• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యానికి చిరునామా.. దక్కన్‌ పీఠభూమి



బసాల్ట్‌, గ్రానైట్‌ తదితర శిలలతో కూడుకొని ఉండే దక్కన్‌ పీఠభూమి విలువైన ఖనిజాలకు, ఎన్నో జీవజాతులకు నెలవు. అందమైన కొండలు, ఆశ్చర్యపరచే ఆకృతుల్లో ఉండే భారీ శిలలు దక్కన్‌ ప్రాంతంలో ఎన్నో! గనుల తవ్వకాలు, పట్టణీకరణ మూలంగా ఇక్కడి కొండలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా వాటిలోని జీవవైవిధ్యమూ దెబ్బతింటోంది.


దక్కన్‌ పీఠభూమిలో వ్యాపించి ఉన్న గ్రానైట్‌ రాళ్లు 250 కోట్ల సంవత్సరాల క్రితం భూ పటలం ఘనీభవించి ఉద్భవించాయని పరిశోధనలు చెబుతున్నాయి. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఒక గ్రహ శకలం ఢీకొట్టడం వల్ల లావా ప్రవహించి కొన్నిచోట్ల నిచ్చెనమెట్ల వంటి భూ స్వరూపం(దక్కన్‌ ట్రాప్‌) ఏర్పడినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. విడివిడిగా ఉండే కొండలు, రాతి గుట్టలు దక్కన్‌ ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిని ఇన్సెల్‌బర్గ్స్‌గా పిలుస్తారు. వీటిలో క్రమక్షయంవల్ల భారీ బండరాళ్లు వివిధ ఆకారాలను సంతరించుకున్నాయి. ఇలాంటివి హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఎన్నో వృక్ష, జంతుజాతులు ఈ బండరాళ్లను ఆవాసంగా చేసుకొని జీవనం సాగిస్తాయి. బండరాళ్ల మధ్య, వాటి కింద, పగుళ్లలో ఏదో ఒక జీవజాలం ఉంటుంది. 


మానవ - ఎలుగుబంట్ల ఘర్షణ

రాతి ఆవరణ వ్యవస్థలో మాత్రమే జీవించే కొన్ని రకాల కప్పలు, తొండలు, బల్లులు, పాములు, పక్షులు, కీటకాలు... ఈ కొండల్లో కనిపిస్తాయి. గడ్డు పరిస్థితులను తట్టుకొని బతికే గడ్డిజాతులు, చిన్నమొక్కలు మొదలుకొని పెద్దగా పెరిగే మర్రిజాతుల వరకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ రాతి నిర్మాణాలు నీటికి, జలధారలకు నెలవులు. ఈ నీరే మానవ ఆవాసాలకు, వ్యవసాయానికి, పశుపోషణకు ఆధారంగా నిలుస్తోంది. దక్కన్‌ పీఠభూమిలోని చాలా పర్వత, రాళ్ల ప్రాంతాలు నేడు గనుల తవ్వకాలు, పట్టణీకరణ మూలంగా అదృశ్యమవుతున్నాయి. ఫలితంగా అక్కడ మాత్రమే జీవించే మొక్కలు, జంతుజాతులు క్రమంగా అంతరించి పోతున్నాయి. దక్కన్‌ పీఠభూమిలో గుహలను కలిగిన కొన్ని గుట్టలు ఎలుగుబంట్లకు ఆవాసాలుగా నిలుస్తున్నాయి. ఆ గుట్టల విధ్వంసం వల్ల మానవ-ఎలుగుబంట్ల ఘర్షణ తలెత్తుతోంది. సొసైటీ టు సేవ్‌ రాక్స్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు దక్కన్‌ పీఠభూమిలోని ప్రాకృతిక అద్భుతాలైన బండరాళ్లు, గుట్టల సంరక్షణకు కృషి చేస్తున్నాయి. రాక్‌ వాక్‌ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వాటిపై అవగాహన కల్పిస్తున్నాయి. దక్కన్‌ ప్రాంత కొండల్లో వ్యాపించి ఉండే వృక్ష, జంతుజాతులు, అక్కడి సామాజిక అంశాలకు సంబంధించి నిపుణులతో సర్వే చేయిస్తున్నాయి. కేవలం రెండు జిల్లాల్లోని రాతి గుట్టల్లో జరిపిన సర్వేలో 71 జాతుల ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, 207 రకాల పక్షిజాతులు ఉన్నట్లు తేలింది. ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన మరెన్నో మొక్కలు, అరుదైన సుగంధ, ఔషధ మూలికల చెట్లు ఉన్నాయని వెల్లడైంది. నడక, ట్రెక్కింగ్‌, వన్యప్రాణి పర్యాటకం తదితరాల ద్వారా స్థానికుల ఉపాధికి, ఆదాయానికి సైతం రాతి నిర్మాణాలు తోడ్పడతాయి. కెనడా, చైనా, అమెరికా, స్పెయిన్‌ తదితర దేశాలు ఇలాంటి భౌగోళిక వారసత్వ ప్రాంతాలను జియో పార్కులుగా అభివృద్ధి చేసి పరిరక్షిస్తున్నాయి.హైదరాబాద్‌లోనూ ఇరవై మూడు రాతి ప్రాంతాలను వారసత్వ ఆవరణలుగా గుర్తించారు. దుర్గం చెరువును ఆవరించి ఉన్న కొండల ప్రాంతం, శామీర్‌ పేట చెరువు చుట్టూ ఉన్న రాతి గుట్టలు, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగు ఆకారంలో ఉన్న భారీ రాయి తదితరాలు వాటిలో ఉన్నాయి.


సరైన చర్యలు అవసరం

విశిష్టమైన రాతి గుట్టలు కనుమరుగవుతున్న దృష్ట్యా వాటి పరిరక్షణకు పాలకులు చర్యలు తీసుకోవాలి. అలాంటి వాటిని గుర్తించి భౌగోళిక వారసత్వ పార్కులుగా ప్రకటించాలి. ఇప్పటికే వారసత్వ సంపదగా ప్రకటించిన వాటిని పరిరక్షించడం తప్పనిసరి. వాటిలోని జీవవైవిధ్యంపై అధ్యయనాలు జరగాల్సిన అవసరమూ ఉంది. రాతి గుట్టలు, వాటిలోని విశిష్ట ఆవరణ వ్యవస్థలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి. రాతి ఉద్యానవనాలను (రాక్‌ గార్డెన్లను) నెలకొల్పడానికి పాలకులు చర్యలు తీసుకోవాలి. భౌగోళిక వారసత్వ ప్రాంతాలు, అవశేషాల ముసాయిదా (పరిరక్షణ, నిర్వహణ) బిల్లును కేంద్రం ఇటీవల తెరపైకి తెచ్చింది. జాతీయ ప్రాముఖ్యం కలిగిన భౌగోళిక వారసత్వ ప్రాంతాలు, అవశేషాలుగల ప్రదేశాల అధ్యయనానికి, అవగాహనకు దీన్ని ఉద్దేశించారు. యునెస్కో ప్రపంచ సాంస్కృతిక ప్రాకృతిక వారసత్వసంపద సంరక్షణ ఒప్పందం-1972పై ఇండియా 1977లో సంతకం చేసింది. సహజమైన, చరిత్రాత్మక, పర్యావరణ పరమైన రాతి వారసత్వ సంపదను, దానిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. 


- ఎం.రామ్‌మోహన్‌ (సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బీమా ఆదుకొంటేనే రైతుకు ధీమా

‣ చైనా ప్రాజెక్టుకు బీటలు

‣ సమ సమాజమే ప్రగతి మార్గం!

‣ పత్రికా స్వేచ్ఛకు ముప్పు

Posted Date: 18-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం