• facebook
  • whatsapp
  • telegram

పత్రికా స్వేచ్ఛకు ముప్పు



దినపత్రికలు, నిర్దిష్ట కాలవ్యవధిలో వెలువడే ఇతర పత్రికల రిజిస్ట్రేషన్‌ బిల్లును ఇటీవల రాజ్యసభ ఆమోదించింది. అందులోని కొన్ని నిబంధనలు పత్రికా స్వేచ్ఛను హరించేలా ఉన్నాయన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పత్రికా స్వేచ్ఛలో భారత్‌ 161వ స్థానంలో నిలుస్తోంది. ఇలాంటి శాసనాలు పత్రికా స్వేచ్ఛను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది.


వలస పాలననాటి చట్టాలను రద్దు చేసి, వ్యాపార సౌలభ్యం కల్పిస్తామనే మిషతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పత్రికా స్వేచ్చకు కళ్లాలు బిగించాలని చూస్తోందా? ఇటీవల రాజ్యసభ ఆమోదించిన దినపత్రికలు, నిర్దిష్ట కాలవ్యవధిలో వెలువడే ఇతర పత్రికల (పీరియాడికల్స్‌) రిజిస్ట్రేషన్‌ బిల్లుపై ఇదే సందేహం వ్యక్తమవుతోంది. ఇది 1867నాటి పత్రికలు, పుస్తకాల రిజిస్ట్రేషన్‌ (పీఆర్బీ) చట్టం స్థానంలో అమలులోకి వస్తుంది. ఈ బిల్లుపై చర్చకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ సమాధానమిచ్చారు. సమాచార సాధనాలకు, ప్రచురణ రంగానికి వ్యాపార సౌలభ్యం కల్పించడానికే ఈ బిల్లు తెచ్చామని వివరించారు. ఆయన మాటలను భారత సంపాదకుల సంఘం (ఎడిటర్స్‌ గిల్డ్‌-ఈజీఐ) ఏమాత్రం విశ్వసించడం లేదు.


దుర్వినియోగ భయం

భారత్‌లో వార్తల ప్రచురణకు ఈ బిల్లు ఆటంకాలు సృష్టించకూడదని ఎడిటర్స్‌ గిల్డ్‌ కోరింది. ప్రచురణకర్తల కార్యకలాపాల్లోకి తనిఖీల పేరుతో రిజిస్ట్రార్‌ చొరబడకూడదని సూచించింది. రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌కే పరిమితం కావాలి తప్ప రెగ్యులేషన్‌ (నియంత్రణ)కు దిగకూడదని కోరింది. పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని, నియంత్రణ సంస్థలు ఇష్టానుసారం పత్రికల కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని, వాటిని మూసివేయించడానికి తమ అధికారాలను దుర్వినియోగం చేయకూడదని సూచించింది. లోక్‌సభ ఈ బిల్లును పార్లమెంటు సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపి, లోతైన చర్చకు అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. దేశ భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తి తన పత్రికను రిజిస్టర్‌ చేయించుకోవడానికి ఈ బిల్లు అనుమతించదు. ఇప్పటికే నమోదైన పత్రిక రిజిస్ట్రేషన్‌ను ఇదే కారణంపై రద్దు చేయవచ్చు. 1967నాటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) నిబంధనలను, అటువంటి ఇతర శాసనాలను ఇప్పటికే నిరంకుశంగా ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలినవారు ఈ చట్టాలకు తమకు అనువైన భాష్యాలు చెబుతూ ప్రత్యర్థులను శిక్షిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు దినపత్రికలు, వార, పక్ష మాస తదితర పత్రికల రిజిస్ట్రేషన్‌ బిల్లు నిబంధనలను వారు దుర్వినియోగం చేయరన్న నమ్మకం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. పాత్రికేయులను, పత్రికా ప్రచురణకర్తలను శిక్షించడానికి నూతన చట్టాన్ని ప్రయోగించే ప్రమాదం ఉందన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఏదైనా పత్రికా కార్యాలయంలోకి ప్రవేశించి, తనిఖీలు చేసి, పత్రాలు స్వాధీనం చేసుకుని, ప్రశ్నలు అడిగే అధికారాన్ని బిల్లు పత్రికా రిజిస్ట్రార్‌కు కట్టబెట్టడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ప్రశ్నిస్తోంది.


సుదీర్ఘ నిర్బంధం

రిజిస్ట్రేషన్‌, దాని రద్దు విషయంలో ఉగ్రవాద చర్య, చట్టవిరుద్ధ కార్యకలాపాలు అనే పదాలకు యూఏపీఏ చట్టమిచ్చే నిర్వచనాలే వర్తిస్తాయని కొత్త బిల్లు పేర్కొంటోంది. ఇప్పటికే యూఏపీఏ నిబంధనల దుర్వినియోగం జరిగిందని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. సిద్దిఖ్‌ కప్పన్‌ అనే పాత్రికేయుడి ఉదంతమే దీనికి నిదర్శనం. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో సామూహిక మానభంగం, హత్య ఉదంతంపై వార్త రాయడానికి వెళ్తున్న కప్పన్‌ను 2020 అక్టోబర్‌లో యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై యూఏపీఏ చట్టంతో పాటు భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 2020నాటి సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం కిందా అనేక కేసులు పెట్టారు. వాటిలో మొదటి కేసులో ఆయనకు సుప్రీంకోర్టు 2022 సెప్టెంబరులో బెయిలు ఇచ్చింది. అయినా, వేరే కేసులో దర్యాప్తు జరుగుతోందంటూ పోలీసులు కప్పన్‌ను జైల్లోనే ఉంచారు. రెండో కేసులో డిసెంబరు 23న అలహాబాద్‌ హైకోర్టు బెయిలు ఇచ్చింది. విధానపరమైన ఆలస్యాలంటూ పోలీసులు ఆయన్ను ఫిబ్రవరి రెండు వరకు జైలులో ఉంచారు. ఏతావతా 850 రోజులపాటు కప్పన్‌ జైలులో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు. పాత్రికేయులను ఇలా దీర్ఘకాలం నిర్బంధించిన ఘటనలు మరికొన్ని జరిగాయి. దినపత్రికలు, నిర్దిష్ట కాలవ్యవధిలో వెలువడే ఇతర పత్రికల రిజిస్ట్రేషన్‌ బిల్లు-2023 నిబంధనల అమలుకు విధివిధానాలను నిర్ణయించే అధికారాన్ని బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తోంది. ఇలాంటి అధికారాన్ని పదేపదే దుర్వినియోగం చేయడం చూస్తూనే ఉన్నాం. వివిధ చట్టాల కింద నియమ నిబంధనలను రూపొందించే అధికారాన్ని ఏకపక్షంగా, అతిగా ఉపయోగించడం రివాజు అయిపోయింది. 2021, 2023 సమాచార సాంకేతిక చట్టం నిబంధనల విషయంలో జరిగింది ఇదే. ఏ నిబంధనలైనా చట్టంలోనే పొందుపరచాలి తప్ప మళ్ళీ ప్రత్యేకంగా వాటి రూపకల్పన, అమలు అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టడం సరికాదు.


- ఆర్‌.కె.మిశ్రా (సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కృత్రిమ మేధా.. భస్మాసుర హస్తమా?

‣ పోక్సో కేసులపై మీమాంస

‣ ఏమవుతుంది.. అవిశ్వాసం?

‣ జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం

Posted Date: 15-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం