండా విద్య, వైద్య, జీవన ప్రమాణాలనూ పరిగణనలోకి తీసుకుంటే ప్రజల వాస్తవ స్థితిగతులు అవగతమవుతాయి. హెచ్‌డీఐ సూచీలో జర్మనీ, అమెరికా, జపాన్‌లు వరసగా 9, 17, 19 ర్యాంకులను ఆక్రమిస్తున్నాయి. అధిక జనాభా కలిగిన చైనాది 79వ స్థానం. ఈ సూచీలో భారత్‌ 132వ స్థానానికి పరిమితమైంది. బంగ్లాదేశ్‌ (129), శ్రీలంక (73)లు మెరుగైన స్థానాల్లో నిలుస్తున్నాయి.


భారత్‌, చైనాల జనాభా దాదాపు సమానమే అయినప్పటికీ, తలసరి ఆదాయంలో డ్రాగన్‌ దేశం ఎంతో ముందున్నది. 2022లో చైనా తలసరి ఆదాయం (జీఎన్‌ఐ) 12,720 డాలర్లు. భారత్‌ కేవలం 2,388 డాలర్లతో సరిపెట్టుకొంది. చిత్రమేమంటే 2021లో అమెరికా, చైనాల తరవాత అత్యధిక కుబేరులు ఉన్నది భారతదేశంలోనే! ఇండియాలో అత్యున్నత అంచెలోని ఒక శాతం పౌరుల చేతిలో 22శాతం జాతీయ సంపద పోగుపడగా, అట్టడుగు ప్రజానీకం కేవలం 13శాతం సంపదతో నెట్టుకొస్తోందని 2022నాటి ప్రపంచ అసమానతల నివేదిక వెల్లడించింది. భారత్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు జనాభాలో ఒక శాతంగా ఉన్న అతి సంపన్నులకు మాత్రమే ఉపకరించాయన్న విశ్లేషణలు ఉన్నాయి. దేశంలోని 21 మంది అపర కుబేరుల వద్ద కింది అంచెలోని 70కోట్ల మంది భారతీయులకన్నా ఎక్కువ సంపద పోగుపడిందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది. ఆదాయంతోపాటు కుల, మత, లింగ భేదాలూ అసమానతలకు దారితీస్తున్నాయి. మన జాతీయ ఆదాయంలో కేవలం 18శాతమే మహిళలకు దక్కుతోంది. ప్రపంచంలో మరే దేశంలోనూ మహిళలకు ఇంత తక్కువ వాటా లేదు.


ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి పట్టం

దేశంలో గత దశాబ్దకాలంలో రేవులు, విద్యుత్‌ కేంద్రాలు, విమానాశ్రయాలు, చమురు, గనులు, బ్యాంకింగ్‌ రంగాల్లో ఆశ్రిత పెట్టుబడిదారుల వాటా పెరిగింది. అంతర్జాతీయంగా ఆశ్రిత పెట్టుబడిదారుల సంపద పెరుగుదలలో 60శాతం అమెరికా, చైనా, రష్యా, భారత్‌లలోనే నమోదైంది. ‘ది ఎకనామిస్ట్‌’ పత్రిక 2023 సంవత్సరానికి ప్రచురించిన ఆశ్రిత పెట్టుబడిదారీ సూచీలో భారత్‌ పదో స్థానంలో నిలవగా, చైనా 21వ స్థానంలో ఉంది. 26వ స్థానంలో నిలిచిన అమెరికా ఈ విషయంలో ఎంతో మెరుగనే చెప్పాలి. మొత్తం 43 పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 36, 37వ స్థానాల్లో నిలిచిన జపాన్‌, జర్మనీలు ఆశ్రిత పెట్టుబడిదారులను పెద్దగా ప్రోత్సహించవని తేలింది. భారతదేశం కేవలం ఆర్థికాభివృద్ధి సాధనపైనే దృష్టి పెట్టకుండా మానవాభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి. కేంద్రం, రాష్ట్రాలు అందుకు అనువైన విధానాలను చిత్తశుద్ధితో అమలుచేయాలి. విద్యావైద్యాలపై భారత్‌ కన్నా అనేక పేద దేశాలు ఎక్కువ నిధులను ఖర్చు చేస్తున్నాయి. ఆఫ్రికాలో సహారా ఎడారి దిగువనున్న పేద దేశాలు సైతం తమ జీడీపీలో ఏడు శాతాన్ని విద్యావైద్యాలకు వెచ్చిస్తున్నాయి. ఇండియా మాత్రం ఇందుకు జీడీపీలో 4.7శాతమే ఖర్చు పెడుతోంది. దేశంలోని 40 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం తక్షణావసరం. రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. అసమానతలు లేని సమాజ సృష్టికి పార్లమెంటు చిత్తశుద్ధితో అంకితమవ్వాలి. అప్పుడే- అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఆవిష్కృతమవుతుంది.


పురోగతికి మార్గ సూచీ

భారత్‌ 2047కల్లా అభివృద్థి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి ఏమేం చేయాలో 23 మంది ప్రఖ్యాత ఆర్థికవేత్తలు ‘ఇండియా 2047-హై ఇన్‌కమ్‌ విత్‌ ఈక్విటీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. సమీర్‌ కొచ్చర్‌ సంకలనం చేసిన ఈ వ్యాసాల సంపుటిలో ఆర్థికవేత్తలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి, చిరు వ్యాపారులకు రుణ లభ్యత పెంచాలన్నారు. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాల పెంపు, ద్రవ్యోల్బణ కట్టడి, మౌలిక వసతుల విస్తరణ వంటి సిఫార్సులు చేశారు. అసమానతలు లేని అభివృద్ధి సాధనకు కావలసిన విధానాలు, చట్టాలను పార్లమెంటు రూపొందించి సమర్థంగా అమలు చేయాలన్న మేలిమి సూచనలిచ్చారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పత్రికా స్వేచ్ఛకు ముప్పు

‣ కృత్రిమ మేధా.. భస్మాసుర హస్తమా?

‣ పోక్సో కేసులపై మీమాంస

‣ ఏమవుతుంది.. అవిశ్వాసం?

‣ జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం

Posted Date: 15-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం