• facebook
  • whatsapp
  • telegram

కృత్రిమ మేధా.. భస్మాసుర హస్తమా?



ఒకప్పుడు సైన్స్‌ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందా, మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో ఉద్యోగాలకు ఏఐ ఎసరుపెడుతుందని, మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. ఏఐ ప్రపంచంలో గొప్ప అవకాశాలతోపాటు అనిశ్చితులూ మన కోసం ఎదురుచూస్తున్నాయి.


మనిషిని మించిపోతుందా?

ఏఐ విషయంలో మనల్ని ముసురుకొంటున్న అనుమానాలు, భయాలు వాస్తవికమేనా అన్నది పరిశీలించుకోవడం ఎంతో ముఖ్యం. భావోద్వేగాలు, సృజనాత్మకత, అనుభూతి చెందడం వంటివి మానవుడికే సొంతం. ఏఐ ఎప్పటికైనా ఈ లక్షణాలను అందిపుచ్చుకొంటుందా అన్నది కీలక ప్రశ్న. ఏఐ అపార సమాచార రాశిని సంగ్రహించి విశ్లేషించగలదు. మెదడుకన్నా వేల రెట్లు వేగంగా గణిత ప్రశ్నలకు జవాబులివ్వగలదు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మానవ మెదడు ఒక ఎగ్జాబైట్‌ (100 కోట్ల గిగాబైట్ల) సమాచారాన్ని వడపోసి విశ్లేషించగలదు. జపాన్‌ రూపొందించిన సూపర్‌ కంప్యూటర్‌ ఫుగాకు సెకనుకు ఒక క్వాడ్రిలియన్‌ (1,00,000 కోట్ల) గణాంకాలు (కాలిక్యులేషన్లు) పూర్తిచేయగలదు. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు సమాచార గణనలో ఏఐ మానవ మస్తిష్కానికి అందనంత దూరాలకు వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు. అందుకే, ఏఐ సచేతన స్థితిని అందుకుని మానవ మనుగడకు ముప్పుతెస్తుందంటూ హాలీవుడ్‌ సినిమాలు భయపెడుతుంటాయి. ప్రస్తుతానికి ఏఐకి అంత శక్తి లేదు. దానికి మానవుడి మల్లే కోరికలు లేవు. చెప్పింది చేయడం తప్ప తానే ఏదో సాధించాలనే లక్ష్యాలు దానికి లేవు. స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తి, ఆ అవసరమూ దానికి లేవు. అది మనిషి చేతిలోని సాధనం మాత్రమే. అందుకే కంపెనీలు వివిధ విభాగాల్లో పనులకు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి.


ఏఐని 2020 సంవత్సరంలో 50శాతం కంపెనీలు ఏదో ఒక వ్యాపార పనికి వినియోగించినట్లు మెకిన్సే సంస్థ తెలిపింది. అంతకు మూడేళ్ల క్రితం 20శాతం కంపెనీలే ఏఐని అలా ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు ఏఐ వినియోగం విపరీతంగా పెరిగింది. ఆరోగ్య సంరక్షణ నుంచి ఆర్థికాంశాల వరకు అన్ని సంస్థలూ దీన్ని ఉపయోగిస్తున్నాయి. క్యాన్సర్‌ను 94శాతం కచ్చితత్వంతో గుర్తించే సత్తా కృత్రిమ మేధ ప్రదర్శిస్తోందని గూగుల్‌ హెల్త్‌ 2020లో వెల్లడించింది. ఏఐ మున్ముందు మనిషి నియంత్రణ నుంచి తప్పిపోవచ్చనే భయాల మధ్య అసలు దాన్ని పెంచి పోషించడం మంచిదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. కృత్రిమ మేధను తెలివిగా ఉపయోగించడం, దాన్ని మరింతగా అభివృద్ధి చేసేటప్పుడు దూరదృష్టితో భవిష్యత్‌ ప్రమాదాలను యోచించి విజ్ఞతతో వ్యవహరించడం ఎంతో అవసరం. నైతిక విలువలు పాటిస్తూ అందరికీ మేలు చేసేలా... జటిల సమస్యలను పరిష్కరించి జీవితాలను సౌకర్యవంతంగా మార్చేలా ఏఐని ఉపయోగించుకోవాలి.


కొత్త ఉద్యోగాల వెల్లువ..

కృత్రిమ మేధ వల్ల నైపుణ్యాల అవసరంలేని పనులు అదృశ్యమవుతాయి. దాంతో అలాంటి ఉద్యోగాలు ఇకపై ఉండవు. అదేసమయంలో నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త తరహా కొలువులు పుట్టుకొస్తాయి. ఇలా 2025కల్లా 8.6 కోట్ల ఉద్యోగాలు అదృశ్యమైనా, 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రపంచ ఆర్థిక వేదిక లెక్కగట్టింది. కొత్తతరహా ఉద్యోగాలకు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నవారు అవసరం. కాబట్టి, అందుకు తగ్గట్లు మన యువతను తయారు చేసుకోవాలి. అంతరిక్ష పరిశోధనలకు కృత్రిమ మేధే ఊపిరి. అది చంద్రుడు, కుజ గ్రహాల పరిశోధనలకు కొత్త ఊపు తీసుకొస్తోంది. 2020లో కుజ గ్రహం మీద పెర్సెవరెన్స్‌ రోవర్‌ దిగి, చుట్టుపక్కల అన్వేషించడానికి ఇదే తోడ్పడింది. భవిష్యత్తులో ఇతర గ్రహాలకు జరిపే యాత్రలకూ ఏఐ చోదకశక్తి కానున్నది. 2027కల్లా అంతర్జాతీయ ఏఐ మార్కెట్‌ 73,300 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. మార్కెట్‌లో దూసుకెళ్ళేందుకని విచక్షణారహితంగా పోటీ పడుతూ ఏఐని స్వార్థానికి ఉపయోగించుకోవడం మొదటికే మోసం తెస్తుంది. సరైన నైతిక ప్రమాణాలు, నియంత్రణలను పాటిస్తూ ఆ ముప్పును నివారించాలి. కృత్రిమ మేధ భస్మాసుర హస్తం కాకుండా చూసుకోవలసిన బాధ్యత- మనిషిదే!


- ఎం.గౌరీశంకర్‌ (సాంకేతిక రంగ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోక్సో కేసులపై మీమాంస

‣ ఏమవుతుంది.. అవిశ్వాసం?

‣ జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం

‣ అణు విద్యుదుత్పత్తి వైపు అడుగులు

‣ ఇరాక్‌తో ఇండియా చమురు బంధం

‣ జనవిశ్వాస్‌.. తగ్గనున్న కేసుల భారం

‣ ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!

Posted Date: 15-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం